IPL 2022:అహ్మదాబాద్‌ కెప్టెన్‌గా హార్దిక్‌!

ఐపీఎల్‌ కొత్త జట్టు అహ్మదాబాద్‌కు టీమ్‌ఇండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య సారథ్యం వహించనున్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ యజమాని సీవీసీ క్యాపిటల్‌ తమ జట్టుకు హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించాలని నిర్ణయించినట్లు

Updated : 11 Jan 2022 07:05 IST

దిల్లీ: ఐపీఎల్‌ కొత్త జట్టు అహ్మదాబాద్‌కు టీమ్‌ఇండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య సారథ్యం వహించనున్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ యజమాని సీవీసీ క్యాపిటల్‌ తమ జట్టుకు హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రూ.5,625 కోట్లకు అహ్మదాబాద్‌ ప్రాంఛైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్‌కు బీసీసీఐ నుంచి అంగీకార పత్రం పొందడంలో కాస్త ఆలస్యమైంది. సీవీసీకి ఐరోపాలోని బెట్టింగ్‌ సంస్థలలో పెట్టుబడులు ఉన్న నేపథ్యంలో చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంది. భారత్‌లో బెట్టింగ్‌పై నిషేధం ఉండటం.. ఇక్కడ సీవీసీకి అలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో బీసీసీఐ పచ్చజెండా ఊపింది. దీంతో మెగా వేలం పాటకు ముందు ముగ్గురు ఆటగాళ్ల (ఇద్దరు స్వదేశీ, ఒకరు విదేశీ) ఎంపికపై ఫ్రాంచైజీ కసరత్తు చేస్తుంది. ‘‘అవును.. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ అంగీకార పత్రం అందుకుంది. అయితే ఇది సుదీర్ఘ ప్రక్రియ కావడంతో గత కొంతకాలంగా ఫ్రాంచైజీ తెరవెనుక పనులు నిర్వహిస్తోంది. మాకు తెలిసినంత వరకు జట్టు కెప్టెన్‌గా హార్దిక్‌ను ఎంపిక చేసుకుంది. హార్దిక్‌ స్థానికుడు కావడంతో పాటు ముంబయి ఇండియన్స్‌ తరఫున మ్యాచ్‌ విన్నర్‌గా రుజువు చేసుకున్నాడు. అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ను ద్వితీయ, ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ను తృతీయ ఆటగాడిగా ఎంపిక చేసుకోవడం దాదాపుగా ఖాయమైంది’’ అని ఐపీఎల్‌ సీనియర్‌ అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని