Awards: రాకెట్‌ వీరులకు ఖేల్‌రత్న

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డును గెలుచుకుంది. క్రీడా పురస్కారాలను బుధవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Updated : 21 Dec 2023 03:47 IST

సాత్విక్‌, చిరాగ్‌లకు అత్యున్నత క్రీడా పురస్కారం
షమి సహా 26 మందికి అర్జున
తెలుగు రాష్ట్రాల నుంచి హుసాముద్దీన్‌, ఈషా, అజయ్‌లకు అవార్డు
దిల్లీ

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డును గెలుచుకుంది. క్రీడా పురస్కారాలను బుధవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, కామన్వెల్త్‌ క్రీడల్లో రజత పతకాలతో మెరిసిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీకి ఊహించినట్లే ఖేల్‌ రత్న పురస్కారం లభించింది. మొత్తం 26 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. క్రికెటర్‌ మహ్మద్‌ షమి, తెలుగు రాష్ట్రాల నుంచి ఈషా సింగ్‌ (షూటింగ్‌), మహ్మద్‌ హుసాముద్దీన్‌ (బాక్సింగ్‌), అజయ్‌కుమార్‌ రెడ్డి (అంధుల క్రికెట్‌)లకు అర్జున అవార్డులు దక్కాయి. జనవరి 9న దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తారు.

గెలుపు గుర్రాలు..: భారత బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో ప్రకాశ్‌ పదుకొణె, పుల్లెల గోపీచంద్‌, సైనా నెహ్వాల్‌, పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌ ఎన్నో ఘనతలు సాధించారు. మరెన్నో రికార్డులు బద్దలుకొట్టారు. డబుల్స్‌లో మాత్రం సాత్విక్‌- చిరాగ్‌ జోడీకి సాటి లేదనే చెప్పాలి. భారత్‌ తరఫున సాత్విక్‌ జంట సాధించిన ఘనతలు అసామాన్యం. 2022 థామస్‌ కప్‌లో భారత్‌ స్వర్ణ చరిత్రలో సాత్విక్‌- చిరాగ్‌ జోడీదే కీలకపాత్ర. 2022 టోక్యో ప్రపంచ ఛాంపియషిప్‌లో రజతంతో మెరిసింది. 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం, 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకాలతో సత్తాచాటింది. 2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో బంగారు పతకంతో మెరిసింది. ఈ ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనూ సాత్విక్‌- చిరాగ్‌ జంట స్వర్ణంతో అదరగొట్టింది.

పురస్కారాలు ఎవరెవరికి..?

మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న: రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి; అర్జున అవార్డు: ఒజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలె, అదితి గోపీచంద్‌ స్వామి (ఆర్చరీ), మురళీ శ్రీశంకర్‌, పారుల్‌ చౌదరి (అథ్లెటిక్స్‌), మహ్మద్‌ హుసాముద్దీన్‌ (బాక్సింగ్‌), వైశాలి (చెస్‌), మహ్మద్‌ షమి (క్రికెట్‌), అనూష్‌ అగర్వాల్‌ (ఈక్వెస్ట్రియన్‌), దివ్యకృతి సింగ్‌ (ఈక్వెస్ట్రియన్‌ డ్రెసేజ్‌), దీక్ష దాగర్‌ (గోల్ఫ్‌), క్రిషన్‌ బహదూర్‌ పాథక్‌, సుశీల చాను (హాకీ), పవన్‌ కుమార్‌, రితు నేగి (కబడ్డీ), నస్రీన్‌ (ఖోఖో), పింకి (లాన్‌ బౌల్స్‌), ఐశ్వరి ప్రతాప్‌సింగ్‌ తోమర్‌, ఈషా సింగ్‌ (షూటింగ్‌), హరిందర్‌ పాల్‌ సింగ్‌ సంధూ (స్క్వాష్‌), ఐహిక ముఖర్జీ (టేబుల్‌ టెన్నిస్‌), సునీల్‌ కుమార్‌, అంతిమ్‌ (రెజ్లింగ్‌), నౌరెం రోషిబినా దేవి (వుషు), శీతల్‌ దేవి (పారా ఆర్చరీ), ఇల్లూరి అజయ్‌కుమార్‌ రెడ్డి (అంధుల క్రికెట్‌), ప్రాచి యాదవ్‌ (పారా కనోయింగ్‌)

ద్రోణాచార్య అవార్డు: లలిత్‌ కుమార్‌ (రెజ్లింగ్‌), ఆర్‌.బి.రమేశ్‌ (చెస్‌) మహావీర్‌ ప్రసాద్‌ సైని (పారా అథ్లెటిక్స్‌), శివేంద్ర సింగ్‌ (హాకీ), గణేశ్‌ ప్రభాకర్‌ (మల్లఖంబ్‌)

ద్రోణాచార్య అవార్డు (జీవితకాల పురస్కారం): జస్‌కీరత్‌ సింగ్‌ గ్రేవాల్‌ (గోల్ఫ్‌), భాస్కరన్‌ (కబడ్డీ), జయంత కుమార్‌ పుషిలాల్‌ (టేబుల్‌ టెన్నిస్‌)

ధ్యాన్‌చంద్‌ అవార్డు (జీవితకాల సాఫల్య పురస్కారం): మంజుష కన్వర్‌ (బ్యాడ్మింటన్‌), వినీత్‌ కుమార్‌శర్మ (హాకీ), కవిత సెల్వరాజ్‌ (కబడ్డీ)

మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ట్రోఫీ: గురు నానక్‌ దేవ్‌ యూనివర్సిటీ (ఓవరాల్‌ విజేత- అమృత్‌సర్‌), లవ్లీ ప్రొఫెషనల్‌ యూనవర్సిటీ (రన్నరప్‌- పంజాబ్‌), కురుక్షేత్ర యూనివర్సిటీ (సెకండ్‌ రన్నరప్‌- కురక్షేత్ర)


కప్పు తెచ్చిన అవార్డు

కాస్త ఆలస్యంగానైనా టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమిని అర్జున అవార్డు వరించింది. భారత బౌలింగ్‌ దళంలో ప్రధాన అస్త్రాల్లో ఒకడైన షమి ఈ పురస్కారానికి సంపూర్ణ అర్హుడనడంలో సందేహం లేదు. పదునైన పేస్‌తో గత కొన్నేళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న 33 ఏళ్ల షమి.. కాలం గడుస్తున్న కొద్దీ మరింతగా పదునెక్కుతున్నాడు. ఇప్పుడు తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అతడి బౌలింగ్‌ అద్భుతం. అసాధారణ ప్రదర్శనతో బ్యాటర్లను బెంబేలెత్తించిన అతడు.. ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో భారత్‌ ఫైనల్‌ చేరడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అతడిదే అగ్రస్థానం. ఒక ప్రపంచకప్‌లో ఒక్కసారే అయిదు వికెట్లు సాధించడం గొప్ప అనుకుంటే.. షమి ఏకంగా అయిదుసార్లు ఈ ఘనత సాధించాడు. టోర్నీలో అతడి స్ట్రైక్‌రేట్‌ 10.70. విచిత్రంగా మొదటి నాలుగు మ్యాచ్‌లకు అతడు పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయంతో దూరమైన నేపథ్యంలో తుది జట్టులో స్థానం సంపాదించిన అతడు.. వస్తూనే సత్తా చాటాడు. కివీస్‌తో కీలక మ్యాచ్‌లో అయిదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అతడికి తిరుగులేకుండా పోయింది. టోర్నీ ముగిసే వరకు వికెట్ల వేటలో దూసుకుపోయాడు. ప్రపంచకప్‌ ఆరంభంలో పెవిలియన్‌కే పరిమితం కావడం అసహనం కలిగించినా.. అవకాశం లభించిన వెంటనే అత్యుత్తమ ప్రదర్శన చేయడం షమి మానసిక దృఢత్వాన్ని చెబుతోంది. ఈ అవార్డు అతడికి మరింత ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు. షమి ఇప్పటివరకు 64 టెస్టుల్లో 229 వికెట్లు పడగొట్టాడు. 101 వన్డేల్లో 195 వికెట్లు, 23 టీ20ల్లో 24 వికెట్లు చేజిక్కించుకున్నాడు.


బాక్సింగ్‌ కుటుంబం నుంచి..

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన హుసాముద్దీన్‌ది బాక్సింగ్‌ నేపథ్యం. తండ్రి షంషుద్దీన్‌.. సోదరులు ఎతెషాముద్దీన్‌, ఐతెషాముద్దీన్‌ బాక్సర్లే. 2018లో ఇండియా ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ టోర్నీలో కాంస్య పతకంతో హుసాముద్దీన్‌ కెరీర్‌ ప్రారంభమైంది. అదే ఏడాది గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నిరుడు బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లోనూ హుసాముద్దీన్‌ కాంస్య పతకంతో మెరిశాడు. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు. ఈ ఏడాది తాష్కెంట్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 29 ఏళ్ల హుసాముద్దీన్‌ కాంస్యంతో సత్తాచాటాడు.


పతకాలే గురి

ప్రపంచ షూటింగ్‌లో 18 ఏళ్ల ఈషా సింగ్‌ అదరగొడుతోంది. చిన్న వయసులోనే పతకాల పంట పండిస్తోంది. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణ పతకాలతో సత్తాచాటింది. 2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో ఒక స్వర్ణం, మూడు రజత పతకాలతో మెరిసింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్న ఆమె.. పిస్టల్‌ విభాగంలో అగ్రశ్రేణి క్రీడాకారిణి.


అజయ్‌ అదుర్స్‌..

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: చూపులేని అజయ్‌కుమార్‌ రెడ్డి తన కలను సాకారం చేసుకున్న తీరు స్ఫూర్తిదాయకం. నిరంతర కృషితో అంధుల క్రికెట్లో భారత కెప్టెన్‌గా ఎదిగిన అతడు.. అర్జున పురస్కారం పొందిన మొదటి అంధ క్రికెటర్‌గా ఘనతను సొంతం చేసుకున్నాడు. అజయ్‌ది ఉమ్మడి గుంటూరు, ప్రస్తుత పల్నాడు జిల్లా. అమ్మానాన్నలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరమణ. మొదట్లో వ్యవసాయం చేసేవారు. ప్రమాదంలో అజయ్‌ కంటిచూపు పోవడంతో అతణ్ని చదివించడానికి నరసరావుపేటకు మకాం మార్చారు. అక్కడ తోపుడు బండిపై ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాలు అమ్ముతూ కొడుకును చదివించారు. క్రికెట్‌పై ఆసక్తితో ఏడో తరగతిలో అతడు ఆ దిశగా అడుగులేశాడు. 2006లో మొదటిసారి రాష్ట్రం తరఫున ఆడాడు. తొలిసారి 2010లో జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. 2016 నుంచి అంధుల క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉంటున్నాడు. అంధుల విభాగంలో భారత్‌ రెండు వన్డే ప్రపంచకప్‌లు, మూడు టీ20 ప్రపంచ కప్‌లు, ఆసియా కప్‌ గెలుచుకోవడంలో అజయ్‌ కీలక పాత్ర పోషించాడు. అతడి సారథ్యంలోని జట్టు వన్డే ప్రపంచ కప్‌ (2018), రెండు టీ20 ప్రపంచకప్‌ (2017, 2022)లు గెలిచింది. ఐబీఎస్‌ఏ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం కూడా సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని