Dravid: శార్దూల్‌ ఒక్కడే కాదు చాలామంది ఆ విషయం చెప్పారు: ద్రవిడ్

  దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్‌ల మధ్య ఎక్కువ విరామం ఉండాలని భారత ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ అన్నాడు. ఈ అంశంలో టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్ ద్రవిడ్  (Rahul Dravid) అతడికి మద్దతుగా నిలిచాడు.

Published : 11 Mar 2024 19:02 IST

ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌పై ఇటీవల భారత ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు, ముఖ్యంగా పేసర్లు గాయాల బారిన పడకుండా ఉండాలంటే మ్యాచ్‌ల మధ్య ఎక్కువ విరామం ఉండేలా చూడాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఈ అంశంపై టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్ ద్రవిడ్  (Rahul Dravid) మాట్లాడాడు. శార్దూల్ ఠాకూర్‌ మాదిరిగానే చాలామంది ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్‌ల షెడ్యూల్ చాలా కఠినంగా ఉందని తన వద్ద ప్రస్తావించినట్లు ద్రవిడ్ పేర్కొన్నాడు.

‘‘ఈ కామెంట్లు చేసింది శార్దూల్ ఠాకూర్‌ అనుకుంటా. అతడే కాదు జట్టులోని చాలామంది ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్‌ లాంటి పెద్ద దేశంలో ప్రయాణాలు, విరామం లేని షెడ్యూళ్లు అంటే కష్టమే. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే విరామం లేని ఆట కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతోంది వారే.  ఇలాంటి అంశాలను లేవనెత్తుతూ వారు తమ గళం వినిపించినపుడు దాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యంగా పలు మార్పులు, చేర్పులు చేస్తూ షెడ్యూళ్లను రూపొందించేలా ప్లాన్‌ చేసుకోవాలి’’ అని బీసీసీఐకి సూచించాడు. ప్రస్తుత రోజుల్లో అవసరం లేదనుకున్న కొన్ని టోర్నీల నిర్వహణ గురించి ఆటగాళ్లు, కోచ్‌ల అభిప్రాయాలు తెలుసుకొని పునరాలోచన చేయాలన్నాడు.

ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పుడు దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడాలని ఇటీవల బీసీసీఐ ఆదేశించింది. ఈక్రమంలోనే రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున శార్దూల్ ఠాకూర్‌, శ్రేయస్ అయ్యర్‌ ఆడుతున్నారు. సెమీస్‌ ఫైనల్లో సెంచరీ బాదిన శార్దూల్.. విదర్భతో జరుగుతున్న ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (75) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని