Kohli-Rohit: కోహ్లి సారథ్యాన్ని ప్రతి క్షణం ఆస్వాదించా: రోహిత్‌

ఒక నెల రోజుల వ్యవధిలో ఎంత తేడా.. భారత కెప్టెన్‌ కోహ్లి ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో ఓ ఆటగాడిగా మారిపోయాడు. టీమ్‌ఇండియా ఓపెనర్‌గా సత్తాచాటుతున్న రోహిత్‌ శర్మ.. తెల్లబంతి క్రికెట్లో జట్టు పగ్గాలు అందుకున్నాడు. కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ ఒకే సారథిని చూసిన అభిమానులు.. ఇకపై ఇద్దరు నాయకులు జట్టును నడిపిస్తుంటే వీక్షించనున్నారు. కోహ్లి వదిలేయడంతో మొదట పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ అందుకున్న రోహిత్‌.. ఇప్పుడు అతని స్థానంలో వన్డే సారథి కూడా అయ్యాడు.

Updated : 14 Dec 2021 06:38 IST

ఒక నెల రోజుల వ్యవధిలో ఎంత తేడా.. భారత కెప్టెన్‌ కోహ్లి ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో ఓ ఆటగాడిగా మారిపోయాడు. టీమ్‌ఇండియా ఓపెనర్‌గా సత్తాచాటుతున్న రోహిత్‌ శర్మ.. తెల్లబంతి క్రికెట్లో జట్టు పగ్గాలు అందుకున్నాడు. కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ ఒకే సారథిని చూసిన అభిమానులు.. ఇకపై ఇద్దరు నాయకులు జట్టును నడిపిస్తుంటే వీక్షించనున్నారు. కోహ్లి వదిలేయడంతో మొదట పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ అందుకున్న రోహిత్‌.. ఇప్పుడు అతని స్థానంలో వన్డే సారథి కూడా అయ్యాడు. ఇక టెస్టుల్లోనే విరాట్‌ కెప్టెన్సీ బాధ్యతలు కొనసాగిస్తాడు. దీంతో కోహ్లి, రోహిత్‌ మధ్య గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అవి ఇంకా ఎక్కువ అవుతాయా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని.. కోహ్లి సారథ్యాన్ని తాను పూర్తిగా ఆస్వాదించానని రోహిత్‌ అంటున్నాడు. బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మరెన్నో విషయాలు చెప్పాడు. ఆ విశేషాలు హిట్‌మ్యాన్‌ మాటల్లోనే..!

ముంబయి

పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లి అయిదేళ్ల పాటు జట్టుకు సారథిగా  బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రతి సారి జట్టును ముందుండి నడిపించాడు. ప్రతి మ్యాచ్‌ గెలవాలనే స్పష్టమైన అంకితభావం, సంకల్పంతో మైదానంలో అడుగుపెట్టాం. అతను జట్టుకు ఇచ్చిన సందేశం అదే. అతని సారథ్యంలో ఆడడం గొప్పగా అనిపించింది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. భవిష్యత్‌లోనూ అదే కొనసాగిస్తా. ఇక కెప్టెన్‌గా నా ప్రథమ కర్తవ్యం.. ఓ ఆటగాడు జట్టుకు ఎందుకు ఎంపికయ్యాడు? అతని నుంచి ఏం   ఆశిస్తున్నాం? అనేదానిపై అతనికి అవగాహన కలిగేలా చూసుకోవడమే. గతంలో కొన్ని మ్యాచ్‌ల్లో జట్టును నడిపించే అవకాశం నాకు దక్కింది. ఛాన్స్‌ వచ్చిన ప్రతిసారి పరిస్థితులను సాధారణంగా ఉంచేందుకే ప్రయత్నించా. ఆటగాళ్లతో మాట్లాడేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చా. జట్టులో ఎవరి పాత్ర ఏమిటో అర్థం చేసుకునేలా చూశా. మన బాధ్యతలను గుర్తించి వాటిని సమర్థంగా నిర్వహించడమే అన్నిటికంటే ముఖ్యం.


ఆ సమస్య..

కోచ్‌, కెప్టెన్‌కు జట్టులోని ఆటగాళ్లతో స్పష్టమైన సంభాషణ ఉండడం ముఖ్యం. సహచర క్రికెటర్లతో కలిసిమెలిసి ఉండి.. వాళ్లతో మాట్లాడడాన్ని   కొనసాగిస్తా. సవాళ్లు ఎదురైనపుడు వాటిని అధిగమించి ఎలా ముందుకు సాగామన్నది ప్రధానం. గతంలోనూ జట్టులో మిడిలార్డర్‌ సమస్య ఉంది. కొన్ని సార్లు 10/3 లేదా 15/2తో జట్టు కష్టాల్లో పడ్డప్పుడు తిరిగి పుంజుకోవడంలో విఫలమయ్యాం. ఇప్పుడా సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. నా బుర్రలో అదే తిరుగుతోంది. ఆ దిశగా కోచ్‌ ద్రవిడ్‌తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం ద్రవిడ్‌తో పనిచేయడం ఎంతో అద్భుతంగా అనిపించింది. మూడు మ్యాచ్‌లే అయినప్పటికీ ఎంతో గొప్ప భావన కలిగింది. ఓ క్రికెటర్‌గా అతనెంత కష్టపడ్డాడో, ఎన్ని కఠిన పరిస్థితులు దాటాడో మాకు తెలుసు. ఎంతో అనుభవం ఉన్న అతను ఇప్పుడు జట్టు వాతావరణాన్ని ఉల్లాసంగా మారుస్తుండడంతో ఎంతో ఉపశమనంగా అనిపిస్తోంది.


ఆ ట్రోఫీ కల..

2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత టీమ్‌ఇండియా మరో ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవలేకపోయింది. అయితే ఫలితం గురించి మాట్లాడే ముందు సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఆ ఛాంపియన్స్‌ ట్రోఫీ విజయం తర్వాత మేమేం పేలవంగా ఆడలేదు. ఓ జట్టుగా ఉత్తమ ప్రదర్శన చేశాం. కానీ ట్రోఫీ అందుకోవడానికి అవసరమైన ఓ అదనపు అడుగు మాత్రం వేయలేకపోయాం. ఎంతో పోటీ ఉన్న అంతర్జాతీయ క్రికెట్లో అలా జరుగుతుంటుంది. కానీ ప్రొఫెషనల్‌ ఆటగాళ్లుగా మేం ఆ సవాలును స్వీకరించాలి. సమీప భవిష్యత్‌లో చాలా ప్రపంచకప్‌లు రాబోతున్నాయి. వాటిల్లో అత్యుత్తమంగా రాణించడమే జట్టు లక్ష్యం. విజేతగా నిలవడంపైనే మా దృష్టి. కానీ అందుకోసం జట్టుగా ఓ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఛాంపియన్‌షిప్‌ గెలవాలంటే అంతకంటే ముందు ఎన్నో విషయాలపై ధ్యాస పెట్టాలి. చివరగా కప్పు పట్టేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని