Prithvi Shaw: పరుగులు సాధిస్తున్నా.. అవకాశాలే రావట్లేదు: పృథ్వీ షా

చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న యువ ఓపెనర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) ఫిట్‌నెస్‌ సాధించి.. తిరిగి జట్టులోకి చేరేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 

Published : 08 Oct 2022 11:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై భారత యువ ఓపెనర్‌ పృథ్వీ షా అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశవాలీ క్రికెట్‌లో పరుగులు సాదిస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం రావట్లేదని ఆవేదన చెందాడు. ‘‘నేను చాలా నిరాశపడ్డా. నేను పరుగులు చేస్తున్నా. చాలా కష్టపడుతున్నా.. అయినా అవకాశాలు రావట్లేదు’’ అని బాధపడ్డాడు. ఈ మేరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు.

జాతీయ జట్టుకు నేను సిద్ధంగా ఉన్నానని వాళ్లెప్పుడు (సెలెక్టర్లు) భావిస్తారో.. అప్పుడే నన్ను ఆడిస్తారు. ప్రస్తుతానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా. ఇండియా - ఎ అయినా, ఇంకే జట్టయినా నా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తున్నా. అలా నా ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకుంటున్నా

- పృథ్వీ షా 

దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీ షాకు కొంతకాలంగా జాతీయ జట్టులో చోటు లభించట్లేదు. ఇటీవల న్యూజిలాండ్‌ - ఎ, భారత్‌ - ఎ మధ్య జరిగిన సిరీస్‌లో పృథ్వీ మెరుగైన ప్రదర్శనే చేశాడు. అంతకుముందు సెప్టెంబర్‌లో జరిగిన దులీప్‌ ట్రోఫీలోనూ వెస్ట్‌ జోన్‌ తరఫున ఆడి.. రెండు సెంచరీలు కొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు షాకు పిలుపొస్తుందని అనుకున్నారు. అయితే అతడిని ఎంపిక చేయలేదు. 2021 జులైలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో పృథ్వీ షా చివరిసారిగా సీనియర్‌ జట్టుతో కలసి ఆడాడు. ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్‌ ముస్తాఖ్‌ అలీ ట్రోఫీలో ముంబయి తరఫున షా ఆడనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని