పంత్‌కు ఓటు.. సంజుకు చోటు

రిషబ్‌ పంత్‌ పోరాటం ఫలించింది.. శాంసన్‌ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్‌ కోరిక తీరనుంది..! వెస్టిండీస్‌-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్‌ కోసం వీరంతా విమానమెక్కనున్నారు.

Published : 01 May 2024 02:23 IST

రాహుల్‌, రింకూలకు నిరాశ
దూబెకు అవకాశం
రిజర్వ్‌ జాబితాలో గిల్‌
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపిక

రిషబ్‌ పంత్‌ పోరాటం ఫలించింది.. శాంసన్‌ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్‌ కోరిక తీరనుంది..! వెస్టిండీస్‌-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్‌ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. కానీ.. ఎవరూ ఊహించనివిధంగా నయా ఫినిషర్‌ రింకూసింగ్‌పై వేటు పడింది. ఈసారి ఐపీఎల్‌లో నిలకడగా ఆడుతున్నప్పటికీ కేఎల్‌ రాహుల్‌కు నిరాశ తప్పలేదు.

 దిల్లీ

టీమ్‌ఇండియా ఎంపికపై సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ముందే చెప్పినట్టుగా రోహిత్‌శర్మ జట్టును నడిపించనుండగా.. హార్దిక్‌ పాండ్య వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అహ్మదాబాద్‌లో బీసీసీఐ కార్యదర్శి జై షా అధ్యక్షతన సమావేశమైన సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు. పెద్దగా సంచలనాలు ఏమీ లేవుగానీ.. కొందరి ఉద్వాసన చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్‌ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు.. అనుభవానికి పెద్దపీట వేశారు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌పై సెలెక్షన్‌ కమిటీ నమ్మకం ఉంచింది. అతడు ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ చాటుకోవడంతో.. ఇషాన్‌ కిషన్‌, జితేశ్‌ శర్మల పేర్లను పరిగణనలోకి  తీసుకోలేదు. సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌కూ నిరాశే మిగిలింది. ఈసారి ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్‌ను రెండో వికెట్‌కీపర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. ప్రపంచకప్‌లో ఆడనుండటం శాంసన్‌కు ఇదే తొలిసారి. రోహిత్‌తో కలిసి యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా బరిలో దిగనున్నాడు. ఐపీఎల్‌లో పెద్దగా పరుగులు చేయకపోయినా గిల్‌ను కాదని ఎడంచేతి వాటం ఆటగాడు యశస్విని సెలక్టర్లు తీసుకున్నారు. వెస్టిండీస్‌ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కావడంతో ఈసారి జట్టులో నలుగురు స్పిన్నర్లకు చోటు లభించింది. కుల్‌దీప్‌, స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ జట్టులో చోటు నిలబెట్టుకోగా.. ఫామ్‌లో ఉన్న యుజ్వేంద్ర చాహల్‌కూ సెలక్టర్లు అవకాశం కల్పించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అదరగొడుతున్న శివమ్‌ దూబెకు సెలక్టర్లు చోటు కల్పించక తప్పలేదు. అతడి ఎంపికపై పెద్ద చర్చనే సాగిందని సమాచారం. హార్దిక్‌ పాండ్య, రింకూ సింగ్‌, దూబెలలో ఇద్దరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాగా.. సెలక్టర్లు రింకూను పక్కనపెట్టారు. ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నా.. గత అనుభవం దృష్ట్యా సెలక్టర్లు పాండ్యకు చోటు కల్పించారు. జట్టులో స్థానంతో పాటు వైస్‌ కెప్టెన్సీ కట్టబెట్టారు. అయితే ఒక స్పిన్నర్‌ను తగ్గించుకుని రింకూను ఎంపిక చేసే అవకాశమున్నా.. సెలక్టర్లు అతడిని పక్కన పెట్టేందుకే ఓటేశారు.  పేసర్ల విషయంలో బుమ్రా, సిరాజ్‌ స్థానాలు ఖాయం కాగా.. మూడో స్థానాన్ని అర్ష్‌దీప్‌ దక్కించుకున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌, అవేష్‌ ఖాన్‌ రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. జూన్‌ 2న టీ20 ప్రపంచకప్‌ ఆరంభం కానుంది.  జూన్‌ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్‌ తన పోరాటాన్ని ప్రారంభిస్తుంది.

భారత జట్టు

రోహిత్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌) సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ రిజర్వ్‌ ఆటగాళ్లు: శుబ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అవేష్‌ ఖాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని