Team India: పిచ్‌ వల్లే భారత్‌కు ఓటమి.. ఇందులో ఆసీస్‌ గొప్పేమీ లేదు: కైఫ్

 పుష్కరం తర్వాత స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను టీమ్‌ఇండియా సొంతం చేసుకోవాలనే ఆశలకు ఆస్ట్రేలియా గండి కొట్టింది. తుది పోరులో గెలిచిన ఆసీస్‌ కప్‌ను సొంతం చేసుకుంది.

Published : 17 Mar 2024 13:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ (ODI World Cup 2023) ఓటమి.. ప్రతి భారత క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి సమరోత్సాహంతో తుది పోరుకు చేరిన రోహిత్‌ సేనకు ఆస్ట్రేలియా (IND vs AUS) అడ్డుగా నిలిచింది. మూడోసారి వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకోవాలన్న ఆశలకు బ్రేక్‌ వేసింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో టీమ్‌ఇండియా పరాజయం పాలైంది. ఆసీస్‌ గొప్పగా ఆడటం కంటే .. భారత తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయని ఓటమిపై కొందరి వాదన. ప్రత్యర్థి జట్టును ఇరుకున పెట్టాలని భావించి ‘స్లో పిచ్‌’ రూపొందిస్తే.. అదే బూమరాంగ్‌ అయిందని మాజీ క్రికెటర్లు విశ్లేషించారు.  తాజాగా ఇదే అంశంపై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్‌ ఓ చర్చా కార్యక్రమంలో స్పందించాడు.

‘‘వరల్డ్‌ కప్ ఫైనల్‌కు ముందు నేను మూడు రోజులపాటు అక్కడే ఉన్నా. రోహిత్, రాహుల్‌ ప్రతి రోజూ పిచ్‌ను పరిశీలించారు. దాదాపు గంటపాటు అక్కడే ఉండేవారు. పిచ్‌ మారిపోతుందని నేను గమనించా. ఎందుకంటే పిచ్‌పై నీళ్లు చల్లలేదు. ట్రాక్‌పై పచ్చిక లేదు. ఆసీస్‌కు భారత్‌ స్లో పిచ్‌ ఇవ్వాలని భావించింది. అభిమానులు నమ్మకపోయినా ఇదే నిజం. ఎందుకంటే ఆసీస్‌లో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. వారికి స్లో పిచ్‌ ఇవ్వడం వల్ల పేసర్లకు ఇబ్బంది ఎదురవుతుందని భారత్ భావించింది. కానీ, అదే మనం చేసిన పొరపాటు. 

ఇక్కడ క్యురేటర్‌ కావాలనే చేశాడని.. ఎవరూ ప్రభావితం చేయలేదని చాలామంది అంటున్నారు. అదంతా చెత్త వాదన. పిచ్‌ను పరిశీలిస్తున్నప్పుడు.. కనీసం రెండు మాటలైనా చెప్పి ఉంటారు. క్యూరింగ్‌ చేయొద్దు, పచ్చికను తొలగించాలి. ఇదే ఇక్కడ జరిగింది. స్వదేశంలో ఆడుతున్నప్పుడు మనకు అడ్వాంటేజ్‌గా ఉండేటట్లు చూశారు. కానీ, కమిన్స్‌ మాత్రం చెన్నై మ్యాచ్‌ నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు. ఫైనల్‌లో ఎవరూ మొదట ఫీల్డింగ్‌ ఎంచుకోవడానికి ఆసక్తి చూపరు. భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని కట్టడి చేయాలని చూస్తారు. అయితే, స్లో పిచ్‌ మీద తొలుత బ్యాటింగ్‌ కష్టంగా ఉంటుందని కమిన్స్ గ్రహించాడు. దీంతో టాస్‌ నెగ్గాక ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో పిచ్‌తో ఇబ్బంది పడ్డాం’’ అని కైఫ్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని