చైనా చేతిలో భారత్‌ ఓటమి

ఉబెర్‌కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్‌ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది.

Published : 01 May 2024 02:10 IST

ఉబెర్‌కప్‌ బ్యాడ్మింటన్‌ 

చెంగ్‌డూ (చైనా): ఉబెర్‌కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్‌ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. 15సార్లు విజేత చైనాపై ద్వితీయ శ్రేణి భారత జట్టు సంచలనం సృష్టిస్తుందన్న అంచనాలు లేకపోయినా.. కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా గెలవలేక అన్నింట్లోనూ ఓటమి చవిచూసింది. మంగళవారం గ్రూప్‌-ఏ పోరులో భారత్‌ 0-5తో బలమైన చైనా చేతితో పరాజయం పాలైంది. తొలి సింగిల్స్‌లో ఇషారాణి బరుహా 12-21, 10-21తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ చెన్‌ యూఫీ చేతిలో ఓడింది. తర్వాత డబుల్స్‌లోనూ భారత్‌ పుంజుకోలేకపోయింది. ప్రియ-శ్రుతి జోడీ 13-21, 12-21తో చెన్‌-జియా జంట చేతిలో ఓడిపోయింది. పోటీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో హన్‌యూతో పోరులో 9-21, 1-4తో వెనుకబడిన అన్మోల్‌ గాయంతో పోటీ నుంచి వైదొలిగింది. దీంతో చైనా 3-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. డబుల్స్‌లో సిమ్రన్‌-రితిక ద్వయం 9-21, 10-21తో లూ-తాన్‌ జంట చేతిలో ఓడగా.. చివరి సింగిల్స్‌లో తన్విశర్మ 7-21, 16-21తో వాంగ్‌జి యీకి తలొంచడంతో భారత్‌ ఓటమి పరిపూర్ణమైంది. ఈ పరాజయంతో గ్రూప్‌ దశను భారత్‌ (2 పాయింట్లు) రెండో స్థానంతో ముగించింది. చైనా (3) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. థామస్‌కప్‌లో భారత పురుషుల జట్టు ఇప్పటికే క్వార్టర్స్‌ చేరుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని