Hardik Pandya: అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య

తమ ఓటమికి ప్రధాన కారణం టాప్‌ ఆర్డర్‌లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్‌ పాండ్య వ్యాఖ్యానించాడు.

Published : 01 May 2024 10:29 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయికి మరో ఓటమి ఎదురైంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ముంబయిపై లఖ్‌నవూ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి కేవలం 144/7 స్కోరుకే పరిమితమైంది. టాప్‌ ఆర్డర్‌ వికెట్లను త్వరగా కోల్పోవడంతో భారీ స్కోరు చేసే అవకాశం చేజారిందని కెప్టెన్ హార్దిక్‌ పాండ్య వ్యాఖ్యానించాడు. లోయర్‌ ఆర్డర్‌లో నెహాల్ వధెరా (46), టిమ్‌ డేవిడ్ (35*), ఓపెనర్ ఇషాన్‌ కిషన్ (32) రాణించడంతో ముంబయి ఈ మాత్రమైనా స్కోరున చేయగలిగింది. 

‘‘మా ఓటమికి మేం చేసిన తప్పిదాలే కారణం. ఆరంభంలో త్వరగా వికెట్లను చేజార్చుకోవడంతో కోలుకోవడానికి కష్టమైంది. బంతిని సరిగ్గా అంచనా వేసి హిట్టింగ్‌ చేయాల్సింది. కానీ, మేం మాత్రం అలాంటి బంతులకే ఔటై పెవిలియన్‌కు చేరాం. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో మేం చాలాసార్లు ఇలానే ఓటమిపాలయ్యాం. ఈ మ్యాచ్‌ నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకుంటాం. మా యువ ఆటగాడు వధెరా గత ఏడాది చాలా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి మాత్రం అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం. వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటాడు. తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడతాడు. భారత జట్టుకూ ప్రాతినిధ్యం వహిస్తాడు’’ అని పాండ్య వ్యాఖ్యానించాడు. 

మా మిడిలార్డర్ బలమైంది: కేఎల్ రాహుల్

‘‘ఇక్కడ 165 - 170 స్కోరుతో పోటీనిచ్చేందుకు అవకాశం ఉంటుంది. మా బౌలర్లు అద్భుతంగా బంతులేసి ముంబయిని కట్టడి చేశారు. మాకు మిడిలార్డర్‌లో బలమైన ఆటగాళ్లున్నారు. నికోలస్‌ పూరన్, కృనాల్ పాండ్య పరిస్థితికి తగ్గట్టుగా ఆడతారు. టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో ప్రతి మ్యాచ్‌ విజయంతో వచ్చే రెండు పాయింట్లు అత్యంత అవసరం. మయాంక్‌ యాదవ్ గురించి ఎక్కువగా ప్రస్తావించను. అతడు కొంచెం నొప్పితో బాధపడుతున్నాడు. అతడిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే బెంచ్‌కే పరిమితం చేయాలని భావించాం. కానీ, అతడు మాత్రం బరిలోకి దిగాడు. వైడ్ యార్కర్లు, స్లో బంతులతో ఆకట్టుకున్నాడు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఇచ్చి ఫలితాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తాం’’ అని లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని