సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదని.... ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి వైకాపా మద్దతిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ భాజపా పాలనే సాగుతోందని భావించాల్సి వస్తుందని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ

Published : 24 Jun 2022 05:39 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో మరోసారి ఎన్డీయేకే మద్దతిస్తున్నారా?
ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శైలజానాథ్‌

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదని.... ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి వైకాపా మద్దతిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ భాజపా పాలనే సాగుతోందని భావించాల్సి వస్తుందని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్‌ స్పష్టం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రెవెన్యూ లోటు భర్తీ చేయకపోయినా, రైల్వే జోన్‌, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టుకు తుది అంచనాల ప్రకారం నిధులు కేటాయించకపోయినా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పల్లెత్తి మాట్లాడకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

‘ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి వైకాపా మద్దతివ్వాలంటే మోదీ ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించాలి. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలేమిటో చెబుతూ యువతను రెచ్చగొట్టారు. ఇప్పుడు కేంద్రం మెడలు ఎందుకు వంచడం లేదు’ అని శైలజానాథ్‌ ప్రశ్నించారు. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా మద్దతు ఎన్డీయే కి అనివార్యమైనందున.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపాటు విభజన హామీలన్నీ నెరవేర్చేలా ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వెంటనే లేఖ రాయాలి’ అని శైలజనాథ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని