IND vs SA: తొలి టెస్టులోనే కాదు.. డబ్ల్యూటీసీ మొత్తం వీరిపైనే చర్చ: హర్భజన్‌

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో (SA vs IND) ఒకే ఒక్కస్థానంపై గురి కుదరడం లేదు. ఎవరిని తీసుకోవాలనేదే భారత మేనేజ్‌మెంట్ ముందున్న అసలైన చిక్కు ప్రశ్న.

Published : 26 Dec 2023 11:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా టీమ్‌ఇండియాలో (SA vs IND) ఒకే ఒక్క స్థానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. పేస్‌ ఆల్‌రౌండర్‌ను ఆడించాలా..? స్పిన్‌ ఆల్‌రౌండర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలా? అనేది మేనేజ్‌మెంట్ ముందున్న కఠిన సవాల్‌. సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్టులోనూ ఇదే సమస్య. అయితే.. బాక్సింగ్‌ డే టెస్టులో అశ్విన్‌ను ఆడించాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ సూచించాడు.

‘‘శార్దూల్‌ లేదా అశ్విన్‌.. ఇప్పుడిదే అతిపెద్ద చర్చ. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మొత్తం ఇదే హాట్‌ టాపిక్‌. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరిగిన మైదానం పూర్తిగా భిన్నంగా ఉంది. తొలి రోజు నుంచే పిచ్‌ సీమ్‌కు అనుకూలంగా మారింది. అప్పుడు శార్దూల్‌ ఎంపిక సరైందే. ఆ పిచ్‌ పరిస్థితులకు అతడే కరెక్ట్‌. పిచ్‌ మీద గ్రాస్‌ ఎక్కువగా ఉంది. కానీ, అతడు ప్రభావం చూపించలేదు. ఇప్పుడు, బాక్సింగ్‌ డే టెస్టులో పిచ్‌ పరిస్థితులకు అశ్విన్‌ సరైన ప్లేయర్‌గా భావిస్తున్నా. తొలి రోజు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మ్యాచ్‌ జరిగే కొద్దీ అశ్విన్‌ కీలకమవుతాడు. అందుకే, అశ్విన్‌ ఈ టెస్టులో ఆడితే బాగుంటుంది’’ అని భజ్జీ తెలిపాడు.

ఓపెనర్లుగా వారిద్దరే..

‘‘ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగాలి. శుభ్‌మన్‌ గిల్‌ వన్‌డౌన్‌లో రావాలి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ ఆర్డర్‌ బెటర్. నంబర్ 8లో అశ్విన్‌ లేదా శార్దూల్‌ ఎవరు ఉంటారనేది పెద్ద ప్రశ్న. బుమ్రా, సిరాజ్‌, ప్రసిధ్‌ చివర్లో బ్యాటింగ్‌కు వస్తారు’’ అని హర్భజన్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని