yashasvi jaiswal: యశస్వి దూకుడు.. ఫీల్డ్‌ నుంచి బయటకు పంపిన రహానె

యశస్వి జైస్వాల్‌ చివరి రోజు దూకుడుగా వ్యవహరించి విమర్శలపాలయ్యాడు.

Published : 26 Sep 2022 00:10 IST

కొయంబత్తూర్: చెన్నై వేదికగా జరిగిన దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో సౌత్‌ జోన్‌పై వెస్ట్‌ జోన్‌ ఘన విజయం సాధించింది. అయితే తొలి ఓవర్లలో తన ఆటతీరుతో అందరినీ ఆకర్షించిన యువ ఓపెనర్‌ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ చివరి రోజు దూకుడుగా వ్యవహరించి విమర్శలపాలయ్యాడు. కెప్టెన్‌ను సైతం లెక్కచేయకుండా ప్రత్యర్థి ఆటగాడితో దురుసుగా ప్రవర్తించిన అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 

చివరి రోజు 50వ ఓవర్‌ సమయంలో సౌత్ జోన్‌ ఆటగాడు రవితేజతో జైస్వాల్‌ వాదనకు దిగాడు. అక్కడే ఉన్న కెప్టెన్‌ అజింక్యా రహానె అతడిని నిలువరించే ప్రయత్నం చేశాడు. అయినా లెక్కచేయకపోవడంతో అంపైర్లు కలుగజేసుకుని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కెప్టెన్‌కు సూచించడంతో జైస్వాల్‌ను క్రీజు నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. అనంతరం 65 ఓవర్లో అతడు మైదానంలో అడుగుపెట్టాడు. ఈ విషయంపై కెప్టెన్‌ స్పందిస్తూ.. ‘‘ప్రత్యర్థులు, అంపైర్లు, మ్యాచ్‌ అధికారులను నేను గౌరవించాలనుకుంటాను. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి పద్ధతి ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది’’ అని తెలిపాడు. మూడో రోజు ఆటలో డబుల్‌ సెంచరీతో మెరుపులు మెరిపించిన జైస్వాల్ ఈ సిరీస్‌లో 265 పరుగులు తీసి అదరగొట్టాడు. 323 బంతుల్లో 4 సిక్స్‌లు, 30 ఫోర్లు బాదాడు. 529 పరుగులతో సౌత్‌జోన్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని