Ashes Test: బెయిర్‌స్టో ఔట్‌ వివాదం.. బ్రిటన్‌, ఆసీస్‌ ప్రధానుల వార్‌

Jonny Bairstow Out Row: బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ స్పందిస్తూ ఆసీస్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. దీనికి ఆస్ట్రేలియా ప్రధాని కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 04 Jul 2023 11:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాషెస్‌ సిరీస్‌ (Ashes Series 2023) రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ ఆటగాడు బెయిర్‌ స్టో (Jonny Bairstow) వివాదాస్పదంగా ఔట్‌ అవ్వడం.. క్రీడా స్ఫూర్తిపై మరోసారి చర్చకు తెరలేపింది. దీనిపై పలువురు ఆటగాళ్లు, మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదం రాజకీయ నేతల వరకూ వెళ్లింది. ఈ ఘటనపై బ్రిటన్‌, ఆస్ట్రేలియా ప్రధానులు పరస్పరం మాటల దాడికి దిగారు. తొలుత యూకే ప్రధాని రిషి సునాక్‌ (Britain PM Rishi Sunak).. కంగారూల తీరుపై విమర్శలు చేయగా.. దానికి ఆసీస్‌ ప్రధాని గట్టిగా బదులిచ్చారు.

బెయిర్‌స్టో వివాదాస్పద ఔట్‌పై సునాక్‌ ప్రతినిధి స్పందించారు. ‘‘ఈ ఔట్‌ కేవలం ఆటలో భాగం మాత్రమే కాదు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ఆస్ట్రేలియా వలే తాము గెలవాలనుకోవట్లేదని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ చెప్పాడు. అతడి అభిప్రాయాన్ని ప్రధాని (రిషి సునాక్‌ను ఉద్దేశిస్తూ) కూడా అంగీకరించారు. అయితే, దీనిపై ఆసీస్‌ ప్రధాని ఆల్బనీస్‌ వద్ద అధికారికంగా నిరసన వ్యక్తం చేయాలని సునాక్‌ భావించడం లేదు. ఇది కేవలం ఆటలో ఇరు దేశాల నేతల మధ్య స్నేహపూర్వక పోటీ మాత్రమే’’ అని సునాక్‌ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు, ఆసీస్‌ ఆటగాళ్లతో గొడవపడ్డ మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ సభ్యులను సస్పెండ్‌ చేయడాన్ని సునాక్‌ సమర్థించారు. గత శనివారం ఆయన లార్డ్స్‌ మైదానంలో బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ విలియమ్‌తో కలిసి యాషెస్‌ సిరీస్‌ను వీక్షించారు.

అదే పాత ఆసీస్‌: అల్బనీస్‌

కాగా.. బ్రిటన్‌ ప్రధాని విమర్శలకు ఆసీస్‌ (Australia) పీఎం ఆంథోనీ అల్బనీస్‌ (Anthony Albanese) దీటుగా స్పందించారు. ‘‘ఆస్ట్రేలియా పురుషులు, మహిళల క్రికెట్‌ జట్లపై నేను గర్వంగా ఉన్నాను. మా రెండు జట్లు ఇంగ్లాండ్‌పై తమ యాషెస్‌ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గాయి. అదే పాత ఆసీస్‌.. ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. గెలిచిన వారిని సాదరంగా ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నా’’ అని అల్బనీస్‌ అన్నారు.

అసలేం జరిగిందంటే..

రెండో టెస్టు(ENG vs AUS) చివరి రోజు తొలిసెషన్‌ ఆటలో ఇంగ్లాండ్‌ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్‌ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో(Jonny Bairstow ) కిందకు వంగాడు. బంతి వికెట్‌ కీపర్‌ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్‌ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్‌ పడగొట్టాడు. బంతి డెడ్‌ కాలేదని భావించిన థర్డ్‌ అంపైర్‌.. బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. ఇక ఇరు దేశాల మధ్య మూడో టెస్టు గురువారం (జులై 6) నుంచి ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని