SA vs IND: సఫారీలతో రెండో టెస్టు.. అతడి కంటే అశ్విన్‌ను తీసుకోవడమే బెటర్: భారత మాజీ క్రికెటర్

సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు శార్దూల్ ఠాకూర్‌ను తుది జట్టు నుంచి తప్పించి అశ్విన్‌(Ravichandran Ashwin)ని కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) సూచించాడు. 

Published : 02 Jan 2024 10:47 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో విఫలమై ఓటమిపాలైన టీమ్‌ఇండియా.. రెండో టెస్టులో పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. ఇందుకు రోహిత్ సేన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, జట్టు కూర్పు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారీగా పరుగులిచ్చిన శార్దూల్ ఠాకూర్‌ను తుది జట్టు నుంచి తప్పించి అశ్విన్‌(Ravichandran Ashwin)ని కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) సూచించాడు. శార్దూల్ స్థానంలో జడేజాను తీసుకోవాలన్నాడు.

‘‘నేనైతే అశ్విన్‌ను తుదిజట్టులో కొనసాగించేందుకు మొగ్గుచూపుతా. శార్దూల్ ఠాకూర్ కంటే అశ్విన్ బెటర్. అతడు ఐదు వికెట్లు పడగొట్టకపోయినా ఒకట్రెండు వికెట్లు తీస్తాడు. శార్దూల్ స్థానంలో జడేజాను తీసుకోవాలి. అశ్విన్‌, జడేజా ద్వయం కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంది. వీరు సమష్టిగా 4-5 వికెట్లు పడగొట్టగలరు. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఇరుకునపెట్టాలంటే స్పిన్నర్లే కీలకం. భారత్ గట్టిగా ప్రయత్నిస్తే అక్కడ సౌతాఫ్రికాను ఓడించవచ్చు. ఒక్క టెస్టు మాత్రమే ఆడిన ప్రసిద్ధ్‌ కృష్ణను ఇప్పుడు తుది జట్టు నుంచి తప్పించడం సరికాదు’’ అని క్రిస్‌ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.  

కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ స్టేడియం సౌతాఫ్రికా టీమ్‌కు పెట్టని కోట. ఇక్కడ భారత్, సౌతాఫ్రికా మధ్య ఆరు టెస్టులు జరగ్గా.. ఒక్కదాంట్లోనూ టీమ్‌ఇండియా నెగ్గలేదు. 4 మ్యాచ్‌ల్లో సఫారీలు విజయం సాధించగా.. రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు