IPL Coaches: బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్‌లో ఈ కోచ్‌లు కి‘రాక్‌’

మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్‌లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్‌లూ ముఖ్యమే. ఐపీఎల్‌లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్‌ చూపిస్తున్న కోచ్‌లు వీరే. 

Published : 01 May 2024 14:49 IST

మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు బౌండరీ లైన్‌ దగ్గర అటూఇటూ తిరగడం.. ఆటగాళ్లకు సలహాలిస్తూ టెన్షన్‌ పడిపోవడం.. తమ జట్టు సరిగా ప్రదర్శన చేయకపోతే అసహనం ప్రదర్శించడం! ఇవేమీ.. సాకర్‌ మ్యాచ్‌లో దృశ్యాలు కాదు!! ఐపీఎల్‌ (IPL)లో సీన్‌లు! సాకర్‌ కోచ్‌లకు తీసిపోనట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా చేసిన హడావుడి అంతాఇంతా కాదు. అతడొక్కడే కాదు రికీ పాంటింగ్, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ కూడా ఐపీఎల్‌-17లో తమ జట్లకు అలా దిశానిర్దేశం చేస్తున్నారు. 

 

నెహ్రా అదో టైపు

ఐపీఎల్‌లో మిగిలిన కోచ్‌లంతా ఒకలా ఉంటే నెహ్రా (Ashish Nehra) ఇంకోలా ఉంటాడు. వ్యూహరచన చేయడమే కాదు తానే బరిలో దిగి ఆడేస్తున్నట్లుగా ఫీల్‌ అవుతుంటాడీ మాజీ భారత పేసర్‌. గుజరాత్‌ టైటాన్స్‌ అరంగేట్ర సీజన్లోనే టైటిల్‌ గెలవడం వెనక నెహ్రా పాత్ర కీలకం. అంతేకాదు ఆ జట్టు ఆడిన రెండో సీజన్లోనూ ఫైనల్‌కు చేరిందంటే తెర వెనక నెహ్రా కష్టం అంతాఇంతా కాదు. మ్యాచ్‌ మొదలుకాగానే కొబ్బరిబొండం చేతిలో పెట్టుకుని ప్రత్యక్షమైపోతాడు. బౌండరీ దగ్గర ఉండే ఆటగాళ్లను పిలిచి మరీ వాళ్ల చెవిలో ఏదో చెబుతూనే ఉంటాడు.

గుజరాత్‌ టైటాన్స్‌ శిబిరం దగ్గర నుంచి మొదలుపెట్టి అటు, ఇటు తిరుగుతూ మ్యాచ్‌ను వీక్షిస్తూ తెగ టెన్షన్‌ పడతాడు. అవసరమైతే అరిచి చెబుతాడు. లేకపోతే చెవిలో ఏదో గుసగుసలాడతాడు. నెహ్రా కోచింగ్‌ స్టయిల్‌ను అభిమానులు బాగా ఆస్వాదిస్తున్నారు. కొంతమంది అయితే సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ వైరల్‌ చేస్తున్నారు. వచ్చాడు సాకర్‌ కోచ్‌ అని.. కొబ్బరి బొండం కోచ్‌ అని ఇలా రకరకాల పేర్లతో నెహ్రాను పిలుస్తున్నారు. ఏదేమైనా ఐపీఎల్‌లో కోచ్‌ అనే పదానికి కొత్త అర్థాన్నిచ్చాడు నెహ్రా.

వీళ్లు యమ సీరియస్‌

కోల్‌కతా జట్టు కోచ్‌ చంద్రకాంత్‌ పండిటే కానీ మార్గనిర్దేశకుడు గౌతమ్‌ గంభీరే (Gautham Gambhir). మొత్తం అన్నీ తానై చూసుకుంటాడు. గౌతీ ఏంట్రా ఇలా ఉన్నాడు అని అభిమానులు అనుకోక మానరు. మైదానంలో అతడి ముఖం అంత సీరియస్‌గా ఉంటుంది. మ్యాచ్‌ ఆద్యంతం ఆటగాళ్లతో, ఆటతో మమేకమై ఎలాగైనా తమకు అనుకూలమైన ఫలితాన్ని రాబట్టాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తాడు. క్యాచ్‌లు వదిలినా, అవకాశాలు అందుకోకపోయినా ఆటగాళ్లతో చాలా సీరియస్‌గానే మాట్లాడుతుంటాడు. అందుకేనేమో ఐపీఎల్‌-17ను కేకేఆర్‌ హ్యాట్రిక్‌ విజయాలతో మొదలుపెట్టింది. 

గతంలో రెండుసార్లు కేకేఆర్‌ను ఐపీఎల్‌ విజేతగా నిలబెట్టిన గంభీర్‌.. ఈసారి కోచ్‌గా తొలి ప్రయత్నంలో కప్‌ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక దిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌ (Ricky Ponting) మైదానంలో చాలా సీరియస్‌గా ఉంటాడు. ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నట్లు కనబడతాయి అతడి హావభావాలు. ప్రత్యర్థి జట్టు చిన్న తప్పు చేసినా సరే వెంటనే రంగంలోకి దిగిపోతాడు రికీ. రూల్‌ ప్రకారం ఏది జరగకపోయినా తక్షణం తమ కెప్టెన్‌ను అంపైర్లతో మాట్లాడమని సైగలు చేస్తుంటాడు. తాను అనుకున్న ఫలితం వచ్చేవరకు పోరాడేందుకు సిద్ధంగా ఉంటాడు.

ఫ్లెమింగ్‌ కూల్‌గా..

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో మహేంద్ర సింగ్‌ ధోనితో పాటు సుదీర్ఘ కాలం ప్రయాణించిన వాళ్లలో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (Stephen Fleming) ఒకడు. సీఎస్కే అయిదుసార్లు టైటిల్‌ గెలవడంలో మైదానంలో మాహీ బుర్ర ఎంత ఉందో.. మైదానం బయట ఫ్లెమింగ్‌ పాత్ర కూడా అంతే ఉంది. ధోని మాదిరే చాలా కూల్‌గా తన పని తాను చేసుకుపోతాడు ఫ్లెమింగ్‌. ఆటగాళ్లను ఎలా దించాలి, ఎలా వాడుకోవాలి. ఎప్పుడు ఏం ఎత్తులు వేయాలి లాంటి వ్యూహాల్లో మహీకి ఫ్లెమింగ్‌ తోడుగా ఉంటాడు. 

ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ను బయటినుంచి నడిపించే కుమార సంగర్కర (Kumara Sangakkara) కూడా ఇదే టైపు. ఏ హడావుడి లేకుండా చాపకింద నీరులా వ్యూహ రచన చేస్తాడు సంగ. అందుకే ఆ జట్టు తొలి 4 మ్యాచ్‌లను గెలిచి ఐపీఎల్‌-17ని గొప్పగా ఆరంభించింది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు