IND vs WI: వరుసగా మూడో వైట్‌వాష్‌పై కన్నేసిన రోహిత్‌.. ఎవరికి అవకాశం ఇచ్చేనో!

టీమ్ఇండియా సారథి రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వరుసగా మూడో సిరీస్‌ వైట్‌వాష్‌పై కన్నేశాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ చేపట్టిన అతడు తాజాగా టెస్టు క్రికెట్‌ పగ్గాలూ అందుకున్నాడు...

Published : 20 Feb 2022 12:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్ఇండియా సారథి రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వరుసగా మూడో సిరీస్‌ వైట్‌వాష్‌పై కన్నేశాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ చేపట్టిన అతడు తాజాగా టెస్టు క్రికెట్‌ పగ్గాలూ అందుకున్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా అతడి సారథ్యంలో తొలుత న్యూజిలాండ్‌పై 3-0తో టీ20 సిరీస్‌, ఇటీవల విండీస్‌పై 3-0తో వన్డే సిరీస్‌లను వైట్‌వాష్‌ చేసింది. ఇక తాజాగా జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ రోహిత్‌సేన ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ సొంతం చేసుకుంది. దీంతో మరికొద్ది గంటల్లో జరిగే మూడో టీ20 లోనూ విజయం సాధించి మరో సిరీస్‌ వైట్‌వాష్‌ చేయాలని చూస్తోంది.

అయితే, ఇలాంటి కీలక మ్యాచ్‌లో తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు బీసీసీఐ విరాట్‌ కోహ్లీతో పాటు రిషభ్‌ పంత్‌కు పది రోజుల విశ్రాంతి కల్పించడంతో రిజర్వ్‌బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. అందులో ప్రధానంగా రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌లకు చోటు దక్కే వీలుంది. ఈ సిరీస్‌కు ముందు కేఎల్‌ రాహుల్‌ గాయపడటంతో ఇషాన్‌ కిషన్‌కు అవకాశమిచ్చారు. అయితే, అతడు రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమవడంతో ఈసారి రుతురాజ్‌ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది. అలాగే కోహ్లీ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను కూడా పరీక్షించొచ్చు. ఇక బౌలర్ల జాబితాలో దీపక్‌ హూడా, మహ్మద్‌ సిరాజ్‌, అవేశ్‌ ఖాన్‌ సైతం తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు. సీనియర్లు బుమ్రా, షమి ఈ సిరీస్‌కు లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌ రాణించారు. వీరి స్థానాల్లో ఎవరికైనా అవకాశమిస్తారో లేదో చూడాల్సి ఉంది. కాగా, ఈ పర్యటనకు ముందు విండీస్‌ స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 3-2 తేడాతో టీ20 సిరీస్‌ కైవసం చేసుకొని ఆశ్చర్యం కలిగించగా భారత్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. దీంతో ఎలాగైనా ఈ చివరి మ్యాచ్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని