కొట్టమనే రోహిత్‌కు బంతులేసినట్టుంది!

షార్జా వేదికగా జరిగిన మ్యాచులో రోహిత్‌శర్మ అత్యుత్తమంగా ఎలా బాదుతాడో తెలుసుకొనేందుకే కోల్‌కతా బౌలర్లు బంతులు విసిరారేమో అనిపిస్తోందని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. ముంబయిపై డీకేసేన బౌలింగ్‌ దాడి ఏ మాత్రం బాగాలేదని విమర్శించాడు. నడుము మీదుగా వచ్చే బంతుల్ని హిట్‌మ్యాన్‌...

Published : 24 Sep 2020 17:54 IST

మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అబుదాబి వేదికగా జరిగిన మ్యాచులో రోహిత్‌శర్మ అత్యుత్తమంగా ఎలా బాదుతాడో తెలుసుకొనేందుకే కోల్‌కతా బౌలర్లు బంతులు విసిరారేమో అనిపిస్తోందని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. ముంబయిపై డీకేసేన బౌలింగ్‌ దాడి ఏ మాత్రం బాగాలేదని విమర్శించాడు. నడుము మీదుగా వచ్చే బంతుల్ని హిట్‌మ్యాన్‌ అలవోకగా స్టేడియం బయటకు దాటించగలడని ప్రశంసించాడు.

కోల్‌కతాతో బుధవారం జరిగిన పోరులో ముంబయి 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ (80; 54 బంతుల్లో 3×4, 6×6), సూర్య కుమార్‌(47; 28 బంతుల్లో 6×4, 1×6) వీరవిహారం చేశాడు. హిట్‌మ్యాన్‌ సిక్సర్లతో చెలరేగగా సూర్య సొగసైన బౌండరీలు బాదేశాడు. డీకే సేన బౌలర్లు విసిరిన బౌన్సర్లు, ఫుల్‌ లెంగ్త్‌ బంతులను రోహిత్‌ శిక్షించాడు. షార్ట్‌ ఆర్మ్‌ పుల్‌ షాట్లతో స్టేడియం బయటకు దాటించాడు. కేవలం ఈ షాట్లతోనే దాదాపు 35 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఛేదనకు దిగిన కోల్‌కతాను బౌల్ట్‌, ప్యాటిన్‌సన్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసి భారీ దెబ్బకొట్టారు. దాంతో డీకే బృందం 146 పరుగులే చేయగలిగింది.

‘రోహిత్‌ శర్మ భీకరమైన ఆటగాడు. అతడు ఫుల్‌లెంగ్త్‌, షార్ట్‌పిచ్‌ బంతుల్ని శిక్షించగలడు. షార్ట్‌ఆర్మ్‌ పుల్‌‌ షాట్లతో సిక్సర్లు బాదేస్తాడు. అతడిలోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను చూసేందుకే కోల్‌కతా బంతులు విసిరినట్టు అనిపించింది. వాటిని అతడు సునాయసంగా ఆడేశాడు. సరైన లెంగ్త్‌లను దొరకబుచ్చుకోవడంలో కోల్‌కతా బౌలర్లు విఫలమయ్యారు. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన శైలిలో మురిపించాడు. ఒకప్పుడు టీ20లే ఆడగలడనుకున్న అతడు అన్ని ఫార్మాట్లు ఆడగలనని నిరూపిస్తున్నాడు. మ్యాచ్‌ పరిస్థితులకు అనుగుణంగా స్ట్రైక్‌రేట్‌ను మారుస్తున్నాడు. పరిణతి కలిగిన బ్యాటర్‌గా ఎదిగాడు’ అని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోలో సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని