అఘోరి వెబ్‌సిరీస్‌ నిర్మాతగా ధోనీ

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ మరోసారి నిర్మాణ బాధ్యతలు అందుకోనున్నాడు. గతేడాది డాక్యుమెంటరీతో వినోద పరిశ్రమలో అడుగుపెట్టని అతడు ఈ సారి వెబ్‌సిరీస్‌ను...

Published : 01 Oct 2020 01:27 IST

ముంబయి: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ మరోసారి నిర్మాణ బాధ్యతలు అందుకోనున్నాడు. గతేడాది డాక్యుమెంటరీతో వినోద పరిశ్రమలో అడుగుపెట్టిన అతడు ఈ సారి వెబ్‌సిరీస్‌ను నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ ప్రొడక్షన్‌ హౌస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న అతడి సతీమణి సాక్షి బుధవారం వెల్లడించారు. ఈ వెబ్‌సిరీస్‌ థ్రిల్లింగ్ అడ్వెంచర్‌గా ఉంటుందని ఆమె తెలిపారు. ఇంకా ప్రచురితం కానీ ఓ పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నామన్నారు.

‘‘పౌరాణిక సైన్స్‌ ఫిక్షన్‌ కథే ఈ పుస్తకం. రహస్యమైన అఘోరి తన ప్రయాణం సాగించిన తీరు ఇందులో ఉంటుంది. అయితే ఆ అఘోరి వెల్లడించిన రహస్యాలు.. పురాణాలు, మన నమ్మకాలను మార్చేస్తాయి. విశ్వంలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ కథలో ప్రతి పాత్రను గొప్పగా తీర్చిదిద్ది తెరపైకి తీసుకువచ్చేలా ప్రయత్నిస్తాం. సినిమా కంటే ఇది వెబ్‌సిరీస్‌గానే బాగుంటుంది’’ అని సాక్షి అన్నారు. 2019లో విడుదలైన ‘రోర్‌ ఆఫ్ ది లయన్‌’ డాక్యుమెంటరీకి ధోనీ నిర్మాణ రంగంలో బాధ్యతలు పంచుకన్న సంగతి తెలిసిందే.  ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థలో నిర్మించిన ఇది ఓటీటీ వేదికగా విడుదలైంది. అమిర్ రిజ్వి దర్శకుడిగా పనిచేశారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతంతో రెండేళ్లు లీగ్‌కు దూరమైన చెన్నై జట్టు తర్వాత ఎలా పుంజుకుందనేది డాక్యుమెంటరీ సారాంశం. ప్రస్తుతం దుబాయ్‌ వేదికగా జరుగుతున్న లీగ్‌లో చెన్నై ఒక మ్యాచ్‌లో గెలవగా రెండింట్లో ఓటమిపాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని