Corona Virus: గుండె జబ్బుల ముప్పును పెంచే కొవిడ్‌

కొవిడ్‌-19 బారినపడినవారికి గుండె సమస్యల ముప్పు అధికమని అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

Updated : 09 Feb 2022 10:30 IST

కోలుకున్న ఏడాది తర్వాతా సమస్యలు రావొచ్చు: అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 బారినపడినవారికి గుండె సమస్యల ముప్పు అధికమని అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన మొదటి నెల నుంచి ఏడాది తర్వాత కూడా ఈ ఇబ్బంది తలెత్తవచ్చని వెల్లడైంది. ఇలాంటి వారిలో గుండె కొట్టుకునే రేటులో తేడాలు, గుండెలో ఇన్‌ఫ్లమేషన్, రక్తంలో గడ్డలు, పక్షవాతం, రక్తనాళాల్లో పూడికలు, గుండెపోటు, గుండె వైఫల్యం, మరణం ముప్పు అధికమని తేలింది. కొవిడ్‌ సోకడానికి ముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారికి కూడా ఈ ఇబ్బంది తలెత్తవచ్చని వివరించింది. గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకాలేదని ముద్ర పొందినవారికీ ఇవి ఉత్పన్నం కావొచ్చని తేల్చింది.

‘‘గుండెకు ఏదైనా నష్టం వాటిల్లితే దాన్ని అధిగమించడం కష్టం. రోగిపై జీవితాంతం ఆ ప్రభావం ఉంటుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న జియాద్‌ అల్‌-అలీ పేర్కొన్నారు. కొవిడ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1.5 కోట్ల గుండె జబ్బుల కేసులు కొత్తగా వెలుగు చూశాయన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ అనంతర సంరక్షణలో గుండె  ఆరోగ్యానికీ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు.. 2020 మార్చి 1 నుంచి 2021 జనవరి వరకూ కరోనా పాజిటివ్‌గా తేలిన 1.53 లక్షల మంది ఆరోగ్య తీరుతెన్నులను పరిశీలించారు. వీరిని కొవిడ్‌ బారినపడని ఇతర రోగులతో పోల్చి చూశారు.

* కొవిడ్‌ బారినపడని వారితో పోలిస్తే కరోనా బాధితుల్లో 4 శాతం మందిలో అదనంగా గుండె జబ్బు, గుండె వైఫల్యం, మరణం ముప్పు కనిపించాయి. ‘‘4 శాతమంటే చాలా తక్కువ సంఖ్యగా అనేక మంది భావించొచ్చు. అయితే మహమ్మారి తీవ్రత, విస్తృతి చూసినప్పుడు అది అధికమే. ఒక్క అమెరికాలోనే ఇది 30 లక్షల మంది కింద లెక్క’’ అని జియాద్‌ తెలిపారు.
* సాధారణ రోగులతో పోలిస్తే కొవిడ్‌ బాధితుల్లో రక్తనాళాల్లో పూడికల ముప్పు 72 శాతం, గుండెపోటు ముప్పు 63 శాతం, పక్షవాతం ముప్పు 52 శాతం అధికం.
* మొత్తంమీద చూసినప్పుడు.. కొవిడ్‌ బారినపడని ఇతర రోగులతో పోలిస్తే కరోనా బాధితులకు గుండెపోటు, పక్షవాతం, మరణం ముప్పు 55 శాతం ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని