Yuzvendra Chahal: ఈ టీ20 ప్రపంచకప్‌లో చాహల్‌ కీలకంగా ఉంటాడు: బ్రాడ్‌హాగ్

టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ తిరిగి ఫామ్‌లోకి రావడంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ హర్షం వ్యక్తం చేశాడు. చాహల్‌ ఇటీవలి కాలంలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడని మెచ్చుకున్నాడు...

Published : 16 Jul 2022 02:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ తిరిగి ఫామ్‌లోకి రావడంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ హర్షం వ్యక్తం చేశాడు. చాహల్‌ ఇటీవలి కాలంలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడని మెచ్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం సరైన ప్రదర్శన చేయలేక జట్టులో స్థానం కోల్పోయిన టీమ్‌ఇండియా స్పిన్నర్‌ ఇప్పుడు వికెట్లు తీస్తూ జట్టులో కీలకంగా మారాడు. అయితే, రాబోయే టీ20 ప్రపంచకప్‌లోనూ అతడు ఆస్ట్రేలియాలో మరింత మెరుస్తాడని బ్రాడ్‌హాగ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతడు.. చాహల్‌ గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘చాహల్‌ ఏడాది కాలంగా బాగా మెరుగవ్వడం గమనిస్తున్నా. దీంతో ఈసారి ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ అతడు మరింత అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడని నమ్ముతున్నా. ఒకానొక సందర్భంలో అతడు జట్టులో నుంచి వైదొలిగిన పరిస్థితుల నుంచి ఇప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకొని తిరిగి పుంజుకునే స్థాయికి ఎదిగాడు. అతడు వ్యక్తిగతంగా కూడా పరిణతి చెందాడు. దీంతో ఈసారి టీమ్ఇండియా ఫేవరెట్‌ జట్లలో ఒకటని కచ్చితంగా చెబుతాను. టీ20 క్రికెట్‌లో లెగ్‌ స్పిన్నర్‌ ఉంటే ఏ జట్టుకైనా బాగా కలిసొస్తుంది. మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్లను ఇబ్బంది పెట్టే వీలుంటుంది. అలాంటప్పుడు ఈసారి చాహల్‌ టీమ్‌ఇండియా తరఫున రాణిస్తాడని గట్టిగా నమ్ముతున్నా’ అని బ్రాడ్‌హాగ్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, చాహల్‌ గతేడాది టీ20 ప్రపంచకప్‌లో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవల భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడిన అతడు 17 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు సాధించి నంబర్‌ వన్‌ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే మళ్లీ టీమ్‌ఇండియా జట్టులో స్థానం సంపాదించుకొని అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ కీలక వికెట్లు పడగొడుతున్నాడు. తాజాగా రెండో వన్డేలో లార్డ్స్‌లో ఏకంగా 4/47 మెరుగైన ప్రదర్శన చేసి అక్కడ టీమ్‌ఇండియా తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని