జీఎస్టీ మండలి సిఫార్సులు శిరోధార్యం కాదు

వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) విధానానికి సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలకమైన ఆదేశాలిచ్చింది. జీఎస్టీ మండలి చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధన

Updated : 20 May 2022 05:46 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తేనే అమల్లోకి : సుప్రీంకోర్టు

 దిల్లీ: వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) విధానానికి సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలకమైన ఆదేశాలిచ్చింది. జీఎస్టీ మండలి చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధన ఏమీ లేదని తెలిపింది. అయితే, మన దేశం సహకార సమాఖ్య విధానాన్ని అనుసరిస్తుంది కనుక కేంద్రం, రాష్ట్రాల మధ్య జీఎస్టీ మండలి ఒక అనుసంధాన కర్తగా పనిచేస్తుందని పేర్కొంది. పరస్పర సంప్రదింపుల ద్వారా పన్నుల విధింపుపై ఏకాభిప్రాయానికి రావడానికి జీఎస్టీ మండలి సిఫార్సులు దోహదపడతాయని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది. జీఎస్టీపై విడి విడిగా చట్టాలు చేసే అధికారం కేంద్రం, రాష్ట్రాలకు ఉంటుందని తెలిపింది. ‘రాజ్యాంగ అధికరణం 246ఎ ప్రకారం.. పన్నుల విధానంపై చట్టాలు చేయడానికి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభకు సమానమైన అధికారం ఉంది. అధికరణం 279 ప్రకారం...కేంద్రం, రాష్ట్రం దేనికదే స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ మండలి నిర్వహించే పాత్ర అత్యంత ప్రాధాన్యం కలిగి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్రం, రాష్ట్రాల పరస్పర సంప్రదింపుల తర్వాతనే జీఎస్టీ మండలి సిఫార్సులు చేయగలదని, ఇందులో ఏ ఒక్క పక్షానికి అధిక ప్రాధాన్యం ఉండబోదని పేర్కొంది. ఆ సిఫార్సులు రెండు పక్షాలకు ఆమోదయోగ్యమైతేనే పన్నుల చట్టాలు రూపొందుతాయంది. జీఎస్టీ చట్టం-2017 నిబంధనల్లో.. కేంద్ర, రాష్ట్రాల చట్టాల మధ్య వైరుధ్యం తలెత్తితే ఏమి చేయాలన్న విషయం లేదని తెలిపింది. అయితే, సామరస్య విధానంలో సమస్యను పరిష్కరించుకునేందుకు సముచితమైన సిఫార్సులను జీఎస్టీ మండలి చేస్తుందని మాత్రమే ఆ చట్టం పేర్కొందని ధర్మాసనం వెల్లడించింది. ధర్మాసనం తరఫున జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ 153 పేజీల తీర్పును రాశారు. జీఎస్టీ మండలిలో కేంద్రానికి 1/3వ వంతు ఓటు, రాష్ట్రాలన్నిటికీ కలిపి 2/3వ వంతు ఓటు ఉంటుందన్నారు. జీఎస్టీ మండలి ఆదేశాలను అమలుచేయకపోతే జీఎస్టీ వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందనే వాదనలను ఆయన తోసిపుచ్చారు. 

సముద్ర రవాణా సరకులపై ఐజీఎస్టీ విధింపునకు తిరస్కరణ

సముద్ర మార్గంలో దిగుమతి చేసుకున్న సరకులు/వస్తువులపై సమీకృత వస్తుసేవల పన్ను(ఐజీఎస్టీ) విధించడం చెల్లదంటూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. గుజరాత్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, మరికొందరు పిటిషన్లు దాఖలు చేయగా సుప్రీంకోర్టు ధర్మాసనం జీఎస్టీపై కీలకమైన రూలింగ్‌ ఇచ్చింది. మన దేశ పరిధిలో లేని వ్యక్తి సముద్ర మార్గం ద్వారా అందించిన సేవలపై నిర్ణీత ప్రదేశం(కస్టమ్స్‌ స్టేషన్‌) చేరే వరకు ఐజీఎస్టీ విధానంలో పన్ను విధించలేరని గుజరాత్‌ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. సముద్ర మార్గంలో సరఫరా చేసిన సరకుపై 5శాతం వరకు ఐజీఎస్టీ విధిస్తూ 2017లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేసింది.

ఒకే దేశం..ఒకే పన్ను వ్యవస్థకు తీర్పు అవరోధం కాదు: కేంద్రం

జీఎస్టీ మండలి సిఫార్సులు మార్గదర్శకాలు మాత్రమేనని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తప్పనిసరిగా అమలుచేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ‘ఒకే దేశం-ఒకే పన్నుల వ్యవస్థ’ అమలుకు ఎలాంటి అవరోధం ఉండబోదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. 2017లో రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీ చట్టాన్ని రూపొందించారని, ఆ సమయంలో కేంద్రం, రాష్ట్రాలకు చెందిన దాదాపు 18 చట్టాలను విలీనం చేశారని ఆయన వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల ఆమోదం ద్వారానే జీఎస్టీ మండలి ఉనికిలోకి వచ్చిందన్నారు. గత అయిదేళ్లలో పన్ను రేట్ల విషయంలో మాత్రమే విభేదాలు పొడసూపాయని, జీఎస్టీ మండలిని ఎవరూ ప్రశ్నించలేదని ఆయన గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని