Surya - Samson: సూర్య కుమార్‌ను సంజూ శాంసన్‌తో పోల్చొద్దు... ఎందుకంటే: కపిల్‌ దేవ్‌

వన్డేల్లో సూర్యకుమార్‌కు బదులు సంజూశాంసన్‌ను తీసుకోవాలని నెట్టింట చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ స్పందించాడు. సూర్యకుమార్‌కు మద్దతుగా నిలుస్తూ అతడిని సంజూతో పోల్చవద్దన్నాడు.

Published : 25 Mar 2023 01:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత బ్యాటర్లు సూర్య కుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ని ఒకరితో ఒకర్ని పోల్చవద్దని క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అన్నాడు. కొన్ని రోజులుగా సూర్య, సంజూల పేర్లు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ సూర్య తొలి బంతికే డకౌట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యకు బదులు సంజూను తీసుకోవాలని నెట్టింట చర్చ జరుగుతోంది. పలువురు మాజీలు సైతం ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనిపై తాజాగా కపిల్‌ దేవ్‌ స్పందించాడు.

 ‘‘గొప్పగా ఆడే ఆటగాడు కచ్చితంగా ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటాడు. సూర్యను సంజూతో పోల్చవద్దు, అది సరైంది కాదు. ఒకవేళ సంజూ మంచి ప్రదర్శన చేయకపోతే మరో ఆటగాడి గురించి మాట్లాడుకుంటారు. జట్టు యాజమాన్యం సూర్యకు మద్దతుగా నిలవాలని భావిస్తే అతడికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. సూర్య కుమార్‌ను ఏడో స్థానంలో పంపడానికి కారణం.. అతనికి మ్యాచ్‌ను ముగించే అవకాశం ఇవ్వడమే. ఇది వన్డేల్లో కొత్తేం కాదు. ఇదివరకు చాలాసార్లు జరిగింది.  ఒక బ్యాటర్‌ ఆర్డర్‌ను మార్చి కిందకు లాగితే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.  ‘నేను టాప్‌ ఆర్డర్‌లో రాణించగలనని చెప్పాల్సిన బాధ్యత ఆ ఆటగాడిదే’. దానిపై కోచ్‌, కెప్టెన్‌ ప్రత్యేకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’’ అని కపిల్‌ దేవ్‌ పేర్కొన్నాడు.

టీ20 అత్యుత్తమ బ్యాటర్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ వన్డేల్లో మాత్రం విఫలమవుతున్నాడు. వన్డేల్లో అతడి యావరేజ్‌ 24 మాత్రమే. ఇప్పటివరకు ఆడిన 21 వన్డే ఇన్నింగ్స్‌లో రెండు అర్ధశతకాలు మాత్రమే సాధించాడు. 11 వన్డేలు ఆడిన సంజూ శాంసన్‌ యావరేజ్‌ 66. వన్డేల్లో గొప్పగా రాణిస్తున్నప్పటికీ అతడికి సరైన అవకాశాలు రావట్లేదు. దీంతో వన్డేల్లో సూర్యకు బదులు సంజూను తీసుకోవాలని పలువురు మాజీలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సూర్యకు గావస్కర్‌ సూచన

క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌.. సూర్య కుమార్‌ యాదవ్‌కు కొన్ని సూచనలు చేశాడు. ‘ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లకు ఇది జరుగుతుంది, జరిగిందని అతడు అర్థం చేసుకోవాలి. ఈ మూడు మ్యాచుల గురించి మర్చిపోయి ఐపీఎల్‌పై దృష్టి పెట్టాలి. యథావిధిగా అక్కడ పరుగులు సాధించాలి. అక్కడ ఒకసారి పరుగులు సాధిస్తే తర్వాత జరిగే వన్డేలకు అతడు ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అతడు తొలి బంతికే మూడు సార్లు అవుటయ్యాడు. తప్పు ఎక్కడ జరుగుతుందో చెప్పడం చాలా కష్టం.  మొదటి రెండు మ్యాచుల్లో మిచెల్‌ స్టార్క్‌ రెండు మంచి డెలివరీలు వేశాడు. ఆ సమయంలో సూర్య కొంచెం ఎక్కువ ఆత్రుతగా ఉండుంటాడు’’ అని సన్నీ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు