Rahul Dravid: ద్రవిడ్‌ ఈ స్థితికి రావడానికి చాలా కష్టపడ్డాడు: రోహిత్‌ శర్మ

టీమ్‌ఇండియాలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో అతడి స్థానంలో రాహుల్‌ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ

Published : 10 Dec 2021 01:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియాలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో అతడి స్థానంలో రాహుల్‌ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో రోహిత్‌ శర్మను నియమించింది బీసీసీఐ. వన్డేల్లో కూడా హిట్‌మ్యానే సారథిగా నియమిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్.. జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాడనే దానిపై నూతన సారథి రోహిత్ శర్మ మాట్లాడాడు. ద్రవిడ్‌కి ప్రతి ఆటగాడితో మంచి అనుబంధం ఉందని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడి నిర్వర్తించాల్సిన పాత్రల గురించి స్పష్టతనిస్తాడని రోహిత్ పేర్కొన్నాడు. అతడిది కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం అని, అది జట్టుపై ప్రభావం చూపుతుందని వివరించాడు. ద్రవిడ్ మార్గదర్శకత్వంలో జట్టులో ఒక ప్రక్రియ, నిర్మాణం ఉందని, ఇది ఆటగాళ్లు మరింత స్పష్టత కలిగి ఉండటానికి సహాయపడుతుందన్నాడు. 

‘రాహుల్ భాయ్ (ద్రవిడ్) ఒక అద్భుతమైన క్రికెటర్. దీంట్లో మనకు ఎలాంటి అనుమనాలు లేవు. అతడు క్రికెట్‌ను ఎలా ఆడతాడో మనందరికీ తెలుసు. అతడు ఇంత ఉన్నతమైన స్థితికి రావడానికి చాలా కష్టపడ్డాడు. అది మా జట్టుపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నా. జట్టులోకి కొత్తగా ఆటగాళ్లు వస్తుంటారు, కొంతమంది వెళ్తుంటారు. వారు జట్టులోకి ఎందుకు వచ్చారు, మిగతా వాళ్లు ఎందుకు దూరం అయ్యారనే దానిపై స్పష్టత ఉంటుంది. ఆటగాళ్లలందరితో ద్రవిడ్‌కి మంచి అనుబంధం ఉంది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి వద్దకు వెళ్లి మాట్లాడతాడు. వారు ఏం అనుకుంటున్నారు? జట్టులో వారు ఎలాంటి పాత్ర కోసం చూస్తున్నారు? జట్టు కోసం వారేం చేయాలనే దానిపై చర్చిస్తాడు’ అని హిట్‌ మ్యాన్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని