రిటైర్మెంట్‌ బాటలో బౌల్ట్‌?

కివీస్‌ అగ్రశ్రేణి పేస్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అంతర్జాతీయ క్రికెట్‌ను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ (ఎన్‌జెడ్‌సీ)తో తన కాంట్రాక్టును అతను వదులుకున్నాడు. కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడిపేందుకు అతనీ

Published : 11 Aug 2022 04:10 IST

వెల్లింగ్టన్‌: కివీస్‌ అగ్రశ్రేణి పేస్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అంతర్జాతీయ క్రికెట్‌ను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ (ఎన్‌జెడ్‌సీ)తో తన కాంట్రాక్టును అతను వదులుకున్నాడు. కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడిపేందుకు అతనీ నిర్ణయం తీసుకున్నాడు. బౌల్ట్‌ 78 టెస్టుల్లో 317, 93 వన్డేల్లో 169, 44 టీ20ల్లో 62 వికెట్లు తీశాడు. గత ఏడాది మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కివీస్‌ విజేతగా నిలవడంలో, వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌ల్లో ఫైనల్‌ చేరడంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. విదేశీ పర్యటనల వల్ల తనపై ఎక్కువ భారం పడుతోందని, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందని ఇటీవల 33 ఏళ్ల బౌల్ట్‌.. న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రతినిధులతో చర్చించాడు. ఈ నేపథ్యంలోనే అతని నిర్ణయాన్ని గౌరవిస్తూ కాంట్రాక్టు నుంచి తప్పించారు. జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు బౌల్ట్‌కు ఇప్పటికీ అవకాశం ఉంది. కానీ కాంట్రాక్టు ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యతనిస్తారు. దీంతో అతను రిటైర్మెంట్‌ దిశగా సాగుతున్నాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ‘‘దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలనే కోరిక నాకింకా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించే నైపుణ్యాలున్నాయని భావిస్తున్నా. కానీ జాతీయ కాంట్రాక్టు లేకపోతే జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు సన్నగిల్లుతాయనే నిజాన్ని గౌరవిస్తున్నా. ఓ ఫాస్ట్‌బౌలర్‌గా నాకు స్వల్ప కాల కెరీర్‌ మాత్రమే ఉంటుందని తెలుసు. తర్వాతి దశకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమని అనుకుంటున్నా’’ అని బౌల్ట్‌ తెలిపాడు. ‘‘పూర్తి నిజాయతీగా వ్యవహరించిన బౌల్ట్‌ తన కారణాలను మా ముందుంచాడు. పూర్తిస్థాయి క్రాంటాక్టు ఆటగాడిగా అతణ్ని కోల్పోవడం నిరాశ కలిగిస్తోంది. 2011లో అరంగేట్రం నుంచి అతను జట్టు విజయాలకు గొప్ప సహకారం అందించాడు. ప్రపంచంలోనే అతనిప్పుడు భిన్న ఫార్మాట్లలోని ఉత్తమ క్రికెటర్లలో ఒకడు. అతని ఘనతల పట్ల గర్వపడుతున్నాం’’ అని ఎన్‌జెడ్‌సీ సీఈవో డేవిడ్‌ వైట్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు