India vs Srilanka: నిజానికి లంకేయులే భారత్‌కు రుణపడ్డారు!

బీసీసీఐ ద్వితీయ శ్రేణి భారత జట్టును పంపించిందన్న అర్జున రణతుంగ వ్యాఖ్యలతో పాక్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా విభేదించాడు. ప్రపంచకప్‌ గెలిచిన కెప్టెన్‌ ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నాడు...

Published : 08 Jul 2021 02:13 IST

శ్రీలంకకు టీమ్‌ఇండియాను పంపడమే గొప్ప అంటున్న కనేరియా

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీసీసీఐ ద్వితీయ శ్రేణి భారత జట్టును పంపించిందన్న అర్జున రణతుంగ వ్యాఖ్యలతో పాక్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా విభేదించాడు. ప్రపంచకప్‌ గెలిచిన కెప్టెన్‌ ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నాడు. కేవలం మీడియాలో ప్రచారం కోసం ఆయన అలా వ్యాఖ్యానించి ఉంటారని అభిప్రాయపడ్డాడు. నిజానికి బీసీసీఐ భారత జట్టును పంపించి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నందుకు సంతోషించాలని వెల్లడించాడు.

‘భారత్‌ ద్వితీయ శ్రేణి జట్టును పంపించకూడదని రణతుంగ అంటున్నాడు. ఆయనేం మాట్లాడుతున్నాడో నాకర్థం కాలేదు. 1996లో ప్రపంచకప్‌ గెలిచిన ఆయనకు అంతర్జాతీయంగా మంచి పేరుంది. బహుశా ఆయన ప్రచారం కోసమే ఇలాంటి ప్రకటన చేసుండొచ్చు. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడగలిగే 50-60 మంది క్రికెటర్లు భారత్‌కు ఉన్నారు. వారు రెండు జట్లను సులువుగా ఏర్పాటు చేయగలరు’ అని కనేరియా అన్నాడు.

‘భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, యుజ్వేంద్ర చాహల్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య సహా నిరంతరం టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లను టీమ్‌ఇండియా పంపించింది. రణతుంగ అలాంటి ప్రకటనలు ఇవ్వడం బాధాకరం. అలాంటి ప్రకటనలు చేయొద్దని శ్రీలంక క్రికెట్‌ ఆయనకు చెప్పాల్సింది’ అని కనేరియా పేర్కొన్నాడు.

‘ప్రస్తుతం లంక క్రికెట్‌ పతనావస్థలో ఉంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌ ఇందుకు ఉదాహరణ. అన్ని మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు. వారు క్రికెట్‌ ఆడటం దాదాపుగా మర్చిపోయారు. వారిని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు భారత జట్టును పంపించినందుకు రుణపడి ఉండాలి. టీమ్‌ఇండియా సులభంగా ఈ రెండు సిరీసులు గెలిచేస్తుంది’ అని కనేరియా ధీమా వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని