T20 League : భారత టీ20 లీగ్‌.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన భవిష్యత్‌ పర్యటనల కార్యాచరణ (ఎఫ్‌టీపీ)లో భారత టీ20 లీగ్‌కు దాదాపు రెండున్నర నెలలను...

Updated : 22 Nov 2022 16:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన భవిష్యత్‌ పర్యటనల కార్యాచరణ (ఎఫ్‌టీపీ)లో భారత టీ20 లీగ్‌కు దాదాపు రెండున్నర నెలలను కేటాయించింది. గత సీజన్‌ వరకు రెండు నెలలపాటు జరిగింది. తాజాగా 2023-27 ఎఫ్‌టీపీలో మరో పదిహేను రోజులను పొడిగిస్తూ  ఐసీసీ కార్యాచరణను ఖరారు చేయడం విశేషం. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్ స్టైరిస్‌ ఆనందం వ్యక్తం చేశాడు. టీ20 లీగ్‌ను పొడిగించేందుకు పదేళ్ల కిందటే మద్దతు ఇచ్చానని చెప్పాడు. అప్పుడూ.. ఇప్పుడూ ఇదే అభిప్రాయం మీద ఉన్నట్లు పేర్కొన్నాడు. 

‘‘భారత టీ20 లీగ్‌ను మరిన్ని రోజులు విస్తరించాలని పదేళ్ల కిందట కూడా చర్చ జరిగింది. దాదాపు మూడు నెలలపాటు ఉంటే బాగుంటుందనే చాలా మంది అభిప్రాయం. కనీసం ఇప్పటికైనా పొడిగించడం మంచిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఇందులో భాగస్వామ్యం కావడం నిజంగా అద్భుతం. జాతి విభేదాలు లేకుండా కలిసికట్టుగా ఆడేందుకు లీగ్‌ కేంద్రబిందువుగా మారుతుందని భావిస్తున్నా. పది సంవత్సరాల కిందటే నేను లీగ్‌ విస్తరణకు అనుకూలంగా ఉన్నా. ఇప్పుడూ అదే నా అభిప్రాయం’’ అని స్టైరిస్‌ వివరించాడు. ప్రస్తుతం భారత టీ20 లీగ్‌లో పది జట్లు ఆడుతున్నాయి. గత సీజన్‌లో కొత్తగా గుజరాత్‌,  లఖ్‌నవూ జట్లు చేరాయి.

ఎఫ్‌టీపీలో భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లు భారీగా మ్యాచ్‌లను ఆడనున్నాయి. అలాగే టీమ్‌ఇండియా-ఆసీస్ జట్ల మధ్య జరిగే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలోనూ 2023 నుంచి ఐదేసి టెస్టులు ఉంటాయి. ఈ మూడు జట్లే ఎందుకు ఎక్కువ మ్యాచ్‌లను ఆడతాయనే దానికి స్టైరిస్‌ స్పందించాడు. ‘‘ కొన్ని జట్లు మూడు, నాలుగు, ఐదేసి టెస్టులను ఆడతాయి. న్యూజిలాండ్‌ కూడా ఇలానే ఆడనుంది. కాబట్టి ఐసీసీ తీసుకున్న నిర్ణయమేమీ నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఇక మూడు పెద్ద జట్లే ఎందుకు ఇలా ఆడుతున్నాయనేదానికి కారణం సంపద కూడా కారణం కావచ్చు. ఇక్కడ నుంచే ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. టీమ్‌లు మ్యాచ్‌ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆడితే మంచి పోటీ ఇవ్వడం చాలా కష్టమైన విషయమని అనుకుంటున్నా’’ అని స్కాట్ స్టైరిస్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని