గొటబాయ అధికారాలకు కత్తెర!

తీవ్ర సంక్షుభిత సమయంలో కీలక రాజ్యాంగ సవరణకు శ్రీలంక రాజకీయ అగ్ర నేతలు అంగీకరించారు. ఈమేరకు దేశాధ్యక్షుడికి ఉన్న అపరిమిత అధికారాలను నియంత్రించే 21వ రాజ్యాంగ

Published : 28 May 2022 06:38 IST

శ్రీలంకలో కీలక రాజ్యాంగ సవరణకు నిర్ణయం

కొలంబో: తీవ్ర సంక్షుభిత సమయంలో కీలక రాజ్యాంగ సవరణకు శ్రీలంక రాజకీయ అగ్ర నేతలు అంగీకరించారు. ఈమేరకు దేశాధ్యక్షుడికి ఉన్న అపరిమిత అధికారాలను నియంత్రించే 21వ రాజ్యాంగ సవరణకు వీలయినంత త్వరలో ఆమోదం తెలపాలని నిర్ణయించారు. వారంతా ప్రధాని రణిల్‌ విక్రమసింఘేను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కీలక రాజ్యాంగ సవరణలపై చర్చించారు. 20వ రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టగా.. మరో సవరణతో వాటికి ముగింపు పలకాలని నేతలు యోచిస్తున్నారు. శ్రీలంకలో అధ్యక్షుడి కంటే పార్లమెంటును శక్తిమంతమైనదిగా చేస్తూ 19వ సవరణ చేయగా.. దాన్ని 20వ సవరణ ద్వారా రద్దు చేశారు. కాగా 21వ సవరణకు ఏకాభిప్రాయం వ్యక్తమైందని విక్రమసింఘే ట్విటర్‌లో తెలిపారు. ఈ విషయమై జూన్‌ 3న తుది నిర్ణయానికి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నాటి సమావేశానికి తమిళ్‌ జాతీయ కూటమి హాజరు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కష్టకాలంలో అండగా భారత్‌: విక్రమసింఘే

కష్టకాలంలో తమ దేశానికి భారత్‌ అందిస్తున్న సహకారాన్ని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే కొనియాడారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశానికి సాయం అందించేందుకు విదేశీ సహకార కన్సార్షియంను ఏర్పాటు చేయడానికి క్వాడ్‌ దేశాలు నాయకత్వం వహించాలన్న ప్రతిపాదన రాగా.. దీనికి సానుకూలంగా స్పందించిన భారత్‌, జపాన్‌లకు విక్రమసింఘే కృతజ్ఞతలు తెలిపారు.

* శ్రీలంకకు భారత్‌ శుక్రవారం దాదాపు రూ. 5.43 కోట్ల (భారత కరెన్సీలో) విలువైన 25 టన్నుల వైద్యపరమైన సామగ్రిని అందజేసింది.
* స్వల్పకాలిక ఆర్థికసాయం విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో శ్రీలంక హై కమిషనర్‌ మిలిందా మొరగొడా శుక్రవారం భేటీ అయ్యారు. ఆర్థికసాయాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా మొరగొడా కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని