Gavaskar: నేను 40 బంతుల్లో పరుగుల ఖాతా తెరిచా.. మ్యాక్స్‌వెల్‌ ఏకంగా సెంచరీ బాదేశాడు: సునీల్ గావస్కర్‌

నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లోనే శతకం బాదేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell)పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు.

Updated : 26 Oct 2023 18:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) (106; 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్సింగ్స్‌ ఆడాడు. ఏకంగా 40 బంతుల్లోనే సెంచరీ బాదేసి ప్రపంచకప్‌లో వేగవంతమైన శతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో నెదర్లాండ్స్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 27 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. తర్వాతి 50 పరుగులను 13 బంతుల్లోనే మూడంకెల స్కోరందుకున్నాండంటే అతడి విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 309 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు.  

‘‘క్రికెట్‌లో అద్భుతమైన షాట్‌లలో రివర్స్ స్వీప్‌ ఒకటి. మ్యాక్స్‌వెల్ ఒకే ఓవర్‌లో రివర్స్‌ స్వీప్‌ షాట్‌తో రెండు సిక్స్‌లు బాదాడు. దాంతో అతడికి బౌలింగ్ ఎలా చేయాలో తెలియక బౌలర్లు అయోమయానికి గురయ్యారు. అతడు అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎదుర్కొన్న బంతుల కంటే రెట్టింపు పరుగులు, స్ట్రెక్‌ రేట్‌ కలిగి ఉన్నాడు. ఇది అద్భుతం. నేను ఓ మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవడానికి 40 బంతులు తీసుకుంటే.. మ్యాక్స్‌వెల్ 40 బంతుల్లో ఏకంగా సెంచరీ బాదేశాడు. ఇది చాలా గొప్ప విషయం’’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు.  ఈ మ్యాచ్‌లో  మ్యాక్స్‌వెల్ 40 బంతుల్లోనే శతకం అందుకుని ఐడెన్ మార్‌క్రమ్‌ రికార్డు బ్రేక్ చేశాడు. మార్‌క్రమ్ ఇదే ప్రపంచకప్‌లో శ్రీలంకపై 49 బంతుల్లో సెంచరీ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని