IND vs SL: లంకేయులు ఉఫ్‌..

టీమ్‌ ఇండియాది అదే జోరు. గత సిరీస్‌లో కరీబియన్లను మట్టికరిపించిన రోహిత్‌ సేన ఇప్పుడు లంకతో సిరీస్‌నూ ఘనంగా మొదలెట్టింది. ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్‌ జోరు ముందు లంక తేలిపోయింది. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసానికి భువి, ఇతర బౌలర్ల

Updated : 25 Feb 2022 07:04 IST

తొలి టీ20లో భారత్‌ ఘనవిజయం
దంచేసిన ఇషాన్‌, శ్రేయస్‌
విజృంభించిన భువి

టీమ్‌ ఇండియాది అదే జోరు. గత సిరీస్‌లో కరీబియన్లను మట్టికరిపించిన రోహిత్‌ సేన ఇప్పుడు లంకతో సిరీస్‌నూ ఘనంగా మొదలెట్టింది. ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్‌ జోరు ముందు లంక తేలిపోయింది. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసానికి భువి, ఇతర బౌలర్ల సూపర్‌ బౌలింగ్‌ తోడైన వేళ.. మొదటి టీ20లో శ్రీలంకను టీమ్‌ ఇండియా చిత్తు చేసింది.

లఖ్‌నవూ: శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భారత్‌కు అదిరే ఆరంభం. అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమ్‌ ఇండియా.. గురువారం మొదటి మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇషాన్‌ కిషన్‌ (89; 56 బంతుల్లో 10×4, 3×6), శ్రేయస్‌ అయ్యర్‌ (57 నాటౌట్‌; 28 బంతుల్లో 5×4, 2×6) చెలరేగడంతో మొదట భారత్‌ 2 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (44; 32 బంతుల్లో 2×4, 1×6) రాణించాడు. భువనేశ్వర్‌ (2/9) ధాటికి ఛేదన ఆరంభంలోనే దెబ్బతిన్న లంక.. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.   6 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. అసలంక (53 నాటౌట్‌; 47 బంతుల్లో 5×4) ఒక్కడే రాణించాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. చాహల్‌ (1/11), జడేజా (1/28) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. గత టీ20 మ్యాచ్‌ (వెస్టిండీస్‌తో)లో ఆడిన తుది జట్టులో ఆరు మార్పులతో ఈసారి టీమ్‌ ఇండియా బరిలోకి దిగింది. దీపక్‌ హుడా టీ20 అరంగేట్రం చేశాడు. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్‌ జడేజాతో పాటు సంజు శాంసన్‌ పునరాగమనం చేశాడు. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మణికట్టు గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో టీ20 శనివారం ధర్మశాలలో జరుగుతుంది.

తేలిపోయిన లంక: భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక తీవ్రంగా తడబడింది. ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. భువనేశ్వర్‌ ఆరంభంలోనే ఆ జట్టును గట్టి దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ నిశాంకను బౌల్డ్‌ చేసిన అతడు.. మూడో ఓవర్లో కమిల్‌ మిషార (13)ను వెనక్కి పంపాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని ఆడబోయిన కమిల్‌.. రోహిత్‌కు చిక్కాడు. చకచకా రెండు వికెట్లు చేజార్చుకున్న లంక.. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. అసలంక, లియనాగె (11) వెంటనే వికెట్‌ పడనివ్వలేదు. కానీ పరుగులు వేగంగా రాలేదు. వెంకటేశ్‌ అయ్యర్‌ వేసిన ఏడో ఓవర్‌ చివరి బంతికి లియనాగె ఔటయ్యే సమయానికి శ్రీలంక స్కోరు 36 పరుగులు మాత్రమే. ఆఫ్‌స్టంప్‌ ఆవల ఆఫ్‌కటర్‌ను ఆడబోయిన లియనాగె ఎడ్జ్‌తో సంజు శాంసన్‌కు చిక్కాడు. ఓ వైపు అసలంక నిలిచినా మరోవైపు నుంచి అతడికి సహకారం లభించలేదు. స్పిన్నర్లూ లంకను దెబ్బతీశారు. చండిమాల్‌ (10), శనక (3)లను జడేజా, చాహల్‌ వరుస ఓవర్లలో ఔట్‌ చేశారు. 11 ఓవర్లలో 60/5తో లంక ఓటమి దాదాపుగా ఖాయమైపోయింది. అసలంక పోరాటాన్ని కొనసాగించినా.. అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికే. చమిక కరుణరత్నె (21) కాస్త నిలవడంతో అతడితో ఆరో వికెట్‌ అసలంక 37 పరుగులు జోడించాడు. కానీ 16వ ఓవర్లో కరుణరత్నెను వెంకటేశ్‌ ఔటే చేసే సమయానికి లంక స్కోరు 97 పరుగులు మాత్రమే. ఆ తర్వాత భారత్‌ విజయం  లాంఛనమే.

ఇషాన్‌ ధనాధన్‌: భారత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ ఆటే హైలైట్‌. టీమ్‌ ఇండియా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. దూకుడైన ఆటతో అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించిన అతడు ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌ కన్నా కూడా ధాటిగా ఆడాడు ఇషాన్‌. మూడో ఓవర్‌ నుంచి అతడి మోత మొదలైంది. కరుణరత్నె వేసిన ఆ ఓవర్లో ఇషాన్‌ వరసగా మూడు బౌండరీలు బాదేశాడు. ఆ తర్వాత లహిరు కుమార ఓవర్లో ఓ పుల్‌ షాట్‌తో స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ కొట్టిన అతడు.. వెంటనే మిడ్‌ వికెట్లో ఫోర్‌ సాధించాడు. మరోవైపు రోహిత్‌ స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తుండగా.. ఇషాన్‌ ఏ దశలోనూ తగ్గలేదు. సర్రున దూసుకొచ్చిన చమీర షార్ట్‌ బాల్‌ను హుక్‌ షాట్‌తో స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌గా మలిచాడు. ఆరు ఓవర్లకు భారత్‌ 58/0తో నిలిచింది. ఆ తర్వాత రోహిత్‌ కూడా జోరందుకున్నాడు. కరుణరత్నె బంతిని ప్యాడిల్‌ స్వీప్‌తో బౌండరీకి తరలించిన అతడు..మోకాలిని వంచుతూ జెఫ్రీ గూగ్లీని స్లాగ్‌ స్వీప్‌తో మిడ్‌ వికెట్లో సిక్స్‌గా మలిచాడు. 10 ఓవర్లకు స్కోరు 98/0. కానీ ఆ తర్వాత పరుగుల వేగం తగ్గింది. ఇక రెచ్చిపోతాడనుకున్న దశలో రోహిత్‌ వెనుదిరిగాడు. 12వ ఓవర్లో లహిరు బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌ ఆడాలనుకున్న అతడు.. బంతి తక్కువ ఎత్తులో రావడంతో బౌల్డయ్యాడు. 10 నుంచి 15 ఓవర్ల మధ్య భారత్‌కు 32 పరుగులే వచ్చాయి. ఇషాన్‌ జోరు కూడా తగ్గడంతో ఈ అయిదు ఓవర్లలో ఒక్క బౌండరీ మాత్రమే వచ్చింది. కానీ 16వ ఓవర్లో మళ్లీ జోరందుకున్న ఇషాన్‌.. లహిరు బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4 దంచేశాడు.

రెచ్చిపోయిన శ్రేయస్‌: అలవోకగా సెంచరీ చేసేలా కనిపించిన ఇషాన్‌... ఓ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో 17వ ఓవర్లో వెనుదిరిగాడు. కానీ పరుగుల ప్రవాహం మాత్రం ఆగలేదు. కారణం శ్రేయస్‌ అయ్యర్‌. లంక బౌలర్లపై భారీ షాట్లతో మరింత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ అతడు.. భారత్‌ ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చాడు. తొలి 12 బంతుల్లో 12 పరుగులే చేసిన అతడు.. ఆఖరి మూడు ఓవర్లలో పెను విధ్వంసం సృష్టించాడు. అతడు ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో చివరి మూడు ఓవర్లలో భారత్‌ ఏకంగా 45 పరుగులు రాబట్టింది. అదిరే షాట్లతో 25 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన అతడు.. జడేజా (3 నాటౌట్‌)తో అభేద్యమైన మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి) లహిరు 44; ఇషాన్‌ కిషన్‌ (సి) లియనాగె (బి) శనక 89; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 57; జడేజా నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 199; వికెట్ల పతనం:   1-111, 2-155; బౌలింగ్‌: చమీర    4-0-42-0; లహిరు కుమార 4-0-43-1; చమిక కరుణరత్నె 4-0-46-0; జయవిక్రమ 2-0-15-0; జెఫ్రీ వాండర్సే    4-0-34-0; దసున్‌ శనక 2-0-19-1

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక (బి) భువనేశ్వర్‌ 0; కమిల్‌ మిషార (సి) రోహిత్‌ (బి) భువనేశ్వర్‌ 13; జనిత్‌ లియనాగె (సి) శాంసన్‌ (బి) వెంకటేశ్‌ 11; అసలంక నాటౌట్‌ 53; చండిమాల్‌ (స్టంప్డ్‌) (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) జడేజా 10; శనక (సి) భువనేశ్వర్‌ (బి) చాహల్‌ 3; చమిక కరుణరత్నె (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) వెంకటేశ్‌ 21; చమీర నాటౌట్‌ 24; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137; వికెట్ల పతనం: 1-0, 2-15, 3-36, 4-51, 5-60, 6-97; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-9-2; బుమ్రా 3-0-19-0; హర్షల్‌ 2-0-10-0; చాహల్‌ 3-0-11-1; వెంకటేశ్‌ అయ్యర్‌ 3-0-36-2; జడేజా 4-0-28-1; హుడా 3-0-24-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని