Team India : అశ్విన్‌ నుంచి కూడా కష్టమే.. ముందే అతడి పాత్ర ఏంటో నిర్ణయించాలి!

ప్రస్తుత భారత క్రికెట్‌లో స్పిన్‌ ద్వయం అంటే గుర్తుకొచ్చేది రవిచంద్రన్‌ అశ్విన్ - రవీంద్ర జడేజా. గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శనేమీ చేయడం...

Published : 16 Aug 2022 00:35 IST

టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా విశ్లేషణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత భారత క్రికెట్‌లో స్పిన్‌ ద్వయం అంటే గుర్తుకొచ్చేది రవిచంద్రన్‌ అశ్విన్ - రవీంద్ర జడేజా. గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శనేమీ చేయడం లేదు. అయితే బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌ చేయగల సమర్థులు కావడంతో వీరిద్దరూ ఈసారి ఆసియా కప్‌నకు ఎంపికయ్యారు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లో వీరి ప్రభావం ఎలా ఉండనుందో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా వివరించాడు. ఇప్పటికే జడేజా గురించి తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వెల్లడించిన ఆకాశ్ చోప్రా తాజాగా రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్ ప్రదర్శనపైనా విశ్లేషించాడు. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఐదు అంతర్జాతీయ టీ20 మ్యాచులను ఆడిన అశ్విన్‌ కేవలం ఆరు వికెట్లను మాత్రమే పడగొట్టాడు. అందుకే అశ్విన్‌ను వికెట్‌ టేకర్‌గా పరిగణించలేమని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. 

‘‘గత ప్రపంచకప్‌కే జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్‌ అకస్మాత్తుగా ఎంపికయ్యాడు. ఇప్పుడు కూడా ఇంకో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఈలోపు ఆసియా కప్‌ టీమ్‌లోకి వచ్చాడు. అంతకుముందు విండీస్‌ పర్యటనకూ సెలెక్ట్‌ అయ్యాడు. రాబోయే ప్రపంచకప్‌ ఆడే అవకాశాలూ మెండుగానే ఉన్నాయి. అయితే అతడికి కాస్త డిఫెన్సివ్‌గా ఉండే పాత్రను కేటాయిస్తే మాత్రం అద్భుతంగా పూర్తి చేస్తాడు. లేదు.. అశ్విన్‌ భారీగా వికెట్లు తీయాలంటే మాత్రం కష్టమే అవుతుంది. అందుకే మీరు (జట్టు యాజమాన్యం) బౌలింగ్‌.. బ్యాటింగ్‌ అయినా సరే అశ్విన్‌కు ఎలాంటి బాధ్యత అప్పగిస్తారో ముందే నిర్ణయించాలి. ఎందుకంటే అదే కీలకమని నా భావన. ఇక్కడ ఎవరి ప్రదర్శనను తక్కువ చేయాలని కాదు. జట్టుకు ఎలాంటి స్పిన్నర్‌ కావాలనేదే ముందే స్పష్టంగా తెలుసుకోవాలి’’ అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. ఆగస్ట్‌ 28న ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని