కెరీర్‌పై భయంతో పుజారా ఏడ్చిన వేళ.. 

భారత టెస్టు జట్టులో అత్యంత విలువైన ఆటగాళ్లలో చెతేశ్వర్‌ పుజారా ఒకడు.

Updated : 08 May 2021 09:56 IST

ముంబయి: భారత టెస్టు జట్టులో అత్యంత విలువైన ఆటగాళ్లలో చెతేశ్వర్‌ పుజారా ఒకడు. గంటలు గంటలు క్రీజులో నిలిచే పుజారా మానసిక దృఢత్వం గురించి తరచుగా చర్చ జరుగుతుంటుంది. అలాంటి పుజారా ఒకప్పుడు కెరీర్‌ పట్ల తీవ్ర ఆందోళనతో ఏడ్చాడట. పూర్తి ప్రతికూల ఆలోచనలతో మానసిక వేదనకు గురయ్యాడట. తాను క్రికెట్లో కొనసాగలేనేమో అని భయపడ్డాడట. ఓ ఇంటర్వ్యూలో ఆ రోజులను అతను గుర్తు చేసుకున్నాడు. ‘‘కెరీర్‌ ఆరంభంలో నాకు తొలిసారి పెద్ద గాయం అయింది. అది నా కెరీర్లోనే అత్యంత కఠిన సమయం. జట్టు ఫిజియో నా దగ్గరికొచ్చి కోలుకోవడానికి ఆరు నెలల దాకా సమయం పట్టొచ్చన్నాడు. నేను తీవ్ర నిరాశకు గురై ఏడ్చేశాను. అప్పుడు నా ఆలోచనలన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. మళ్లీ క్రికెట్ ఆడగలనా.. అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగగలనా అని సందేహాలు కలిగాయి’’ అని పుజారా చెప్పాడు. ఈ దశ నుంచి ఎలా కోలుకున్నది వివరిస్తూ.. ‘‘తర్వాత నెమ్మదిగా నా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడుతుంటే నాలో ధైర్యం వచ్చింది. అంతా సర్దుకుంటుందని వాళ్లు ధైర్యం చెప్పారు. భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి వర్తమానం మీద దృష్టి పెట్టా. అదే సమయంలో యోగా, ధ్యానం చేయడంతో మళ్లీ సానుకూల ఆలోచనల్లోకి వచ్చా’’ అని పుజారా తెలిపాడు. ఒకప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక అమ్మ దగ్గరికెళ్లి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని, కానీ తర్వాత నెమ్మదిగా ఒత్తిడిని అధిగమించడం అలవాటైందని చెతేశ్వర్‌ చెప్పాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని