IPL: ఐపీఎల్‌ కొంచెం కొత్తగా

క్రికెట్‌ వినోదాన్ని అందించేందుకు మరోసారి ఐపీఎల్‌ ముస్తాబవుతోంది. 16వ సీజన్‌కు శుక్రవారమే తెరలేవనుంది. టీ20 మజాను అందించేందుకు 10 జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ సారి లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

Updated : 28 Mar 2023 06:57 IST

ఈ సీజన్‌ నుంచి లీగ్‌లో కొన్ని మార్పులు

ఈనాడు క్రీడావిభాగం

క్రికెట్‌ వినోదాన్ని అందించేందుకు మరోసారి ఐపీఎల్‌ ముస్తాబవుతోంది. 16వ సీజన్‌కు శుక్రవారమే తెరలేవనుంది. టీ20 మజాను అందించేందుకు 10 జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ సారి లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కొన్నింట్లో మార్పులూ చేసింది. వైడ్‌, నోబాల్‌కు సమీక్ష, టాస్‌ తర్వాత తుది జట్టు ప్రకటన, ఇంపాక్ట్‌ ప్లేయర్‌.. ఇలా ఎన్నో కొత్త విషయాలను ఈ సీజన్‌లో చూడబోతున్నాం. ఫార్మాట్‌ కూడా కాస్త మారింది. మరి ఆ కొత్త విశేషాల గురించి తెలుసుకుందాం పదండి!

గతేడాది నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా నిరుడు ఫార్మాట్లో మార్పులు చేశారు. గ్రూప్‌నకు అయిదు చొప్పున జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఐపీఎల్‌లో గత ప్రదర్శన ఆధారంగా వీటికి సీడింగ్స్‌ ఇచ్చారు. లీగ్‌ దశలో ఓ జట్టు.. తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో పాటు అవతలి గ్రూప్‌లోని సమాన స్థాయి ఉన్న జట్టుతో రెండేసి మ్యాచ్‌లు, మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడింది. అలా ప్లేఆఫ్స్‌కు ముందు ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడేలా చూశారు. ఈ సారి కూడా ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లే ఆడుతుంది. కానీ ఫార్మాట్‌లో చిన్న మార్పు చేశారు. ఈ సీజన్‌లోనూ 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విడగొట్టారు. కానీ ఈసారి ఓ గ్రూప్‌లోని ప్రతి జట్టు.. అవతలి గ్రూప్‌లోని అయిదు జట్లతోనూ రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో పోరులో తలపడుతుంది. ఉదాహరణకు ‘ఎ’ గ్రూప్‌లో ఉన్న ముంబయి.. ‘బి’ గ్రూప్‌లోని చెన్నై, సన్‌రైజర్స్‌, ఆర్సీబీ, పంజాబ్‌, గుజరాత్‌తో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ‘ఎ’ గ్రూప్‌లోని మిగతా జట్లు.. కోల్‌కతా, రాజస్థాన్‌, దిల్లీ, లఖ్‌నవూతో ముంబయి ఒక్కో మ్యాచ్‌లో పోటీపడుతుంది.


టాస్‌ తర్వాత తుది జట్టు..

మ్యాచ్‌లో టాస్‌ ప్రాధాన్యాన్ని తగ్గించేలా, ఇంపాక్ట్‌ ఆటగాడి విధానానికి మరింత బలం చేకూర్చేలా బీసీసీఐ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో టాస్‌ వేసిన తర్వాత తుది జట్లను ప్రకటించే అవకాశం కల్పిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్లోలాగే ఐపీఎల్‌లోనూ గతేడాది వరకూ టాస్‌కు ముందే ఇరు జట్ల కెప్టెన్లు తమ తుది 11 మంది ఆటగాళ్ల జాబితాను ఇచ్చిపుచ్చుకునేవాళ్లు. కానీ ఇప్పుడు టాస్‌ వేసిన తర్వాత తుది జట్లను ప్రకటించొచ్చు. దీనివల్ల రెండు జట్లకూ సమాన ప్రయోజనం కలుగుతుంది. పిచ్‌ స్వభావాన్ని బట్టి టాస్‌ గెలిచిన కెప్టెన్‌ అదనంగా ఓ బౌలర్‌ లేదా బ్యాటర్‌ను తీసుకోవచ్చు. ఓడిపోయిన సారథి కూడా పరిస్థితులకు తగినట్లుగా జట్టులో మార్పు చేసుకోవచ్చు. ఈ ఏడాది జరిగిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ ఆరంభ సీజన్‌లో ఈ విధానాన్ని అనుసరించారు. టాస్‌కు కెప్టెన్లు 11 మంది ఆటగాళ్లతో కూడిన చెరో రెండు జాబితాలతో వచ్చారు. దీంతో టాస్‌ గెలిస్తే ఒకటి, ఓడిపోతే మరొక జట్టును మ్యాచ్‌లో బరిలో దించొచ్చు.


5 పరుగుల జరిమానా..

బౌలర్‌ బంతి వేసేటప్పుడు ఫీల్డర్‌ లేదా వికెట్‌కీపర్‌ దురుద్దేశపూర్వకంగా కదిలితే ఫీల్డింగ్‌ జట్టుకు అయిదు పెనాల్టీ పరుగులు విధించనున్నారు. ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు. నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయలేకపోతే వలయం బయట అయిదుగురికి బదులు కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తారు.


వైడ్‌, నోబాల్‌కు సమీక్ష.. 

ఇప్పటికే ఐపీఎల్‌లో నిర్ణయ సమీక్ష పద్ధతిని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది బ్యాటర్‌ ఔటా? కాదా? అనే విషయం వరకే పరిమితమైంది. కానీ ఈ సీజన్‌ నుంచి వైడ్‌, నోబాల్‌కు కూడా సమీక్ష కోరే అవకాశాన్ని జట్లకు కల్పిస్తున్నారు. ఇప్పటికే మహిళల ప్రిమియర్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌లో ఈ విధానాన్ని అమలు చేశారు. టీ20ల్లో ఎన్నోసార్లు జట్లు ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలయ్యాయి. అంపైర్లు కూడా కొన్నిసార్లు వైడ్‌, నోబాల్‌ పరంగా తీసుకున్న నిర్ణయాలు వివాదాలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో వైడ్‌, నోబాల్‌ సమీక్ష కోరే అవకాశం జట్లకు లాభించేదే. ముఖ్యంగా నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చే బంతిని నోబాల్‌గా ప్రకటించే విషయంలో సరైన నిర్ణయం తీసుకునే ఆస్కారం ఏర్పడుతుంది.


మళ్లీ ఇంటా, బయట..

ఈ సారి లీగ్‌ ఇంటా, బయట విధానంలో జరగబోతుంది. లీగ్‌కు ఇది కొత్తేమీ కాకపోయినా 2019 తర్వాత తిరిగి ఇంటా, బయట మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టు సొంతగడ్డపై 7, ప్రత్యర్థి మైదానాల్లో 7 మ్యాచ్‌లు ఆడుతుంది. కరోనా కారణంగా 2020 సీజన్‌ పూర్తిగా యూఏఈలో జరిగింది. 2021లో సగం మ్యాచ్‌లు ఇక్కడ, సగం మ్యాచ్‌లు యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. నిరుడు ముంబయి, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌ మాత్రమే మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చాయి. ఈసారి అదనంగా మరో రెండు నగరాలు కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు వేదికలుగా మారబోతున్నాయి. రెండో సొంతగడ్డగా గువాహతిలో రాజస్థాన్‌, ధర్మశాలలో పంజాబ్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. వీటితో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, కోల్‌కతా, లఖ్‌నవూ, దిల్లీ, అహ్మదాబాద్‌, జైపుర్‌, మొహాలీలో మ్యాచ్‌లు జరుగుతాయి.


జట్లు కూడా..

ఐపీఎల్‌ 16వ సీజన్‌కు ముందు నిరుడు డిసెంబర్‌ 23న ఆటగాళ్ల వేలం జరిగింది. దీంతో జట్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. ఇంగ్లాండ్‌ యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ కోసం పంజాబ్‌ ఏకంగా రూ.18.50 కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను సీఎస్కే రూ.16.25 కోట్లకు దక్కించుకున్న విషయమూ విదితమే. గతేడాది వరకూ సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా ఉన్న విలియమ్సన్‌.. ఇప్పుడు గుజరాత్‌ తరపున ఆడబోతున్నాడు. ఈ సారి దిల్లీకి వార్నర్‌, సన్‌రైజర్స్‌కు మార్‌క్రమ్‌, పంజాబ్‌కు ధావన్‌, కోల్‌కతాకు నితీష్‌ రాణా నాయకత్వం వహించనున్నారు.


ఇంపాక్ట్‌ ఆటగాడు..

ఇంకా సీజన్‌ ఆరంభమే కాలేదు కానీ ఇప్పటికే ఈ ‘ఇంపాక్ట్‌ ఆటగాడు’ నిబంధన గురించి చర్చ ఊపందుకుంది. ఆటకు మరింత ఆకర్షణ, ఆదరణ పెంచి.. మ్యాచ్‌లను రసవత్తరంగా మార్చేందుకు బీసీసీఐ ఈ నిబంధనను ఐపీఎల్‌లో ప్రవేశపెడుతుంది. మ్యాచ్‌ కోసం ప్రతి జట్టూ తుది 11 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు సబ్‌స్టిట్యూట్‌లను ప్రకటించాలి. ఆ నలుగురిలో నుంచే ఒకరిని ఇంపాక్ట్‌ ఆటగాడిగా ఆడించొచ్చు. తుది 11 మందిలో విదేశీ ఆటగాళ్లు నలుగురు కంటే తక్కువ ఉంటే తప్ప ఈ ఇంపాక్ట్‌ ఆటగాడిగా కచ్చితంగా భారత క్రికెటర్‌నే ఎంచుకోవాలి. ముందుగానే తుది జట్టులో ప్రకటించిన ఓ క్రికెటర్‌ స్థానంలో మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా ఈ ఇంపాక్ట్‌ ఆటగాడిని తీసుకోవచ్చు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అనుకుంటే.. బ్యాటర్‌ స్థానంలో స్పిన్నర్‌ను ఇంపాక్ట్‌ ఆటగాడిగా ఆడించొచ్చు. ఒకవేళ ఛేదనలో అదనపు బ్యాటర్‌ అవసరం ఉంది అనుకుంటే.. అప్పుడు ఓ బౌలర్‌ స్థానంలో బ్యాటర్‌ను తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇంపాక్ట్‌ ఆటగాడి కోసం మైదానం వీడిన క్రికెటర్‌ మళ్లీ మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు. ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందు లేదా ఓవర్‌ ముగిశాక లేదా వికెట్‌ పడ్డాక లేదా ఓ బ్యాటర్‌ రిటైరయ్యాకే ఇంపాక్ట్‌ ఆటగాడు మైదానంలోకి రావాల్సి ఉంటుంది. కానీ పదకొండు మంది మాత్రమే బ్యాటింగ్‌కు చేయాలి. అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన బౌలర్‌ స్థానంలో వచ్చే ఇంపాక్ట్‌ ఆటగాడు తన పూర్తి కోటా నాలుగు ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిబంధన కారణంగా ఆల్‌రౌండర్ల ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుందని మాజీలు అంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని