Russia: మాపై ఆంక్షలను తొలగించకుంటే.. ఐఎస్‌ఎస్‌ కూలిపోవచ్చు!

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా... తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ పలు దేశాలను కోరింది. 

Updated : 13 Mar 2022 11:15 IST

రష్యా అంతరిక్ష పరిశోధన కేంద్రం ‘రోస్‌కాస్మోస్‌’ హెచ్చరిక 
 నాసా తదితర సంస్థలకు లేఖలు

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా... తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ పలు దేశాలను కోరింది. అమెరికా, ఐరోపా చర్యల కారణంగా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)’ కూలిపోయే ప్రమాదముందని మరోసారి హెచ్చరించింది. ఆంక్షలను ఎత్తివేయాలంటూ రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రోస్‌కాస్మోస్‌’ అధినేత దిమిత్రి రోగోజిన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన నాసాతో పాటు కెనడా, ఐరోపా అంతరిక్ష సంస్థలకూ శనివారం లేఖలు రాశారు. ‘‘ఆంక్షల కారణంగా రష్యా నుంచి ఐఎస్‌ఎస్‌కు అందే సేవలకు అంతరాయం కలుగుతుంది. పర్యవసానంగా 500 టన్నుల బరువైన ఈ నిర్మాణం సముద్రంలోగానీ, భూమిపైగానీ కూలిపోయే ప్రమాదముంది’’ అని రోగోజిన్‌ హెచ్చరించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన తరచూ ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారు.

రష్యా కాదంటే... స్పేస్‌ ఎక్స్‌ సిద్ధం

ఐఎస్‌ఎస్‌ నిర్దేశిత కక్ష్యలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపెల్షన్‌ వ్యవస్థలను రష్యానే అందిస్తోంది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న రెండు కీలక విభాగాల్లో ఒకదాన్ని అమెరికా పర్యవేక్షిస్తుండగా, మరొక విభాగాన్ని రష్యా వ్యోమగాములు పర్యవేక్షిస్తున్నారు. ఈ కేంద్రాన్ని నివాసయోగ్యంగా మార్చే ఇంధన వ్యవస్థలను అమెరికా నిర్వహిస్తుండగా... నిర్దేశిత కక్ష్యలో తిరిగే బాధ్యతలను రష్యా చూస్తోంది. ఐఎస్‌ఎస్‌ పూర్తిగా జీరో గ్రావిటీ స్పేస్‌లో లేదు. కొంతమేర ఇది భూ గురుత్వాకర్షణ శక్తిని ఎదుర్కొంటోంది. దీన్ని నియంత్రించేందుకు రష్యా థ్రస్టర్లను పంపుతుంది. ఇవి ఐఎస్‌ఎస్‌ను నిరంతరం తగిన వేగంతో నిర్దేశిత కక్ష్యలో తిరిగేలా చేస్తాయి. ఒకవేళ రష్యా తన సేవలను నిలిపివేస్తే, ఈ కేంద్రం కూలిపోయే ప్రమాదం తలెత్తుతుంది. రష్యా సహాయ నిరాకరణకు దిగితే, తమ కంపెనీ రంగంలోకి దిగుతుందని స్పేస్‌ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ హామీ ఇచ్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని