IND vs NZ: జైపూర్‌లో పరుగుల వరదే..

క్లిష్టమైన యూఏఈ పిచ్‌లపై టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో బౌండరీల మోత మోగలేదు. అభిమానులు మరీ నిరాశ చెందాల్సిన అవసరమేమీ లేదు. భారత్‌, న్యూజిలాండ్‌

Updated : 16 Nov 2021 13:01 IST

జైపూర్‌: క్లిష్టమైన యూఏఈ పిచ్‌లపై టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో బౌండరీల మోత మోగలేదు. అభిమానులు మరీ నిరాశ చెందాల్సిన అవసరమేమీ లేదు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో పరుగుల వరద పారనుంది. జైపూర్‌లో బుధవారం తొలి టీ20 కోసం సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో పిచ్‌ సిద్ధమవుతోంది. భారీ స్కోర్లు ఖాయమని అంటున్నారు.  గత ఎనిమిదేళ్లలో ఇక్కడ టీమ్‌ఇండియా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇక్కడ టీ20 మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి. ఈ మైదానంలో బౌండరీలు పెద్దగా ఉన్నాయి. అయితే పిచ్‌ మందకొడిగా లేదని క్యురేటర్‌ తపష్‌ ఛటర్జీ చెప్పాడు. ‘‘ఇక్కడ మ్యాచ్‌ ఎప్పుడు జరగనుందో మాకు తెలుసు. పిచ్‌ స్లోగా మారకుండా ఉండడం కోసం దాన్ని మరీ ఎక్కువగా వాడకుండా, మరీ తక్కువగా వాడకుండా జాగ్రత్తపడ్డాం. పిచ్‌లో జీవం ఉండాలన్నదే మా ఉద్దేశం. ఇటీవల కొన్ని టోర్నీల సందర్భంగా పిచ్‌ను పరీక్షించాం’’ అని తెలిపాడు.

కాలుష్యంతో కష్టమే..: ఉత్తరభారతంలో వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్‌తో సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ వచ్చేసింది. కివీస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో  ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ టోర్నీలో ఆడిన జట్టుతోనే కివీస్‌.. భారత్‌లో  ఆడనుంది. కనీసం సెమీఫైనల్‌ చేరలేకపోయిన టీమ్‌ఇండియాలో మాత్రం మార్పులు జరిగాయి. రోహిత్‌ శర్మ కెప్టెన్‌, రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా ఈ సిరీస్‌తోనే కొత్త శకం ఆరంభం కానుంది. అయితే గత వారం రోజులుగా కాలుష్య తీవ్రత పెరుగుతుండడంతో మొదటి టీ20పై ఆందోళన వ్యక్తమవుతోంది. దిల్లీలో భారత్‌, శ్రీలంక మధ్య 2017లో జరిగిన టెస్టు మ్యాచ్‌కు వాయు కాలుష్యం కారణంగా ఆటంకం ఏర్పడింది. మాస్కులు వేసుకుని బరిలోకి దిగిన లంక ఆటగాళ్లు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. కాలుష్యం కారణంగా జైపూర్‌ ప్రజలు ఇప్పటికే ఊపిరిపీల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కాలుష్యం భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య టీ20 మ్యాచ్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని