Team India: టీమ్‌ఇండియాలో ఎప్పట్నుంచో ఇదే సమస్య.. మూడు మ్యాచ్‌లకే విశ్రాంతినిస్తారా?: అజయ్‌ జడేజా

అద్భుత ప్రదర్శనతో మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం అభిమానులకు నచ్చదు. కానీ, ఓ ఆటగాడి విషయంలో మాత్రం ఇదే జరుగుతోంది. దానిని భారత మాజీ ఆటగాడు ఎత్తిచూపాడు.

Updated : 05 Dec 2023 13:51 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను భారత్‌ (IND vs AUS) కైవసం చేసుకోవడంలో ఇషాన్‌ కిషన్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. తొలి మూడు మ్యాచుల్లో ఆడిన ఇషాన్‌ కిషన్‌కు (Ishan Kishan) చివరి రెండింట్లో మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో రాణించాడు. మిగతా మ్యాచుల్లో అతడి స్థానంలోకి జితేశ్‌ శర్మ వచ్చాడు. అంతకుముందు జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ ఇషాన్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఆడాడు. అదీనూ గిల్ డెంగీ బారిన పడటంతో అవకాశం వచ్చింది. అతడు కోలుకుని వచ్చాక ఇషాన్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆసీస్‌తో టీ20 సిరీస్‌లోనూ (IND vs AUS) అతడికి అదే పరిస్థితి ఎదురైంది. దీనినే హైలైట్‌ చేస్తూ టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. అయినా అతడికి అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. కనీసం ఆసీస్‌తో టీ20 సిరీస్‌లోనైనా అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడించాల్సింది. మూడు మ్యాచ్‌ల తర్వాత విశ్రాంతి అంటూ ఇంటికి పంపించారు. ఇలాగే కొనసాగితే ఇషాన్‌ కిషన్‌ ఎప్పుడు పరిపూర్ణ క్రికెటర్‌గా మారతాడు?. తనదైన రోజున మ్యాచ్‌ గమనాన్నే కిషన్‌ మార్చేయగలడు. అలాంటి ఆటగాడిని కూడా తరచూ పక్కన పెట్టడం సరైంది కాదు. గత రెండేళ్లలో అతడు ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు? భారత్‌ క్రికెట్‌లో ఇలాంటి సమస్య కొత్తదేమీ కాదు. మేం ఆటగాళ్లను సెలక్ట్‌ చేయం.. రిజెక్ట్‌ చేస్తామన్నట్లుగానే కొనసాగుతోంది. ఓ ఆటగాడు పూర్తిస్థాయి ప్లేయర్‌గా మారాలంటే తగినన్ని అవకాశాలు, సమయం ఇవ్వాల్సిందే’’ అని అజయ్‌ జడేజా వ్యాఖ్యానించాడు. 

దక్షిణాఫ్రికా పర్యటనకు ఇషాన్‌ కిషన్‌ను టీమ్‌ఇండియా (IND vs SA) ఎంపిక చేసింది. వన్డేలు మినహా  టెస్టులు, టీ20ల స్క్వాడ్‌లో ఇషాన్‌కు చోటు దక్కింది. వన్డేలకు సంజూ శాంసన్‌కు రెండో వికెట్‌ కీపర్‌గా అవకాశం కల్పించింది. ఆ జట్టుకు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను నియమించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని