IND w Vs AUS w: కీలక సమయంలో.. అలా రన్నింగ్‌ చేయడమేంటి?: డయానా ఎడుల్జీ

మహిళల ప్రపంచకప్‌లో (Womens T20 World Cup 2023) ఫైనల్‌కు రావడంలో మరోసారి టీమ్‌ఇండియా (Team India) విఫలమైంది. కీలక సమయంలో వికెట్లను చేజార్చుకొని ఆసీస్‌ చేతిలో (IND w Vs AUS w) ఓటమిపాలైంది.

Published : 25 Feb 2023 10:47 IST

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచకప్‌ (Womens World Cup 2023) సెమీస్‌లో టీమ్‌ఇండియాకి భంగపాటు తప్పలేదు. చివరి వరకు పోరాడినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో (INDw Vs AUS w) ఓటమిపాలైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet kaur) రనౌట్‌ కావడమే కీలక మలుపుగా మాజీలతో సహా అభిమానులు చెబుతున్న వేళ.. టీమ్‌ఇండియా (Team India) మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ మాత్రం హర్మన్‌ రన్నింగ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. విజయానికి చేరువగా వచ్చిన మ్యాచ్‌ను చేజార్చడంలో ప్లేయర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వ్యాఖ్యానించింది. షాట్ల సెలెక్షన్‌పైనా ఎడుల్జీ ( Diana Edulji) అసంతృప్తి వ్యక్తం చేసింది. కీలక సమయంలో వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు హర్మన్‌ ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. 

‘‘మనమంతా మ్యాచ్‌ను వీక్షించాం. బ్యాట్‌ క్రీజ్‌కు ముందు స్టక్‌ అయిపోయినట్లు హర్మన్ (Harmanpreet kaur) భావించింది. కానీ, సరిగ్గా పరీక్షిస్తే.. ఆమె రెండో రన్‌ కోసం వచ్చేటప్పుడు జాగింగ్‌ చేస్తున్నట్లు ఉంది. నీ వికెట్‌ చాలా ముఖ్యమని తెలిసినప్పుడు అంత రిలాక్స్‌డ్‌గా ఎందుకు పరుగెత్తావు? గెలవాలంటే ప్రొఫెషనల్‌ క్రికెట్‌ను ఆడాల్సిందే. రెండో పరుగు కోసం హర్మన్‌ చాలా సాధారణంగా పరిగెత్తింది. క్రీజ్‌లోకి చేరిపోతానని భావించింది. కానీ అలా జరగలేదు. ఒక్కసారి ఆసీస్‌ ఫీల్డర్‌ పెరీ డైవ్‌ను చూడండి. బౌండరీ వెళ్తుందేమోనని అంతా భావించిన వేళ.. అనూహ్యంగా డైవ్‌ చేసి మరీ ఆపింది. రెండు పరుగులను కాపాడింది. అదీ ప్రొఫెషనలిజం క్రికెట్‌ అంటే. వారు చివరి వరకూ పోరాడారు. మనం మాత్రం విజయం కోసం పోరాడటానికి సిద్ధంగా లేకపోయాం. ప్రతిసారి ఆఖరి పోరులో బోల్తా కొట్టడం అలవాటైపోయింది’’

‘‘ఇక షఫాలీ తనను పక్కన పెట్టరని భావిస్తే పొరపాటే అవుతుంది. ఈ మ్యాచ్‌లో (ఆసీస్‌తో సెమీస్‌) షెఫాలీ వర్మ షాట్‌ సెలెక్షన్ అత్యంత దారుణంగా ఉంది. ఆమె ఔటైన వీడియోను చూశా. అలాంటి బంతికి కూడా ఔట్‌ కావడం సరైందేనా..? షాట్‌ ఎంపిక చాలా చెత్తగా ఉంది. ఇంతకుముందు జరిగిన అండర్ -19 ప్రపంచకప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ, ఆమె మాత్రం తన బ్యాటింగ్‌లో రాణించలేదు. మరో ఓపెనర్ శ్వేతా షెరావత్‌ అద్భుతంగా ఆడింది. మరో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ సూపర్‌ బ్యాటింగ్‌ చేసింది. కానీ, కీలకమైన సమయంలో అవసరం లేని షాట్‌ ఆడి మరీ వికెట్‌ను చేజార్చుకుంది. అంతకుముందే బౌండరీ రాబట్టిన తర్వాత అలాంటి షాట్‌ అవసరమా...? అని అనిపించింది. మ్యాచ్‌ పరిస్థితినిబట్టి ఆడాలి.. ఇటీవల మెగా టోర్నీల్లో స్మృతీ మంధాన, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ నిలకడగా ఆడలేకపోతున్నారు. అందుకే భారత్‌ గెలవలేకపోతోంది. వారిలో అద్భుతమైన టాలెంట్‌ ఉంది. కానీ, కఠిన శిక్షణ మాత్రం ఇవ్వడం లేదనిపిస్తోంది. నాణ్యమైన బ్యాటింగ్ విభాగం ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని ఎడుల్జీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని