Published : 07 Jul 2022 03:53 IST

నాదల్‌ కష్టంగా..

వింబుల్డన్‌ సెమీస్‌లో ప్రవేశం
క్వార్టర్స్‌లో హలెప్‌ విజయం

సంచలనం కొద్దిలో తప్పింది. అమెరికా యువ ఆటగాడు ఫ్రిట్జ్‌.. నాదల్‌కు చెమటలు పట్టించాడు. కానీ రఫా అద్భుతంగా పోరాడాడు. ప్రత్యర్థి తీవ్రంగా ప్రతిఘటించినా, ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదురైనా పట్టు వదలని అతడు.. హోరాహోరీ పోరులో నెగ్గి వింబుల్డన్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. కిర్గియోస్‌ కూడా తుది నాలుగులో చోటు సంపాదించాడు. మహిళల సింగిల్స్‌లో హలెప్‌, రిబకినా సెమీస్‌లో అడుగుపెట్టారు.

లండన్‌

రెండో సీడ్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) అతికష్టంపై వింబుల్డన్‌ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం అయిదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో నాదల్‌ 3-6, 7-5, 3-6, 7-5, 7-6 (10-4)తో టేలర్‌ ఫ్రిట్జ్‌పై విజయం సాధించాడు. ఉదరకండరాల సమస్యలతో ఇబ్బందిపడ్డా.. మ్యాచ్‌లో నాదల్‌ గొప్పగా పోరాడాడు. ఫ్రిట్జ్‌ అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాడు. ఆటగాళ్లు మ్యాచ్‌లో అనేకసార్లు బ్రేకులు సాధించి ఆద్యంతం అలరించారు. ముఖ్యంగా నాదల్‌ ముచ్చటైన డ్రాప్‌ షాట్లతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించిన తీరు ఆకట్టుకుంది. దాదాపు నాలుగు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో నాదల్‌ అయిదు ఏస్‌లు, 56 విన్నర్లు కొట్టాడు. నాదల్‌ సెమీఫైనల్లో కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా)ను ఢీకొంటాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో కిర్గియోస్‌ 6-4, 6-3, 7-6 (7-5)తో గారిన్‌ (చిలీ)పై విజయం సాధించాడు. మ్యాచ్‌లో కిర్గియోస్‌ 17 ఏస్‌లు, 35 విన్నర్లు కొట్టాడు. టాప్‌ సీడ్‌ జకోవిచ్‌ (సెర్బియా) ఫైనల్లో చోటు కోసం 9వ సీడ్‌ నోరీ (బ్రిటన్‌)ను ఢీకొంటాడు.

హోరాహోరీ...: నాదల్‌, ఫ్రిట్జ్‌ క్వార్టర్స్‌ సమరం పరస్పర బ్రేక్‌లతో ఆసక్తికరంగా సాగింది. నాదల్‌ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ప్రిట్జ్‌ అనేకసార్లు వెనుకబడ్డా అద్భుతంగా పుంజుకున్నాడు. తొలి సెట్‌ తొలి గేమ్‌లోనే బ్రేక్‌ సాధించిన నాదల్‌.. సర్వీసు నిలబెటెట్టుకుని 2-0 ఆధిక్యంలో నిలిచాడు. కానీ హోరాహోరీ సమరంలో ఆరో గేమ్‌లో బ్రేక్‌ సాధించి స్కోరు సమం చేసిన ఫ్రిట్జ్‌, ఎనిమిదో గేమ్‌లో బ్రేక్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. సర్వీసు కాపాడుకుని తొలి సెట్‌ను చేజిక్కించుకున్నాడు. బలంగా పుంజుకున్న నాదల్‌ రెండో గేమ్‌లో బ్రేక్‌తో మూడో సెట్లో 3-0 ఆధిక్యం సంపాదించాడు. పేలవమైన సర్వీసుతో ఫ్రిట్జ్‌ దెబ్బతిన్నాడు. అయితే బలమైన బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లు ఆడిన అతడు.. అయిదో గేమ్‌లో నాదల్‌ సర్వీసును బ్రేక్‌ చేసి, తన సర్వీసు నిలబెట్టుకుని 3-3తో స్కోరు సమం చేశాడు. నాదల్‌ తర్వాతి గేమ్‌ గెలిచినా.. కాస్త అసౌకర్యంగా కనిపించాడు. పొట్ట నొప్పికి చికిత్స తీసుకున్నాడు. ఇద్దరూ సర్వీసు నిలబెట్టుకుంటూ సాగడంతో టైబ్రేక్‌ తప్పదేమో అనిపించింది. కానీ ఫ్రిట్జ్‌ తప్పిదాలను సొమ్ము చేసుకున్న నాదల్‌ 12వ గేమ్‌లో గెలిచి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాదల్‌ శారీరకంగా ఇబ్బందిపడుతున్నా పోరాటాన్ని కొనసాగించాడు. అయితే ఫ్రిట్జ్‌ పుంజుకున్నాడు. మూడో సెట్‌ మూడో గేమ్‌లో బ్రేక్‌ సాధించాడు. చక్కని సర్వ్‌లతో కడవరకూ ఆధిక్యం నిలబెట్టుకుని సెట్‌ను చేజిక్కించుకున్నాడు. నాలుగో సెట్‌  నువ్వా నేనా అన్నట్లు సాగింది. నాదల్‌ తగ్గలేదు. ఫ్రిట్జ్‌ కూడా అంతే. కార్నర్‌కు ఓ చక్కని బ్యాక్‌ హ్యాండ్‌ విన్నర్‌తో తొలి గేమ్‌లోనే నాదల్‌ బ్రేక్‌ సాధించాడు. కానీ ఆ వెంటనే సర్వీసు పోగొట్టుకున్నాడు. తిరిగి మూడో గేమ్‌లో బ్రేక్‌ సాధించి, ఆ తర్వాత సర్వీసు నిలబెట్టుకున్నాడు. అయితే ఎనిమిదో గేమ్‌లో బ్రేక్‌ సాధించి స్కోరును 4-4తో సమం చేసిన ఫ్రిట్జ్‌.. మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చేశాడు. కానీ ఆ తర్వాత లయ తప్పాడు. మ్యాచ్‌ టైబ్రేక్‌కు దారి తీసేలా కనిపించిన దశలో, 11వ గేములో సర్వీసును చేజార్చుకున్నాడు. తర్వాత అలవోకగా సర్వీసును నిలబెట్టుకున్న నాదల్‌, సెట్‌ను చేజిక్కించుకుని.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక అయిదో సెట్‌కు తీసుకెళ్లాడు. ఆఖరి సెట్లూ ఇద్దరూ పదునైన సర్వీసులు చేశారు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆరో గేమ్‌ ముగిసే సరికి 3-3తో సమంగా నిలిచారు. కానీ ఏడో గేమ్‌లో బ్రేక్‌తో నాదల్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఇక మ్యాచ్‌ను గెలుస్తాడనిపించింది. కానీ మ్యాచ్‌లో నాటకీయత ముగియలేదు. వెంటనే బ్రేక్‌ సాధించిన ఫ్రిట్జ్‌ 4-4తో స్కోరు సమం చేశాడు. సెట్‌ చివరికి టైబ్రేక్‌కు దారి తీసింది. అక్కడ నాదల్‌ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచాడు.

హలెప్‌ ముందుకు..: మాజీ ఛాంపియన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె 6-2, 6-4తో అమెరికాకు చెందిన అమందా అనిసిమోవాపై విజయం సాధించింది. హలెప్‌ సెమీస్‌లో రిబకినా (కజకిస్థాన్‌)తో తలపడుతుంది. మరో క్వార్టర్స్‌లో రిబకినా 4-6, 6-2, 6-3తో టామ్‌జనోవిచ్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించింది. ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్లో సెమీఫైనల్‌ చేరిన మొదటి కజకిస్థాన్‌ ప్లేయర్‌గా రిబకినా ఘనత సాధించింది. మరోవైపు ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సెమీఫైనల్‌ చేరిన తొలి అరబ్‌ మహిళగా ఆన్స్‌ జాబెర్‌ (ట్యునీసియా) చరిత్ర సృష్టించింది. వింబుల్డన్‌ క్వార్టర్‌ఫైనలో ఆమె.. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బౌజ్కోవాను ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జా, మాట్‌ పవిచ్‌ (సెర్బియా) జోడీ ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో సానియా జంట 6-4, 5-7, 4-6తో నీల్‌ (బ్రిటన్‌), క్రాయెసిక్‌ (అమెరికా) చేతిలో పరాజయంపాలైంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని