Virat Kohli: వన్డేల్లో కోహ్లీ 49వ సెంచరీ.. నేను అలా అనడం తప్పే: శ్రీలంక కెప్టెన్

టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల సౌతాఫ్రికాపై సెంచరీ వన్డేల్లో 49వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీనిపై కామెంట్ చేసి విమర్శలపాలైన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ (Kusal Mendis) అలా జరగడానికి గల కారణాన్ని వివరించాడు.  

Updated : 13 Nov 2023 16:10 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ బాదాడు. ఈ క్రమంలోనే తన వన్డే కెరీర్‌లో 49వ సెంచరీ పూర్తి చేసి.. సచిన్‌ తెందూల్కర్‌ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. 277వ ఇన్నింగ్స్‌ల్లో  కోహ్లీ ఈ ఫీట్‌ అందుకోగా.. సచిన్‌ 452 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. అయితే, కోహ్లీ శతకం గురించి ఓ ప్రెస్‌మీట్‌లో శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్‌ (Kusal Mendis) కామెంట్‌ చేసి విమర్శలపాలయ్యాడు. వన్డే కెరీర్‌లో 49వ సెంచరీ చేసి అత్యధిక శతకాలు రికార్డును సమం చేసినందుకు కోహ్లీని అభినందించాలనుకుంటున్నారా అని జర్నలిస్ట్ అడిగాడు. దీనికి మెండిస్ ‘‘నేను అతనిని ఎందుకు అభినందిస్తాను?’’(నవ్వుతూ) అని  సమాధానమిచ్చాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ మెండిస్‌పై విమర్శలు చేశారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన మెండిస్‌.. తాను అలా చేసి ఉండకూడదని, అలా జరగడానికి గల కారణాన్ని వెల్లడించాడు.    

‘‘ఆ రోజు నేను ప్రెస్ కాన్ఫరెన్స్‌కి వెళ్లాను. విరాట్ సెంచరీ చేశాడనే విషయం నాకు తెలియదు. అకస్మాత్తుగా ఓ జర్నలిస్ట్ ఆ ప్రశ్న అడగడంతో నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతేకాదు నాకు ఆ ప్రశ్న స్పష్టంగా అర్థం కాలేదు. 49 వన్డే సెంచరీలు సాధించడం అంత తేలికైన పని కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ ఒకడు. నేను చెప్పింది పూర్తిగా తప్పు అని తర్వాత గ్రహించాను. ఏది ఏమైనా నేను అలా స్పందించి ఉండకూడదు’’ అని కుశాల్ మెండిస్ వివరించాడు. 


కోహ్లీ సెంచరీ.. మహ్మద్‌ హఫీజ్‌కు కౌంటర్‌ ఇచ్చిన మైఖేల్ వాన్ 

కోహ్లీ సౌతాఫ్రికాపై సెంచరీ బాది వన్డేల్లో 49వ శతకం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం కోసం కోహ్లీ స్వార్థంగా ఆడాడని పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ మహ్మద్ హఫీజ్ విమర్శించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌ (Michael Vaughan) తనదైన శైలిలో హఫీజ్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓడిపోయిన వెంటనే ‘‘విరాట్‌ కోహ్లీలాగే పాకిస్థాన్‌ ఆటగాళ్లకు కొంత స్వార్థం అవసరం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ మహ్మద్‌ హఫీజ్‌ని ట్యాగ్‌ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ నాలుగు మ్యాచ్‌ల్లోనే గెలిచి సెమీస్‌కు దూరమైంది. పాక్ ఆటగాళ్లకు గెలవాలనే స్వార్థం లేకపోవడం వల్లే నాకౌట్‌కు చేరుకోలేకపోయారని అర్థం వచ్చేలా మైఖేల్‌వాన్‌ ఆ పోస్టు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని