Updated : 30/11/2021 07:01 IST

IPL Mega Auction: ఉండేదెవరో.. వీడేదెవరో

ఫ్రాంచైజీల తర్జనభర్జన
అట్టిపెట్టుకునే ఆటగాళ్ల ఎంపికకు తుది గడువు నేడు

దిల్లీ: ఐపీఎల్‌ 2022 సీజన్‌ మెగా వేలానికి ముందు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల విషయంలో అన్ని ఫ్రాంచైజీలు తర్జనభర్జన పడుతున్నాయి. ఎవరిని కొనసాగించాలో.. ఎవరిని వదిలేయాలన్న సమీకరణాల్ని లోతుగా విశ్లేషించుకుంటున్నాయి. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితా సమర్పణకు మంగళవారమే తుది గడువు కావడంతో క్రికెటర్ల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జాబితాను సమర్పించగానే.. కొత్త జట్లు లఖ్‌నవూ, అహ్మదాబాద్‌లు డిసెంబరు 1 నుంచి 25లోపు గరిష్టంగా ముగ్గురేసి క్రికెటర్లను ఎంపిక చేసుకోవచ్చు. జనవరిలో వేలం  నిర్వహిస్తారు. మంగళవారం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జాబితా సమర్పించనున్న నేపథ్యంలో  ఏ జట్టు ఎవరిని ఎంపిక చేసుకోనుంది? ఎవరిని వదులుకోనుందన్న సమీకరణాల్ని పరిశీలిస్తే..
 


దిల్లీ క్యాపిటల్స్‌

కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌, పృథ్వీ షా, అక్షర్‌ పటేల్‌, ఎన్రిచ్‌ నార్జ్‌ (దక్షిణాఫ్రికా)లను అట్టిపెట్టుకోవాలని దాదాపుగా నిర్ణయించింది. నిలకడగా రాణిస్తున్న ఆర్‌.అశ్విన్‌, కాగిసో  రబాడలను వేలంలో దక్కించుకోవాలని భావిస్తోంది. భుజం గాయం కారణంగా జట్టుకు దూరమై.. అనంతరం తిరిగొచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవడంతో దిల్లీని వీడాలని అతడు నిర్ణయించుకున్నాడు.


ముంబయి ఇండియన్స్‌
ఐపీఎల్‌లో అయిదు సార్లు విజేతగా నిలిచిన ముంబయి.. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, పేసర్‌ బుమ్రాల చుట్టూ జట్టును నిర్మించాలని భావిస్తోంది. మిగతా రెండు స్థానాలకు సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌లు దాదాపుగా ఖాయమైనట్లే. అయితే సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌లలో ఎవరిని అట్టిపెట్టుకోవాలనే విషయంలో ముంబయి తర్జనభర్జన పడుతుంది. ఈ ఇద్దరిలో వదిలేసుకునే ఆటగాడితో పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను వేలంలో తిరిగి సొంతం చేసుకోవాలని అనుకుంటోంది.

 


చెన్నై సూపర్‌ కింగ్స్‌
నాలుగు సార్లు ఛాంపియన్‌ చెన్నై.. ముగ్గురు ఆటగాళ్లను దాదాపుగా ఎంపిక చేసుకుంది. కెప్టెన్‌ ధోని, రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. నాలుగో ఆటగాడిగా ఆల్‌రౌండర్‌ మొయీన్‌ అలీ, ఓపెన్‌ డుప్లెసిస్‌లలో ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న  విషయంలో సందిగ్ధంలో ఉంది.


పంజాబ్‌ కింగ్స్‌

కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫ్రాంచైజీని వీడుతుండటంతో మళ్లీ కొత్తగా  ప్రారంభించాలన్నది పంజాబ్‌ ఆలోచన. అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లు అర్ష్‌దీప్‌సింగ్‌, రవి బిష్ణోయ్‌లను అట్టిపెట్టుకోవాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. యువ ఆటగాళ్లుగా ఉన్నప్పుడే వీరిద్దరిని గుర్తించిన ఫ్రాంచైజీ.. వారిని సానబెట్టి నాణ్యమైన క్రికెటర్లుగా తీర్చిదిద్దింది. మిగతా రెండు స్థానాలకు మయాంక్‌ అగర్వాల్‌, మహ్మద్‌ షమి, నికోలస్‌ పూరన్‌లలో   ఎవరిని ఎంపిక చేసుకుంటుందో చూడాలి.
 


కోల్‌కతా నైట్‌రైడర్స్‌

వరుణ్‌ చక్రవరి, ఆండ్రీ రసెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, సునీల్‌ నరైన్‌లను కోల్‌కతా అట్టిపెట్టుకోవడం దాదాపుగా ఖాయమైంది. అదే జరిగితే ప్రపంచ కప్‌ విజేత జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ల కోసం వేలం పాటలో కోల్‌కతా పోటీపడాల్సి ఉంటుంది. గత సీజన్‌లో భారత్‌లో వెనుకబడిన కోల్‌కతాను తన నాయకత్వ లక్షణాలతో యూఏఈ దశలో ఫైనల్‌కు చేర్చిన ఘనత మోర్గాన్‌దే. భవిష్యత్‌ సారథిగా పేరుతెచ్చుకున్న గిల్‌ను వదులుకోవడం కూడా సాహసోపేత నిర్ణయమే.


రాజస్థాన్‌ రాయల్స్‌
కెప్టెన్‌ సంజు శాంసన్‌, ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ను అట్టిపెట్టుకోవాలని రాజస్థాన్‌  భావిస్తోంది. గాయం, మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా గత సీజన్‌లో అత్యధిక మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బెన్‌ స్టోక్స్‌.. ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో బాధపడుతున్న జోఫ్రా ఆర్చర్‌ విషయంలో రాజస్థాన్‌ మల్లగుల్లాలు పడుతోంది. అన్‌క్యాప్డ్‌ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌ సైతం రేసులో ఉన్నాడు.


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు
సారథ్యాన్ని వదులుకున్న విరాట్‌   కోహ్లి, లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌, విధ్వంసక ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లను బెంగళూరు అట్టిపెట్టుకోవడం దాదాపుగా ఖాయమైంది. నాలుగో స్థానం కోసం  దేవదత్‌ పడికల్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌ల మధ్య పోటీ నెలకొంది. ముగ్గురిలో ఒక్కరినే ఎంపిక చేసుకున్నా.. మిగతా ఇద్దరిని వేలంపాటలో సొంతం చేసుకోవాలని భావిస్తోంది.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

డేవిడ్‌ వార్నర్‌ను సారథ్యం నుంచి తప్పించి వార్తల్లో నిలిచిన హైదరాబాద్‌.. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, రషీద్‌ఖాన్‌లను అట్టిపెట్టుకోవడం దాదాపుగా ఖాయం.. భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌లతో పేస్‌ కూర్పును సిద్ధం చేసుకోవడమా? లేదా కొత్తవాళ్లతో బౌలింగ్‌ విభాగాన్ని నిర్మించుకోవడమా? అన్నది హైదరాబాద్‌ నిర్ణయించుకోవాలి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్