BWF World Championship: శ్రీకాంత్‌ ఆహా.. లక్ష్య ఓహో

ఆట ఏదైనా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ అంటే అత్యున్నత టోర్నీ. బ్యాడ్మింటన్‌లో ఈ ఈవెంట్‌ మరింత ప్రత్యేకం. ఒకప్పుడు మనవాళ్లు అప్పటిదాకా సాధించిన ఒకటీ అరా పతకాల గురించే గొప్పగా చెప్పుకుంటూ వచ్చే వాళ్లం. కానీ గత కొన్నేళ్ల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ప్రతిసారీ ఒకటి అంతకంటే ఎక్కువ పతకాలు సాధిస్తున్న భారత్‌..

Updated : 18 Dec 2021 07:03 IST

భారత్‌కు రెండు పతకాలు ఖాయం

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లోకి ప్రవేశం
క్వార్టర్‌ఫైనల్లో సింధు పరాజయం

వెల్వా (స్పెయిన్‌)

ఆట ఏదైనా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ అంటే అత్యున్నత టోర్నీ. బ్యాడ్మింటన్‌లో ఈ ఈవెంట్‌ మరింత ప్రత్యేకం. ఒకప్పుడు మనవాళ్లు అప్పటిదాకా సాధించిన ఒకటీ అరా పతకాల గురించే గొప్పగా చెప్పుకుంటూ వచ్చే వాళ్లం. కానీ గత కొన్నేళ్ల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ప్రతిసారీ ఒకటి అంతకంటే ఎక్కువ పతకాలు సాధిస్తున్న భారత్‌.. ఈసారి కూడా రెండు పతకాలతో ఛాంపియన్‌షిప్‌ను ముగించనుంది. ఈసారి ఆ రెండు పతకాలు పురుషుల సింగిల్స్‌లో రాబోతుండటం విశేషం. తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌తో పాటు లక్ష్యసేన్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సెమీస్‌ చేరడం ద్వారా పతకాలు ఖాయం చేసుకున్నారు. సెమీస్‌లో వీరి మధ్యే పోరు జరగబోతుండటంతో ఒకరు ఫైనల్లోనూ అడుగు పెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సింధు ఈసారి పతకమే లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
 


‘‘మ్యాచ్‌లో ఏకాగ్రత కోల్పోకూడదని అనుకున్నా. ప్రత్యర్థికి ఆధిక్యం ఇవ్వదల్చుకోలేదు. అనవసర తప్పిదాలు చేయదల్చుకోలేదు. సెమీస్‌ చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’

- కిదాంబి శ్రీకాంత్‌


ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌, వర్ధమాన ఆటగాడు లక్ష్యసేన్‌ చరిత్ర సృష్టించారు. పురుషుల విభాగంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు ఖాయం చేసి భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారు. 2011 నుంచి ప్రతి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధిస్తున్న భారత క్రీడాకారులు ఈసారి కూడా నిరాశ పరచలేదు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో శ్రీకాంత్‌ 21-8, 21-7తో మార్క్‌ కాల్‌జౌ (నెదర్లాండ్స్‌)ను చిత్తుచేశాడు. లక్ష్య 21-15, 15-21, 22-20తో జున్‌ పెంగ్‌ (చైనా)పై సంచలన విజయం సాధించాడు. మరో భారత ఆటగాడు హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ కూడా సెమీస్‌ రేసులో నిలిచాడు కానీ.. అతడికి సింగపూర్‌ క్రీడాకారుడు లో కియాన్‌ యో అడ్డు పడ్డాడు. క్వార్టర్స్‌లో ప్రణయ్‌ 14-21, 12-21తో కియాన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మరోవైపు ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధుకు నిరాశే ఎదురైంది. టైటిల్‌ నిలబెట్టుకోలేకపోయిన సింధుకు పతకం కూడా దక్కలేదు. ఆరో పతకంపై కన్నేసిన ఆమె క్వార్టర్స్‌లో 17-21, 13-21తో టాప్‌ సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం చవిచూసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం అయిదు.. గత పర్యాయాల్లో మూడు పతకాలు సాధించిన సింధు ఆశలపై శుక్రవారం తై జు నీళ్లు చల్లింది.

నిరాశతో మొదలై..: శుక్రవారం డ్రాలో మొదటి మ్యాచ్‌లోనే సింధు ఓటమి చవిచూడటం భారత శిబిరంలో నిరాశ నింపింది. అయితే శ్రీకాంత్‌ రెట్టించిన పట్టుదల ప్రదర్శించగా.. సింధు కోచ్‌ పార్క్‌ నిజమైన క్రీడాస్ఫూర్తి కనబరిచాడు. సింధుకు వ్యక్తిగత శిక్షకుడిగా వ్యవహరిస్తున్న పార్క్‌.. ఆమె ఓడిన బాధలో నుంచి వెంటనే తేరుకుని శ్రీకాంత్‌కు సహాయం అందించేందుకు కోచ్‌ కుర్చీలో కూర్చున్నాడు. మ్యాచ్‌ ఆసాంతం శ్రీకాంత్‌కు చిట్కాలు చెబుతూ.. అతడిని ఉత్సాహపరుస్తూ కనిపించాడు. ఇక 2017లో మూడు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెల్చుకుని.. 2018లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన శ్రీకాంత్‌ శుక్రవారం తనేంటో నిరూపించుకున్నాడు. గత కొన్నేళ్లుగా భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రీకాంత్‌ తన కరవు తీర్చుకున్నాడు. మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే శ్రీకాంత్‌కు ఎదురులేదని తెలిసిపోయింది. శ్రీకాంత్‌ దూకుడు, స్ట్రోక్‌ల స్థాయికి కాల్‌జౌ దరిదాపుల్లోకి రాలేదు. షటిల్‌పై పూర్తి నియంత్రణతో శ్రీకాంత్‌ సంధించిన స్మాష్‌లు, హాఫ్‌ స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌ షాట్‌లకు ప్రత్యర్థి దగ్గర సమాధానం లేకపోయింది. తొలి గేమ్‌ను 11-5తో దూకుడుగా ఆరంభించిన శ్రీకాంత్‌ వెనుదిరిగి చూడలేదు. విరామానంతరం 14-8తో ముందంజ వేసిన శ్రీకాంత్‌.. వరుసగా 7 పాయింట్లతో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌దే సంపూర్ణ ఆధిపత్యం. 4-3తో మొదలైన రెండో గేమ్‌ను వరుసగా 7 పాయింట్లతో శ్రీకాంత్‌ ఏకపక్షం చేశాడు. 17-7తో ఆధిక్యం సంపాదించిన శ్రీకాంత్‌.. వరుసగా 4 పాయింట్లతో ప్రత్యర్థిని మట్టికరిపించి పతకం ఖాయం చేసుకున్నాడు. కేవలం 26 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. ఇక 67 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరాటంలో లక్ష్యసేన్‌ గొప్ప సంయమనం కనబరిచాడు. తొలి గేమ్‌ను లక్ష్య నెగ్గగా.. రెండో గేమ్‌ పెంగ్‌ సొంతమైంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ప్రథమార్ధంలో అత్యధిక సమయం ప్రత్యర్థిదే ఆధిక్యం. విరామ సమయానికి లక్ష్య 8-11తో వెనుకంజలో ఉన్నాడు. అనంతరం గేరు మార్చిన లక్ష్య వరుసగా 3 పాయింట్లతో ప్రత్యర్థిని చేరవయ్యాడు. పెంగ్‌ 2 పాయింట్లు నెగ్గగా.. లక్ష్య 3 పాయింట్లు సాధించి 14-13తో గేమ్‌లో తొలిసారిగా ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అక్కడ్నుంచి 19 పాయింట్ల వరకు మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. పెంగ్‌ 20-19తో మ్యాచ్‌కు చేరవయ్యాడు. అయితే చెలరేగిన లక్ష్య వరుసగా 3 పాయింట్లతో ప్రత్యర్థి ఆటకట్టించాడు. చిరస్మరణీయ ప్రదర్శనతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకున్నాడు.


చరిత్ర సృష్టించేదెవరో?
సెమీస్‌ నేడే
రాత్రి 8.30 తర్వాత

ఒక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇద్దరు పురుష షట్లర్లు పతకాలు ఖాయం చేయడంతోనే భారత బ్యాడ్మింటన్‌లో కొత్త రికార్డు నమోదైంది. ఇక శనివారం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టే ఆటగాడెవరో చూడాలి. ఇప్పటిదాకా భారత పురుష షట్లర్లకు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సెమీస్‌ చేరడమే ఉత్తమ ప్రదర్శన. 1983లో ప్రకాశ్‌ పదుకొనె, 2019లో సాయిప్రణీత్‌ ఈ ఘనత సాధించారు. ఈసారి క్వార్టర్స్‌ దాటిన శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ సెమీస్‌లో ముఖాముఖి తలపడుతుండటంతో వారిలో ఒకరు ఫైనల్‌ చేరి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నట్లే. సెమీస్‌లో ఓడిన ఆటగాడు కాంస్యంతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. గెలిచిన ఆటగాడికి కనీసం రజతం, అన్నీ కలిసొస్తే స్వర్ణం కూడా సొంతం కావచ్చు. ఫామ్‌, అనుభవం ప్రకారం చూస్తే శ్రీకాంత్‌కే ఫైనల్‌ చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని