పృథ్వీషాకి సమన్లు

యువ బ్యాటర్‌ పృథ్వీషాకి ముంబయి సెషన్స్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్‌ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.

Updated : 01 May 2024 06:47 IST

ముంబయి: యువ బ్యాటర్‌ పృథ్వీషాకి ముంబయి సెషన్స్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్‌ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది. ఓ పబ్‌లో పృథ్వీ తనపై చేయి చేసుకున్నాడని స్వప్న దాఖలు చేసిన పిటీషన్‌కు స్పందిస్తూ మెట్రోపాలిటన్‌ కోర్టు ఈ నెల ఆరంభంలో పృథ్వీపై గిల్‌ చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా సెషన్స్‌ కోర్టులో స్వప్న రివ్యూ పిటీషన్‌ వేసింది. అంతేకాక పృథ్వీపై కేసు నమోదు చేయనందుకు పోలీసులకు కూడా సెషన్స్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. పృథ్వీషాపై దాడి చేసిందన్న కారణంతో గతేడాది ఫిబ్రవరిలో స్వప్నను పోలీసులు అరెస్టు చేయగా ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. పృథ్వీనే తనపై బ్యాట్‌తో దాడి చేశాడని అంథేరి విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు.


సెమీస్‌లో విశ్వనాథ్‌, ఆకాశ్‌, ప్రీత్‌

 అస్తానా (కజకిస్థాన్‌): ఆసియా అండర్‌-22 యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు ఖరారయ్యాయి. విశ్వనాథ్‌ (48 కిలోలు), ఆకాశ్‌ (60 కిలోలు), ప్రీత్‌ (67 కిలోలు) సెమీస్‌ చేరారు. మంగళవారం క్వార్టర్‌ఫైనల్లో విశ్వనాథ్‌ 5-0తో హసాని (ఇరాన్‌)ని చిత్తు చేయగా.. ఆకాశ్‌ అంతే తేడాతో ఇబాది ఆర్మాన్‌ (ఇరాన్‌)పై నెగ్గాడు. మరో క్వార్టర్స్‌లో గుయెన్‌ (వియత్నాం)ను ప్రీత్‌ చిత్తు చేశాడు. ప్రీత్‌ పంచ్‌లకు గుయెన్‌ తాళలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను ఆపి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించాడు. ఇంకో క్వార్టర్స్‌లో కునాల్‌ (75 కిలోలు) 0-5తో మహ్‌షరి (ఇరాన్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. సోమవారం రాత్రి జరిగిన బౌట్లలో రాహుల్‌ కుందు (75 కిలోలు), లక్ష్యయ్‌ (+92 కిలోలు), లక్ష్మీ (50 కిలోలు), తమన్నా (54 కిలోలు), యాత్రి పటేల్‌ (57 కిలోలు), సృష్టి (63 కిలోలు) కూడా సెమీస్‌ చేరి పతకాలు ఖాయం చేశారు.


హర్షిత్‌పై ఓ మ్యాచ్‌ నిషేధం

కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ హర్షిత్‌ రాణాపై ఓ మ్యాచ్‌ నిషేధం పడింది. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఐపీఎల్‌ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించాడన్న కారణంతో అతడి మ్యాచ్‌ ఫీజులో ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ వందశాతం కోత కూడా విధించింది. దిల్లీతో పోరులో అభిషేక్‌ పోరెల్‌ను ఔట్‌ చేసిన తర్వాత అతడి వైపు వేలిని చూపిస్తూ పెవిలియన్‌కి వెళ్లు అన్నట్లుగా హర్షిత్‌ సంజ్ఞ చేశాడు. తాజా సస్పెన్షన్‌తో శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. ఈ టోర్నీలో క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా శిక్ష ఎదుర్కోవడం హర్షిత్‌కు ఇది రెండోసారి.


మెరిసిన ‘లక్ష్య’ ప్రత్యూష, శ్రీనివాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లు సి.హెచ్‌.ప్రత్యూష, ఎన్‌.శ్రీనివాస్‌ సత్తా చాటారు. బెంగళూరులో జరిగిన ఇండియన్‌ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్‌లో ప్రత్యూష (200 మీ.) స్వర్ణంతో మెరవగా.. శ్రీనివాస్‌ (200 మీ.) కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల  200 మీటర్ల పరుగులో ప్రత్యూష   23.92 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి ఎగరేసుకుపోయింది.  పురుషుల 200 మీటర్ల రేసులో శ్రీనివాస్‌ 21.44 సెకన్లలో ఫినిషింగ్‌ లైన్‌ చేరి మూడో స్థానంలో నిలిచాడు.


నాదల్‌ కష్టపడి..

మాడ్రిడ్‌: పునరాగమనంలో మునుపటి స్థాయిలో ఆడలేకపోతున్న స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ మాడ్రిడ్‌ ఓపెన్లో కష్టంగా ప్రిక్వార్టర్స్‌ చేరాడు. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌కు సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో రఫా 6-1, 6-7 (5-7), 6-3తో కాహిన్‌ (అర్జెంటీనా)పై మూడు గంటలకు పైగా శ్రమించి గెలిచాడు. ఇటీవల బార్సిలోనా ఓపెన్లో ఈ స్పెయిన్‌ స్టార్‌ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. మహిళల సింగిల్స్‌లో స్వైటెక్‌ (పోలెండ్‌) క్వార్టర్స్‌ చేరింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-1, 6-0తో టామో (స్పెయిన్‌)ను చిత్తు చేసింది.


భారత్‌లో ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌

దిల్లీ: 2025 ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మంగళవారం ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌)  ఈ విషయాన్ని ప్రకటించింది. గువాహటిలో ఈ మెగా టోర్నీ జరగనుంది. 2008 తర్వాత బీడబ్ల్యూఎఫ్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుండటం ఇదే తొలిసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని