Mohammed Siraj: శ్రీలంక బ్యాటర్లను అలా బోల్తా కొట్టించా.. నా కల నెరవేరింది: సిరాజ్‌

 ఆసియా కప్‌ ఫైనల్‌లో తన బౌలింగ్‌ ప్రదర్శనతో అభిమానుల మనసును దోచుకున్న మహమ్మద్‌ సిరాజ్‌ (Mohammad Siraj).. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుకు వచ్చిన క్యాష్‌ ప్రైజ్‌ను కొలంబో ప్రేమదాస స్టేడియం మైదాన సిబ్బందికి అందజేస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు.

Updated : 17 Sep 2023 22:50 IST

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌ (Asia Cup Final)లో టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 50 పరుగులకే ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 6.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. మహమ్మద్‌ సిరాజ్‌ (Mohammad Siraj) (6/21) ధాటికి శ్రీలంక టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. వన్డే కెరీర్‌లో సిరాజ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అతడు ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ గతినే మార్చేశాడు. ఆరు వికెట్లు పడగొట్టి భారత్‌ మరపురాని విజయం అందుకోవడంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఆరు వికెట్లు పడగొట్టిన అనంతరం సిరాజ్ మాట్లాడాడు. 

‘‘అంతా కలలా అనిపిస్తోంది. చివరిసారి తిరువనంతపురంలో శ్రీలంకపై ఇలానే ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీశా. ఐదు వికెట్లు మాత్రం సాధించలేకపోయా. అయినా, మన విధిరాతలో ఇలా జరగాలని రాసి ఉన్నప్పుడు కచ్చితంగా జరుగుందని నాకిప్పుడు అర్థమైంది. నిజానికి ఈరోజు నేను వికెట్ల కోసం పెద్దగా ప్రయత్నించలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నేనెప్పుడూ స్వింగ్ కోసమే ప్రయత్నిస్తుంటా. గత మ్యాచ్‌ల కంటే ఈ రోజు బంతి ఎక్కువగా స్వింగ్ అయింది. అవుట్‌ స్వింగర్‌లు సంధించి ఎక్కువ వికెట్లు పడగొట్టా. బ్యాటర్లు ముందుకు వచ్చి ఆడేలా ట్రాప్ చేయడంలో సక్సెస్ అయ్యా. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. నా ఐదు వికెట్ల కల నెరవేరింది’’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు. 

ఆసియా కప్‌ ఫైనల్‌లో శ్రీలంక చిత్తు.. 23 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న భారత్

సిరాజ్ పెద్ద మనసు 

తన బౌలింగ్‌ ప్రదర్శనతో అభిమానుల మనసును దోచుకున్న సిరాజ్‌.. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుకు వచ్చిన క్యాష్‌ ప్రైజ్‌ను కొలంబో ప్రేమదాస స్టేడియం మైదాన సిబ్బందికి అందజేస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు. సూపర్‌-4 దశలో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. వర్షం ఆగిపోయిన తర్వాత మ్యాచ్‌ నిర్వహణకు వీలుగా గ్రౌండ్ స్టాఫ్‌ చురుగ్గా పనిచేసి మైదానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సిరాజ్‌ వారికి ఈ ఆర్థికసాయం ప్రకటించాడు. కొలంబో, క్యాండీ క్రికెట్‌ మైదానాల్లో పనిచేసిన క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్స్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC), శ్రీలంక క్రికెట్ (SLC) ఆధ్వర్యంలో 50 వేల యూఎస్‌ డాలర్లను వారికి అందజేయనున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా (Jay Shah) వెల్లడించిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని