Cricket News: రాస్‌టేలర్‌కు బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల ఘనవీడ్కోలు

న్యూజిలాండ్‌ ప్రముఖ బ్యాట్స్‌మన్‌ రాస్‌టేలర్‌కు తన చివరి టెస్టులో ప్రత్యర్థి జట్టు నుంచి అద్భుతమైన గౌరవం దక్కింది. సోమవారం రెండో టెస్టులో అతడు క్రీజులోకి వస్తుండగా హాగ్లే ఓవల్‌ మైదానంలోని ప్రేక్షకులు...

Published : 10 Jan 2022 14:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌ ప్రముఖ బ్యాట్స్‌మన్‌ రాస్‌టేలర్‌కు తన చివరి టెస్టులో ప్రత్యర్థి జట్టు నుంచి అద్భుతమైన గౌరవం దక్కింది. సోమవారం రెండో టెస్టులో అతడు క్రీజులోకి వస్తుండగా హాగ్లే ఓవల్‌ మైదానంలోని ప్రేక్షకులు స్టాండింగ్‌ ఓవియేషన్‌లో నిల్చొని చప్పట్లతో స్వాగతం పలికారు. మరోవైపు మైదానంలోని బంగ్లా ఆటగాళ్లు సైతం రెండు వరుసల్లో నిల్చొని టేలర్‌కు ‘గాడ్‌ ఆఫ్‌ ఆనర్‌’ అందించారు. దీంతో అతడు చివరిసారి టెస్టుల్లో బరిలోకి దిగి (28; 39 బంతుల్లో 4x4) పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 521/6 స్కోర్‌ వద్ద డిక్లేర్డ్‌ చేయగా అనంతరం బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలోనే ఆ జట్టు 126 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయింది. దీంతో 395 పరుగుల వెనుకంజలో నిలిచిన బంగ్లాదేశ్‌ ఇప్పుడు ఫాలోఆన్‌ ఆడే పరిస్థితుల్లో నిలిచింది. దీంతో టేలర్‌ ఇక టెస్టుల్లో మరోసారి బ్యాటింగ్‌ చేసే వీలు లేనట్లు కనిపిస్తోంది.

ఇక బంగ్లా ఆటగాళ్లు అతడికి ఘన స్వాగతం పలికిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. వారి క్రీడాస్ఫూర్తిని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. టేలర్‌ గతేడాది డిసెంబర్‌ 30న త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. ఈ బంగ్లాదేశ్‌ సిరీసే టెస్టుల్లో తనకు చివరిదని.. ఆపై ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ జట్లపై చివరిసారి పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడతానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా ఆటగాళ్లు అతడికి ఘన వీడ్కోలు పలికారు. కాగా, ఈ న్యూజిలాండ్‌ బ్యాటర్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో వందకు పైగా మ్యాచ్‌లాడిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో మొత్తం 112 మ్యాచ్‌లు ఆడిన టేలర్‌.. మొత్తం 7,684 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. అత్యధిక స్కోర్‌ 290 కాగా, బ్యాటింగ్‌ సగటు 44.16గా నమోదైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని