Published : 20 May 2022 01:53 IST

Nikhat Zareen: ఆ కసితోనే కష్టపడింది.. పసిడిని ముద్దాడింది!

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణ యువ మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ వేదికపై అద్భుత ప్రదర్శన ఇచ్చింది. తన కెరీర్లోనే అద్భుతమైన విజయంతో భారతదేశ, తెలంగాణ కీర్తి పతాకను ఎగురవేసింది. బాక్సింగ్‌లో అత్యున్నత టోర్నీ అయిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తన పవర్‌ పంచ్‌లతో ప్రత్యర్థిని చిత్తుచేసి పసిడి పతకాన్ని ముద్దాడి చరిత్ర సృష్టించింది. నిజామాబాద్‌ నుంచి వచ్చిన నిఖత్‌ జరీన్‌.. ప్రపంచ స్థాయిలో తలపడి పసిడి పతకం సాధించేందుకు పడిన కష్టం అంతా ఇంతాకాదు. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ఇబ్బందులు, అవహేళనల్ని ఎదుర్కొంది. 2020 ఒలింపిక్స్‌ ముందు సెలక్షన్స్‌లో వివాదం ఆమెను ఇబ్బంది పెట్టినా.. కుంగిపోలేదు. తానేంటో అందరికీ రుజువు చేయాలనే కసితో కష్ట పడి బరిలోకి దిగిన జరీన్‌ తన ఆటతోనే అందరికీ సమాధానం చెప్పింది. 

మేరీకోమ్‌తో నీకు పోటీయా? అన్నారు!

అది 2020 టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు బాక్సింగ్‌ బెర్తులు ఖరారవుతున్న సమయం. 52 కేజీల విభాగంలో మేరీకోమ్‌ లాంటి దిగ్గజ బాక్సర్‌తో పాటు తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ కూడా పోటీలో ఉన్నారు. అయితే సెలక్షన్స్‌ ఏమీ లేకుండా మేరీకి క్వాలిఫయర్స్‌ బెర్తు కట్టబెట్టింది బాక్సింగ్‌ ఫెడరేషన్‌. నిబంధనలకు విరుద్ధంగా, పోటీ లేకుండా మేరీని నేరుగా ఎంపిక చేయడం న్యాయమా? అని ప్రశ్నించింది నిఖత్‌. మేరీ లాంటి దిగ్గజ బాక్సర్‌తో నీకు పోటీయా? అంటూ ఆమె గురించి ఎగతాళిగా మాట్లాడారందరూ. మేరీ సైతం నిఖత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్కువ చేసి మాట్లాడింది. చివరికి నిఖత్‌ గట్టిగా పోరాడడంతో సెలక్షన్స్‌ పెట్టక తప్పలేదు.

కానీ ఆ పోటీలో మేరీకి గట్టి పోటీనే ఇచ్చినా.. నిఖత్‌ ఓటమి వైపే నిలిచింది. దీంతో మరోసారి నిఖత్‌ విమర్శలు, వేలాకోళాలు ఎదుర్కోక తప్పలేదు. నిబంధనల ప్రకారం ట్రయల్స్‌ నిర్వహించమని అడిగినందుకు ఇంతగా ఎదురు దాడి చేయడం, తన సామర్థ్యాన్ని ప్రశ్నించడం నిఖత్‌ లాంటి యువ బాక్సర్‌ను మానసికంగా ఎంత దెబ్బ తీసి ఉంటుందో అంచనా వేయొచ్చు! అయితే అప్పుడేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన నిఖత్‌ ఆటతోనే అందరికీ సమాధానం చెప్పాలనుకుంది. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించడం ద్వారా ఆ పనే చేసింది. వరుసగా ప్రపంచ స్థాయిలో పతకాలు నెగ్గుతూ తన సత్తా ఏంటో అందరికీ చాటి చెబుతోంది.

ఆ కసితోనే కొన్నాళ్లు ఎవరికీ కనబడలేదట!

దక్షిణాదిన పెద్ద పెద్ద నగరాల నుంచే బాక్సర్లు రావడం తక్కువ. అందులోనూ నిజామాబాద్‌ లాంటి ప్రాంతం నుంచి, పైగా ఓ అమ్మాయి బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం.. ఈ ఆటలో ప్రపంచ స్థాయికి ఎదగడం అంత తేలికైన విషయం కాదు. పాఠశాల స్థాయిలో అథ్లెటిక్స్‌ ఆడుతూ.. ఆ తర్వాత బాక్సింగ్‌పై మక్కువ పెంచుకుని ప్రొఫెషనల్‌గా మారిన నిఖత్‌. ఇంకో రెండేళ్లకే ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం సాధించి ఔరా అనిపించింది. జూనియర్‌ స్థాయిలోనూ  ఆ ప్రదర్శనతో ఆమెపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో రెండు సార్లు గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది. 

అయితే సీనియర్‌ స్థాయిలో అడపా దడపా కొన్ని విజయాలు సాధించినా, అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు సాధించినా.. జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌ అయ్యాక తనపై నెలకొన్న అంచనాలను మాత్రం నిఖత్‌ అందుకోలేకపోయిన మాట వాస్తవం. తన విభాగంలో మేరీకోమ్‌ లాంటి దిగ్గజ బాక్సర్‌ ఉండడం కూడా తన అవకాశాలకు అడ్డంకిగా మారింది. దీనికి తోడు 2020 ఒలింపిక్స్‌ ముంగిట సెలక్షన్స్‌ వివాదం నిఖత్‌ను బాగా ఇబ్బంది పెట్టింది. ఈ వివాదంతో కుంగిపోకుండా.. తనేంటో అందరికీ రుజువు చేయాలనే కసితో కష్టపడింది నిఖత్‌. ఈ క్రమంలోనే కొన్నాళ్ల పాటు నిఖత్‌ ఎవ్వరికీ కనిపించలేదు. ఫిట్‌నెస్‌ మీద దృష్టిసారించి, ఆటలో సాంకేతికంగా మెరుగులు దిద్దుకుని బౌట్‌లకు సిద్ధమైంది. రెండు నెలల కిందటే ప్రతిష్టాత్మక స్టాంజా బాక్సింగ్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం కొల్లగొట్టడంతోనే నిఖత్‌ ఎంత మెరుగైందో అందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ తన సత్తా ఏంటో చూపించింది. ఫైనల్స్‌లోనూ ఎంతో వ్యూహాత్మకంగా ఆడిన నిఖత్‌..  బౌట్‌ ఆరంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించింది. రింగ్‌లో దూకుడుగా కదిలిన ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. దూకుడుగా ఆడి ప్రత్యర్థిని మట్టికరిపించడం ద్వారా పసిడి పతకాన్ని ముద్దాడి చరిత్ర సృష్టించింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని