రాజస్థాన్‌ ఢమాల్‌

యశస్వి, బట్లర్‌, శాంసన్‌ లాంటి మెరుపు బ్యాటర్లున్న జట్టు రాజస్థాన్‌. గత మ్యాచ్‌లో 150 లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే ఛేదించిందా జట్టు. అలాంటి జట్టు సొంతగడ్డ జైపుర్‌లో బెంగళూరు బౌలర్ల దెబ్బకు 59కే కుప్పకూలి పరాభవం మూటగట్టుకుంది.

Updated : 15 May 2023 04:55 IST

59కే ఆలౌట్‌
బెంగళూరు ప్లేఆఫ్‌ ఆశలు సజీవం

యశస్వి, బట్లర్‌, శాంసన్‌ లాంటి మెరుపు బ్యాటర్లున్న జట్టు రాజస్థాన్‌. గత మ్యాచ్‌లో 150 లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే ఛేదించిందా జట్టు. అలాంటి జట్టు సొంతగడ్డ జైపుర్‌లో బెంగళూరు బౌలర్ల దెబ్బకు 59కే కుప్పకూలి పరాభవం మూటగట్టుకుంది. అత్యావశ్యక విజయంతో పాటు భారీగా నెట్‌రన్‌రేట్‌ కూడా సాధించిన ఆర్సీబీ.. ఐపీఎల్‌-16 ప్లేఆఫ్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది. 13 మ్యాచ్‌ల్లో ఏడో ఓటమిని మూటగట్టుకున్న రాజస్థాన్‌.. దాదాపుగా ప్లేఆఫ్స్‌కు దూరమైంది.

బెంగళూరు అదరగొట్టింది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఆదివారం ఆ జట్టు 112 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్‌పై ఘన విజయం సాధించింది. మొదట బెంగళూరు 171/5 స్కోరు చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (55; 44 బంతుల్లో 3×4, 2×6), మ్యాక్స్‌వెల్‌ (54; 33 బంతుల్లో 5×4, 3×6) మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఛేదనలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పార్నెల్‌ (3/10), బ్రాస్‌వెల్‌ (2/16), కర్ణ్‌శర్మ (2/19) దెబ్బకు రాజస్థాన్‌ కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. హెట్‌మయర్‌ (35; 19 బంతుల్లో 1×4, 4×6) టాప్‌ స్కోరర్‌. 12 మ్యాచ్‌ల్లో ఆర్సీబీకిది ఆరో విజయం.

రాజస్థాన్‌ టపటపా..: లక్ష్యం 172.. ఈ సీజన్లో రాజస్థాన్‌ బ్యాటర్ల ఫామ్‌కి ఇది పెద్ద లెక్కా.. అనిపించింది. కానీ ఇన్నింగ్స్‌లో 10 బంతులు పడ్డాయో లేదో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అంతా టపటపానే! అటు పేస్‌.. ఇటు స్పిన్‌తో ప్రత్యర్థిని దెబ్బ మీద దెబ్బ తీసిన ఆర్సీబీ అవకాశమే ఇవ్వలేదు. గత మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన యశస్వి (0)ని సిరాజ్‌ తొలి ఓవర్లోనే ఔట్‌ చేసి పతనాన్ని మొదలుపెట్టగా.. ఆ తర్వాతి ఓవర్లో బట్లర్‌ (0), శాంసన్‌ (4)లను పెవిలియన్‌ చేర్చిన పార్నెల్‌.. రాజస్థాన్‌కు డబుల్‌ షాక్‌ ఇచ్చాడు. ఆపై ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో కూరుకుపోయింది. 7 ఓవర్లకు 31/6తో నిలిచిన రాయల్స్‌.. కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ కర్ణ్‌శర్మ వేసిన 8వ ఓవర్లో ఎదురుదాడి చేసిన హెట్‌మయర్‌.. వరుసగా 3 సిక్స్‌లు బాదడంతో 19 పరుగులొచ్చాయి. ఆ తర్వాత 15 బంతుల్లో 9 పరుగులే చేసిన రాజస్థాన్‌.. చివరి 4 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులో అయిదుగురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. హెట్‌మయర్‌ కాక రూట్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు.

వాళ్లిద్దరే మళ్లీ..: అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ ఆటే హైలైట్‌. గత కొన్ని మ్యాచ్‌లుగా స్థిరంగా ఆడుతున్న ఈ జోడీ మరోసారి సత్తా చాటింది. మొదట కోహ్లి (18)తో శుభారంభం అందించిన డుప్లెసిస్‌.. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ తోడుగా ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచాడు. ముఖ్యంగా ప్రత్యర్థి బౌలర్లపై మ్యాక్సీ ఎదురుదాడి చేశాడు. తనశైలిలో ర్యాంప్‌, స్కూప్‌ షాట్లతో స్కోరు పరుగులెత్తించాడు. ఈ క్రమంలో చాహల్‌ బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌లో కళ్లుచెదిరే సిక్స్‌ బాదాడు. డుప్లెసిస్‌ కూడా కొన్ని మెరుపు షాట్లు ఆడాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్‌ అర్ధసెంచరీ (41 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. కానీ ఎంత బాదినా 14 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 107/1 మాత్రమే. దీనికి తోడు రెండు ఓవర్ల తేడాతో డుప్లెసిస్‌, లొమ్రార్‌ (1), కార్తీక్‌ (0) వెనుదిరగడంతో 16 ఓవర్లకు 123/4తో ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది. అర్ధసెంచరీ అయ్యాక మ్యాక్స్‌వెల్‌ కూడా వెనుదిరగడంతో ఆర్సీబీ ఓ మోస్తరు స్కోరైనా చేస్తుందా అనిపించింది. కానీ ఆఖరి ఓవర్లో అనుజ్‌ రావత్‌ (29 నాటౌట్‌; 11 బంతుల్లో 3×4, 2×6) బ్యాట్‌ ఝుళిపించడంతో 18 పరుగులు రాబట్టిన బెంగళూరు మెరుగైన స్కోరుతో ఇన్నింగ్స్‌ ముగించింది.

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) యశస్వి (బి) అసిఫ్‌ 18; డుప్లెసిస్‌ (సి) యశస్వి (బి) అసిఫ్‌ 55; మ్యాక్స్‌వెల్‌ (బి) సందీప్‌ 54; లొమ్రార్‌ (సి) జురెల్‌ (బి) జంపా 1; కార్తీక్‌ ఎల్బీ (బి) జంపా 0; బ్రాస్‌వెల్‌ నాటౌట్‌ 9; అనుజ్‌ నాటౌట్‌ 29; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-50, 2-119, 3-120, 4-120, 5-137; బౌలింగ్‌: సందీప్‌శర్మ 4-0-34-1; ఆడమ్‌ జంపా 4-0-25-2; చాహల్‌ 4-0-37-0; అశ్విన్‌   4-0-33-0; అసిఫ్‌ 4-0-42-2

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 0; బట్లర్‌ (సి) సిరాజ్‌ (బి) పార్నెల్‌ 0; శాంసన్‌ (సి) అనుజ్‌ (బి) పార్నెల్‌ 4; రూట్‌ ఎల్బీ (బి) పార్నెల్‌ 10; పడిక్కల్‌ (సి) సిరాజ్‌ (బి) బ్రాస్‌వెల్‌ 4; హెట్‌మయర్‌ (సి) బ్రాస్‌వెల్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 35; జురెల్‌ (సి) లొమ్రార్‌ (బి) బ్రాస్‌వెల్‌ 1; అశ్విన్‌ రనౌట్‌ 0; జంపా (బి) కర్ణ్‌ 2; సందీప్‌ నాటౌట్‌ 0; అసిఫ్‌ (సి) కోహ్లి (బి) కర్ణ్‌ 0; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (10.3 ఓవర్లలో ఆలౌట్‌) 59; వికెట్ల పతనం: 1-1, 2-6, 3-7, 4-20, 5-28, 6-31, 7-50, 8-59, 9-59; బౌలింగ్‌: సిరాజ్‌ 2-0-10-1; పార్నెల్‌ 3-0-10-3; బ్రాస్‌వెల్‌ 3-0-16-2; కర్ణ్‌శర్మ 1.3-0-19-2; మ్యాక్స్‌వెల్‌ 1-0-3-1


59

ఐపీఎల్‌ చరిత్రలో ఇది మూడో అత్యల్ప స్కోరు. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో రాజస్థాన్‌, బెంగళూరే ఉండడం విశేషం. 49 పరుగులతో ఆర్సీబీ (2017 కోల్‌కతాపై) అగ్రస్థానంలో ఉండగా.. రాజస్థాన్‌ (58, 59 పరుగులు) ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉంది. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రత్యర్థి బెంగళూరే. 2009లో రాయల్స్‌ 58కే ఆలౌటైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని