Sunil Gavaskar: రెండు రకాల మాటలేల?: సునీల్‌ గావస్కర్‌

భారత్‌లోని పిచ్‌లపై ఒకలా, విదేశాల్లోని పిచ్‌ల గురించి మరొకలా మాట్లాడటం ఎందుకని దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ప్రశ్నించాడు. పిచ్‌పై చేసే విమర్శల్లో తేడాలు ఎందుకు ఉన్నాయంటూ మండిపడ్డాడు. ముఖ్యంగా సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లోని పిచ్‌లను లక్ష్యంగా చేసుకుని గావస్కర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated : 09 Jan 2024 08:04 IST

దిల్లీ: భారత్‌లోని పిచ్‌లపై ఒకలా, విదేశాల్లోని పిచ్‌ల గురించి మరొకలా మాట్లాడటం ఎందుకని దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ప్రశ్నించాడు. పిచ్‌పై చేసే విమర్శల్లో తేడాలు ఎందుకు ఉన్నాయంటూ మండిపడ్డాడు. ముఖ్యంగా సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లోని పిచ్‌లను లక్ష్యంగా చేసుకుని గావస్కర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కేవలం అయిదు సెషన్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. టెస్టు చరిత్రలో అతి తక్కువ సమయంలో ముగిసిన మ్యాచ్‌ ఇదే. దీంతో ఆ పిచ్‌ పరిస్థితులపై రోహిత్‌ శర్మ, దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ కోచ్‌ ప్రిన్స్‌ తదితరులు విమర్శలు చేశారు. కేప్‌టౌన్‌ పిచ్‌ క్యురేటర్‌ పొరపాటు చేశాడని అంటున్న వాళ్లు.. భారత్‌లో పిచ్‌లపై ఎందుకు నోరు పారేసుకుంటారంటూ గావస్కర్‌ ఓ వ్యాసంలో ప్రశ్నించాడు. ‘‘సేన దేశాల్లోని పరిస్థితుల్లో పొరపాటు అయిందంటూ సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదు. అదే మా క్యురేటర్లు ఇక్కడ పొడి పిచ్‌ తయారు చేస్తేనేమో గెలుపు కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారంటారు. గత ఏడాది భారత్‌లో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా కుప్పకూలగానే ఆ జట్టు ఓ మాజీ కెప్టెన్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. అంటే మా గ్రౌండ్‌ సిబ్బంది కావాలని చేస్తారు.. కానీ వాళ్ల గ్రౌండ్‌ సిబ్బంది మాత్రం పొరపాటుగా చేస్తారా? మరో మూడు వారాల్లోపు ఓ దేశం (ఇంగ్లాండ్‌)తో భారత్‌లో టెస్టు సిరీస్‌ ఆరంభమవుతుంది. ఆ దేశానికి విసుక్కునే, అరిచే మీడియా ఎక్కువగా ఉంది. వాళ్ల జట్టుకు ఏది నప్పకపోయినా విమర్శలు మొదలవుతాయి. ఆరోపణలు వేగంగా వ్యాప్తి చెందుతాయి’’ అని గావస్కర్‌ అన్నాడు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య హైదరాబాద్‌లో ఈ నెల 25న తొలి మ్యాచ్‌ ఆరంభమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని