Mohammad Kaif: వాళ్లిద్దరి జోక్యం వల్లే భారత్‌ ఓటమి

పిచ్‌ విషయంలో కెప్టెన్‌ రోహిత్‌శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ జోక్యమే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓటమికి కారణమని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు.

Published : 18 Mar 2024 05:08 IST

దిల్లీ: పిచ్‌ విషయంలో కెప్టెన్‌ రోహిత్‌శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ జోక్యమే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓటమికి కారణమని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు. ‘‘అహ్మదాబాద్‌లో ఫైనల్‌కు ముందు సాయంత్ర సమయంలో వరుసగా మూడు రోజులు రోహిత్‌, ద్రవిడ్‌ పిచ్‌ను పరీక్షించారు. ఆస్ట్రేలియా జట్టులో కమిన్స్‌, స్టార్క్‌ లాంటి పేసర్లు ఉన్నారు కాబట్టి స్లో పిచ్‌ను ఇవ్వాలని సూచించారు. ఇదే ఓటమికి పెద్ద కారణం. క్యురేటర్లు పిచ్‌ను తయారు చేస్తారు.. మిగిలినవాళ్లకు ఏం సంబంధం లేదని అనుకుంటారు. కానీ అది నిజం కాదు’’ అని ఫైనల్‌ జరిగిన మూడురోజులు అహ్మదాబాద్‌లోనే ఉన్న కైఫ్‌ అన్నాడు. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 240కే పరిమితమైంది. ఛేదనలో పిచ్‌ స్వభావం మారడంతో ట్రావిస్‌ హెడ్‌ (137) మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఆసీస్‌ 6 వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.


ట్రయల్స్‌లో ధీరజ్‌, జ్యోతిలకు అగ్రస్థానం

సోనెపట్‌: తెలుగుతేజం ధీరజ్‌ బొమ్మదేవర ఆర్చరీ సెలక్షన్‌ ట్రయల్స్‌ ఫేజ్‌-2లో సత్తా చాటాడు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లో పురుషుల రికర్వ్‌ విభాగంలో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటికే పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దక్కించున్న ధీరజ్‌.. క్వాలిఫికేషన్లో 1370.. ర్యాంకింగ్‌ రౌండ్లలో 1378 పాయింట్లతో ముందంజలో నిలిచాడు. పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే పురుషుల రికర్వ్‌ జట్టులో ధీరజ్‌తో పాటు వెటరన్‌ తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌, మృనాల్‌ చౌహాన్‌ ఎంపికయ్యారు. మహిళల్లో స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి చాన్నాళ్లకు జట్టులో చోటు సంపాదించింది. 2022 డిసెంబర్‌లో తల్లి అయిన తర్వాత గతేడాది ఆర్చరీకి పూర్తిగా దూరమైన దీపిక.. సెలక్షన్‌ ట్రయల్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఆమెతో పాటు భజన్‌ కౌర్‌, అంకిత బాకత్‌, కోమలిక బారి జట్టుకు ఎంపికయ్యారు. కాంపౌండ్‌ కేటగిరిలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ క్వాలిఫికేషన్లో 1410... ర్యాంకింగ్‌ రౌండ్లలో 1407 స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని