తేలని గనులశాఖ కార్యాలయాల పంచాయితీ

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకూ గనులశాఖ కార్యాలయాల ఏర్పాటుపై స్పష్టతరాలేదు. దాదాపు అన్నిశాఖలూ కొత్త కార్యాలయాలు

Published : 27 Jun 2022 05:24 IST

కొత్త జిల్లాల్లో ఇంకా ఏర్పాటు కాలేదు 

డీడీలు ఉండాల్సిందేనంటున్న గనులశాఖ

కుదరదంటున్న ఆర్థికశాఖ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకూ గనులశాఖ కార్యాలయాల ఏర్పాటుపై స్పష్టతరాలేదు. దాదాపు అన్నిశాఖలూ కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయగా, గనులశాఖలో మాత్రం ఇంకా గతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల సహాయ సంచాలకులు(ఏడీలు) పర్యవేక్షిస్తున్నారు. కొత్త కార్యాలయాల ఏర్పాటు విషయంలో గనులశాఖ ఓ వాదన వినిపిస్తుంటే, ఆర్థికశాఖ అలా కుదరదని తెగేసి చెబుతోంది. దీంతో ఈ పంచాయితీ తేలడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రతిశాఖలో జిల్లా అధికారి పోస్టులు ఏర్పాటు చేశారు. గనులశాఖలో ప్రస్తుతం కొంత ప్రాంతానికి సహాయ సంచాలకులు ఉన్నారు. పాత ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 22 మంది ఏడీలు ఉన్నారు. అలాగే ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ ఉప సంచాలకులు(డీడీ) ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో.. అనకాపల్లి మినహా మిగిలిన 12 జిల్లాల్లో కొత్తగా ఏడీ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే గతంలో 9 జిల్లాల్లో రెండేసి చొప్పున ఉన్న ఏడీ కార్యాలయాల్లో.. జిల్లా కేంద్రం కానిచోట ఉన్నవాటిని తొలగించి, కొత్త జిల్లా కేంద్రాలకు మార్పు చేయాలని భావించారు. ఉదాహరణకు ఉమ్మడి కడప జిల్లాలో కడప, ఎర్రగుంట్లలో ఏడీ కార్యాలయాలు ఉండగా.. ఇందులోని ఎర్రగుంట్ల ఏడీ కార్యాలయాన్ని కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి తరలించాలని భావించారు. ఇలా అదనంగా ఉన్న ఎర్రగుంట్ల, తాడిపత్రి, బనగానపల్లి, పలమనేరు, మార్కాపురం, దాచేపల్లి, నందిగామ, టెక్కలి వంటి కార్యాలయాల పరిధిలో మైనింగ్‌ కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో, వాటిని తరలిస్తే గనులశాఖ రాబడిపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అందుకే వీటిని అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. అనకాపల్లి మినహా మిగిలిన 12 కొత్త జిల్లాల్లో.. నూతనంగా ఏడీ కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనను ఆర్థికశాఖకు పంపారు. గనులశాఖ ప్రతిపాదనకు ఆర్థికశాఖ కొర్రీ వేసింది. కొత్త జిల్లాల్లో ఏడీ కార్యాలయాలకు అభ్యంతరంలేదని, అయితే గతంలో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న డీడీ కార్యాలయాలు, డీడీ పోస్టులు అవసరంలేదని తేల్చిచెప్పింది. డీడీ పోస్టులు తొలగించి, కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేసే ఏడీ కార్యాలయాల్లో డీడీలను సర్దుబాటు చేయాలని పేర్కొంది. గనులశాఖ మాత్రం గతంలో మాదిరిగా డీడీలు ఉండాలని, మైనింగ్‌ ప్లాన్లను  అనుమతించే అధికారం వారికే ఉందని వాదిస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎటూ తేలడంలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని