Yash Dhull: ఆ శతకం ఓ గర్వకారణం

అండర్‌-19 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన భారత మూడో కెప్టెన్‌గా నిలవడం తనకెంతో గర్వకారణమని యశ్‌ ధుల్‌ అన్నాడు. గతంలో కోహ్లి (2008), ఉన్ముక్త్‌ చంద్‌ (2012) ఆ ఘనత సాధించారు.

Updated : 04 Feb 2022 09:33 IST

కూలిడ్జ్‌: అండర్‌-19 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన భారత మూడో కెప్టెన్‌గా నిలవడం తనకెంతో గర్వకారణమని యశ్‌ ధుల్‌ అన్నాడు. గతంలో కోహ్లి (2008), ఉన్ముక్త్‌ చంద్‌ (2012) ఆ ఘనత సాధించారు. ప్రస్తుతం విండీస్‌లో జరుగుతున్న ఈ కుర్రాళ్ల ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన యువ భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘‘రషీద్‌, నేను చివరి వరకూ బ్యాటింగ్‌ చేయాలనుకున్నాం. ఆ ప్రణాళిక ఫలితాన్నిచ్చింది. నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ నిలబెట్టాలనుకున్నాం. మరీ ఎక్కువ షాట్లు ఆడకుండా 40వ ఓవర్‌ దాటేంత వరకూ క్రీజులో ఉండాలనుకున్నాం. రషీద్‌ గొప్పగా బ్యాటింగ్‌ చేశాడు. మా జోడీ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మేం ఇద్దరం కలిస్తే మెరుగ్గా రాణిస్తామని తెలుసు. ఇప్పుడదే జరిగింది. అండర్‌-19 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్‌గా నిలవడం నాకు గర్వకారణం’’ అని యశ్‌ తెలిపాడు.

అదరగొట్టి: ఆస్ట్రేలియాతో పోరులో మొదట బ్యాటింగ్‌లో భారత్‌ తడబడినప్పటికీ.. ‘‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’’ యశ్‌ (110; 110 బంతుల్లో 10×4, 1×6), షేక్‌ రషీద్‌ (94; 108 బంతుల్లో 8×4, 1×6) అద్భుత పోరాటంతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. 37కే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రషీద్‌, యశ్‌ జోడీ ఆదుకుంది. మూడో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.  వీరు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన నిశాంత్‌ (12 నాటౌట్‌), దినేశ్‌ (20 నాటౌట్‌; 4 బంతుల్లో 2×4, 2×6) ఆఖర్లో విధ్వంసమే సృష్టించారు. చివరి 10 ఓవర్లలో భారత జట్టు 108 పరుగులు రాబట్టి.. 290/5తో ఇన్నింగ్స్‌ ముగించింది. ఛేదనలో ఆసీస్‌ 41.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటవడంతో భారత్‌కు 96 పరుగుల తేడాతో విజయం దక్కింది. బౌలర్లలో విక్కీ (3/42), నిశాంత్‌ (2/25), రవి కుమార్‌ (2/37) సమష్టిగా రాణించి ప్రత్యర్థి భరతం పట్టారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే విల్లీ (1)ని ఔట్‌ చేసిన రవి ప్రత్యర్థికి షాకిచ్చాడు. కానీ ఆ తర్వాత క్యాంప్‌బెల్‌ (30), మిల్లర్‌ (38) క్రీజులో నిలబడడంతో ఆ జట్టు ఓ దశలో 71/1తో ప్రమాదకరంగా కనిపించింది. కానీ అద్భుతంగా పుంజుకున్న మన బౌలర్లు 54 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కూల్చారు. లచ్లాన్‌ షా (51) అర్ధసెంచరీతో రాణించినా మరో ఎండ్‌లో క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఆసీస్‌ను ఆలౌట్‌ చేశారు. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం భారత్‌కిది ఎనిమిదోసారి. శనివారం తుదిపోరులో ఇంగ్లాండ్‌తో భారత కుర్రాళ్లు తలపడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని