బుమ్రా స్థానంలో షమి!

గాయంతో టీ20 ప్రపంచకప్‌కు దూరమైన ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానంలో మహ్మద్‌ షమి ప్రధాన జట్టులోకి ఎంపికయ్యే అవకాశమున్నట్లు టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సంకేతాలిచ్చాడు. ప్రపంచకప్‌ స్టాండ్‌బైల్లో ఒకరిగా ఎంపికైన షమిని.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌ల్లో ఆడించాలని భావించారు.

Published : 07 Oct 2022 03:02 IST

ఇండోర్‌: గాయంతో టీ20 ప్రపంచకప్‌కు దూరమైన ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానంలో మహ్మద్‌ షమి ప్రధాన జట్టులోకి ఎంపికయ్యే అవకాశమున్నట్లు టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సంకేతాలిచ్చాడు. ప్రపంచకప్‌ స్టాండ్‌బైల్లో ఒకరిగా ఎంపికైన షమిని.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌ల్లో ఆడించాలని భావించారు. కానీ కొవిడ్‌ కారణంగా అతను ఈ రెండు సిరీస్‌లకూ దూరమయ్యాడు. షమి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే జట్టులోకి తీసుకునే అవకాశాలున్నట్లు ద్రవిడ్‌ చెప్పాడు. ‘‘ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోవడానికి మాకు అక్టోబరు 15 వరకు సమయం ఉంది. స్టాండ్‌బైల్లో షమి ఒకడు. దురదృష్టవశాత్తూ చివరి రెండు సిరీస్‌ల్లో అతను ఆడలేకపోయాడు. 14-15 రోజుల పాటు కొవిడ్‌తో ఉన్న అతను ప్రస్తుతం ఎంత ఫిట్‌గా ఉన్నాడో చూడాలి. నివేదికలు వచ్చాక తన విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని అతనన్నాడు. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఈ నెల 23న పాకిస్థాన్‌తో భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఆడబోతుండగా.. గురువారం స్వదేశం నుంచి బయల్దేరి రెండు వారాల ముందే పెర్త్‌కు చేరుకుంది. ముందే అక్కడికి వెళ్లడం వల్ల పరిస్థితులు, పిచ్‌లకు అలవాటు పడేందుకు అవకాశముంటుందని ద్రవిడ్‌ తెలిపాడు. ‘‘పెర్త్‌లో రెండు ప్రాక్టీస్‌ సెషన్లు అయ్యాక రెండు వార్మప్‌ మ్యాచ్‌లు కూడా ఆడబోతున్నాం. ఆస్ట్రేలియాలో పేస్‌, బౌన్స్‌ మిగతా చోట్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మా ఆటగాళ్లలో చాలామంది ఆస్ట్రేలియాలో పెద్దగా టీ20 క్రికెట్‌ ఆడలేదు. ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడడానికి సమయం పడుతుంది. ప్రాక్టీస్‌ తర్వాత ఆటగాళ్లకు ఒక అవగాహన వస్తుందనుకుంటున్నా. ఆ తర్వాతే టోర్నీలో వ్యూహాల గురించి ఆలోచిస్తాం’’ అని ద్రవిడ్‌ అన్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లు తమకెంతో ఉపకరించాయని భారత కోచ్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని